సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి.
మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం.
పదేళ్ల వయసు నుంచే
సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్‌వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్‌లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్‌లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది.
70 లక్షల ఖర్చు
అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. ‘ఇన్‌స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్‌స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్‌లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి.
పైలెట్‌గా ఉద్యోగం
‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్‌లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్‌లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి.
ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ.
Comments
Please login to add a commentAdd a comment