నవదీప్ కౌర్
అందాల పోటీలు పెళ్లికాని యువతులకే అనే పేరుంది. కానీ, పెళ్లయి, బిడ్డలున్నా తమ ఘనతను చాటేలా మిసెస్ ఇండియా, మిసెస్ వరల్డ్ పోటీలూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని లాస్ వెగాస్‌లో ‘మిసెస్ వరల్డ్–2022’ వివాహిత మహిళల కోసం సరికొత్త శైలిలో జరగనుంది. 80 దేశాల నుంచి అందమైన శ్రీమతులు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. భారత దేశం నుంచి నవదీప్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తోంది.
మిసెస్ ఇండియా వరల్డ్ (2020–21లో) విజేతగా నిలిచిన 38 ఏళ్ల నవదీప్ కౌర్ ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా స్టీల్ హబ్‌లో పుట్టి పెరిగింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. స్టీల్ హబ్ నుండి మిసెస్ ఇండియా వరల్డ్‌గా మారే వరకు నవదీప్ ప్రయాణం వివాహిత మహిళలను చైతన్యపరిచే దిశగా కొనసాగుతోంది.
వ్యక్తిత్వ వికాస కోచ్
నవదీప్ కౌర్‌కి పెళ్లయి ఏడేళ్లు. ఐదేళ్ల కూతురు ఉంది. ఆరేళ్లుగా పాఠశాల స్థాయి విద్యార్థులకు చదువులో శిక్షణా తరగతులు తీసుకుంటుంది. కొటక్‌మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత హెచ్‌ఆర్, మార్కెటింగ్ గ్రాడ్యుయేషన్ కోసం మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస కోచ్‌గా ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది.
దేశం గర్వించేలా కృషి
కిందటేడాది మిసెస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటి నుండే నవదీప్ మిసెస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘నా చిన్ననాటి నుంచి ప్రపంచపటంలో మన దేశాన్ని నేను సైతం గొప్పగా చూపించాలనుకునేదాన్ని. అందుకోసం ప్రతి విభాగంలో పనిచేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను’ అని తన జీవిత కల గురించి వివరిస్తుంది నవదీప్ కౌర్.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేడీస్ సర్కిల్ ఇండియా, రూర్కెలా సిటీ లేడీస్ సర్కిల్‌తో అనుబంధం కలిగి ఉన్న నవదీప్ కౌర్ ఈ ప్రపంచాన్ని అందరూ జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చలన్న ఆకాంక్షనూ వెలిబుచ్చుతుంది. మిసెస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి వెళ్లిన నవదీప్ కౌర్‌కు ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెబుదాం.
గ్రాండ్ ఫినాలేను భారత కాలమానప్రకారం జనవరి 16న ఉదయం 6:30 గంటలకు ఆన్‌లైన్ ద్వారా చూసి, తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment