గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మొదటిది అధ్యాపనం కాగా రెండవది– పితయజ్ఞస్య తర్పణం. మనకు ముందుపుట్టి మనకు జన్మనిచ్చిన వాళ్లున్నారు... తల్లిదండ్రులు. లోకంలో ఎవరి రుణం అయినా తీర్చుకోగలమేమో కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం అంటారు రామచంద్రమూర్తి రామాయణంలో. . సౌత్రామణి అని ఒక యాగం. అది చేస్తే పితరుణం తీరుతుంది. కానీ మాతరుణం ? ఎవ్వరికీ సాధ్యం కాదు.
రుణం తీరడం లేదా తీర్చుకోవడమంటే ??? నీ జన్మ చరితార్థం కావాలంటే... గహస్థాశ్రమంలో తల్లిదండ్రులకు నమస్కరించి సేవచేయడమే. శంకరో తీతి శంకరః..శంకరుడు ప్రతి ఇంటా ఉన్నాడు... తండ్రి రూపంలో.. అంటే కన్న తండ్రి సాక్షాత్ పరమ శివుడే. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే పరమశివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించినట్లే. తల్లికయినా అంతే...‘‘భూప్రదక్షిణ షష్టే్కన కాశీయాత్రాయుతేనచ /సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతవందనే’’ అంటూ గహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంత వెసులుబాటు కల్పించింది శాస్త్రం.
అమ్మకు నమస్కరిస్తే... ఆరుసార్లు భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్లు, 10వేల సార్లు కాశీయాత్ర చేసినట్లు, నూరు పర్యాయాలు సేతుస్నానం చేసినంత ఫలం దక్కుతుందన్నది. అందువల్ల కంటిముందు కనిపించే దేవతలయిన అమ్మానాన్నల విషయంలో గహస్థు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తే ఈశ్వరుడు ప్రీతి పోందుతాడు. ఎవరు ఏది చేయాలో అది నిజాయితీగా చేయాలి.
తల్లిదండ్రులు ఉన్నప్పుడో లేనప్పుడో నీ వాటా ఆస్తులు లేదా వారికోసం నీవు పెట్టే ఖర్చులు లెక్కలు వేసుకోవడం కాదు... వారు నీకిచ్చిందేమిటన్నది ద్రవ్య రూపంలో లెక్కలేసుకోకు. సంతోషంగా నువ్వు నూరేళ్ళు పిల్లా΄ాపలతో హాయిగా ఉండాలని తప్ప వారు నీనుంచి ఆశిందేముంటుంది ? నాకు తెలిసిన ఒక మిత్రుడి తల్లి చనిపోతే ... ఆస్తుల వాటా ప్రస్తావన వచ్చినప్పడు నీవాటాకేం వచ్చిందంటే... రాలేదు.. నేనే తీసుకున్నా..అన్నాడు. ఏమిటవి అని అడిగితే.. అమ్మ వాడిన చెప్పులు, కళ్ళద్దాలు.. అన్నాడు... అమ్మ వాడిన అద్దాలు నా గుండెమీద పెట్టుకుంటే అమ్మ నన్ను చూస్తూ ఉన్నట్టే ఉంటుంది..
అమ్మ వాడిన అరిగిపోయిన చెప్పులు... నాకోసం ఆమె అరగదీసుకున్న, కరగదీసుకున్న జీవితాన్ని గుర్తుకు తెస్తుంటుంది... అన్నాడు... ఇవి చాలవూ నాకు... అమ్మ పోయినా ఆమెను రోజూ చూసుకోవడానికి.. అన్నాడు. అదీ కతజ్ఞత. అందుకే వారు చనిపోయిన రోజున పరమ భక్తితో, గౌరవంతో తోడబుట్టినవారందరూ కలిసి తల్లిదండ్రులను స్మరించుకోవడానికే శ్రాద్ధం, తద్దినం ఆచారంగా మారింది. అది శ్రద్ధతో చేయాల్సిన పని కాబట్టి శ్రాద్ధం అయింది. అంతేగానీ దానికి ఫలానా వస్తువులే ఉండితీరాలన్న నియమాలేమీ లేవు...
రామాయణంలో...రాముడు గారపిండి ముద్దలు తీసుకెళ్ళి తండ్రి దశరథుడిని స్మరించి పితదేవతలకు పిండం పెట్టాడు. కౌసల్యాదేవి అటుగా వెడుతూ చూసి భోరున ఏడ్చింది. అంటే యజమాని ఏది తింటే పితదేవతలకు అదే పెట్టాలంది శాస్త్రం. రాముడు ఆ సమయంలో అదే తింటున్నాడు కాబట్టి అదే పెట్టాడు. కావలసింది శ్రద్ధ. అందువల్ల గహస్థు తన విహిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అది తర్పణం. అది మహా యజ్ఞం. గృహస్థు చేయాల్సిన పంచమహా యజ్ఞాలలో ఇది ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment