క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్‌ ! | Pregnant Olympians Push The Boundaries Of Possibility In Paris | Sakshi
Sakshi News home page

క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్‌ !

Published Fri, Aug 9 2024 10:43 AM | Last Updated on Fri, Aug 9 2024 11:37 AM

Pregnant Olympians Push The Boundaries Of Possibility In Paris

పారిస్‌ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్‌బైజాన్‌ ఆర్చర్‌ యైలగుల్‌ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్‌ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్‌ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!

చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్‌ యైలగుల్‌ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్‌ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్‌ రౌండ్‌ 1/32లో 28వ ర్యాంక్‌ చైనీస్‌ ఆర్చర్‌ ఆన్‌ క్విక్సువాన్‌ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్‌లో జర్మనీకి చెందని మిచెల్‌ క్రోపెన్‌ చేతిలో నిష్క్రమించింది. 

గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్‌ ప్రదర్శించాను. అలాగే ఈ  ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. 

ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్‌ఏకి చెందిన మాజీ ఎన్‌సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.

(చదవండి: ఆన్‌లైన్‌లో ఆక్యుపంక్చర్‌ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..‍కట్‌ చేస్తే..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement