రెండో కాన్పు అయ్యాక పుట్టింటికి వచ్చిన అనురాధకు ఇరుగు పొరుగు ఆడవాళ్లు ‘కొంచెం ఇంగ్లిష్ నేర్పించమ్మా’ అని అడిగారు. ఆమె నేర్పడం మొదలెట్టింది. ఒకరా ఇద్దరా... ఇలాంటి వారు దేశంలో దాదాపు 46 కోట్ల మంది ఉన్నారని గ్రహించింది. సొంత భాషలతో ఇంగ్లిష్ నేర్పే యాప్‌ను మొదలెట్టింది. ఇప్పుడామె ‘మల్టీభాషి’ యాప్ ద్వారా 15 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇంగ్లిష్ వస్తే ఏమవుతుంది అని కొందరు అడుగుతుంటారు. ఇంగ్లిష్ వస్తే ఇలాంటి విజయం వస్తుందని అనురాధ నిరూపిస్తోంది.
ఇంటి భాషను ఎవరు ప్రేమించరు? అమ్మ నోటి నుంచి మొదటిగా వినే భాషను ఎవరైనా కాదనుకుంటారా? కాని ఇంగ్లిష్ వంటి అన్యభాష ప్రపంచానికి చుక్కానిగా మారినప్పుడు అది నేర్చుకోవాలి కదా. అది కూడా మన నోటికి రావాలి కదా. అది రాక, అది రావాల్సిన సమయాల్లో నోరు పెగలక, ముందుకు పడాల్సిన అడుగు వెనక్కు పడడటం పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన భారతీయులందరికీ తెలుసు. ఇక చదువు, అన్యభాషలు మగవారికే అన్న భావజాలం ఉన్న చోట స్త్రీలకు అది మరింత దూరంగా ఉండే గమ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అనురాధా అగర్వాల్ ఇంగ్లిష్ టీచర్‌గా మారి దేశానికి ఆ భాష నేర్పే పనిలో పడింది. ఆమె తయారు చేసిన ‘మల్టీభాషి’ యాప్ 11 భారతీయ భాషల ద్వారా ఇంగ్లిష్ నేర్పిస్తోంది. అలాగే ఇంగ్లిష్ ద్వారా ఆ భారతీయ భాషలను నేర్చుకునేలా చేస్తోంది. ఇప్పుటికి 15 లక్షల మంది ఆమె తయారు చేసిన పాఠాలను వింటున్నారు.
పెళ్లి తప్పించుకున్న అమ్మాయి
అనురాధా అగర్వాల్‌ది జైపూర్. మార్వాడీ కుటుంబం. అక్కడి సామాజిక పరిస్థితుల వల్ల ఆడపిల్ల పదో తరగతి పాస్ అవడంతోటే పెళ్లి చేయడం ఆనవాయితీ. అనురాధ తల్లిదండ్రులు కూడా ఆమెకు 15 ఏళ్లు రావడంతోటే అదే ఆలోచించారు. అయితే అనురాధా అదృష్టం ఏమిటంటే వాళ్లకు సంతృప్తిస్థాయి వరుడు దొరకలేదు. దాంతో ఇంటర్ చదవింది. ఇంకా వరుడు దొరక్క పోయేసరికి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చేసి ఎంబిఏ కూడా చేసింది. 2013లో పెళ్లయ్యాక భర్తతో కలిసి గుర్‌గావ్ చేరుకుంది. వాళ్లిద్దరూ కలిసి ఒక ఫైనాన్స్ సంస్థను ప్రారంభించారు. అది భర్త ఆలోచన. అక్కడికి పెట్టుబడి కోసం స్టార్టప్ ఐడియాలతో వచ్చే వారిని ఆమె గమనించేది.
ఐడియా ఇచ్చిన పుట్టిల్లు
రెండవ కాన్పు అయ్యాక విశ్రాంతి కోసం అనురాధ జైపూర్ చేరుకుంది. అక్కడ ఆమెను కలిసిన ఇరుగు పొరుగు ఆడవాళ్లు ‘మాకు కాస్త ఇంగ్లిష్ నేర్పించమ్మా’ అని అడిగారు. వారు రకరకాల ఆర్థిక స్థాయులు ఉన్నవారు. కాని ఇంగ్లిష్ భాష రాకపోవడంలో సరిసమానంగా ఉన్నారు. ఎలాగూ ఖాళీగా ఉన్నాను కదా అని ఆమె ఒక వాట్సప్ గ్రూప్ పెట్టి కొన్ని పాఠాలు రికార్డు చేసి అందులో పెట్టడం మొదలెట్టింది. అయితే వారందరూ ‘మాకు గ్రామర్ వద్దు. మాట్లాడటం రావాలి. హోటల్‌కు వెళ్లినప్పుడు, సరుకుల అంగడికి వెళ్లినప్పుడు అవసరమైన ఇంగ్లిష్ కావాలి. అది మా మాతృభాష ద్వారా మాకు అర్థమయ్యేలా చెప్పాలి’ అన్నారు. అనురాధ ఆ అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని పాఠాలు మొదలెట్టింది. రాజస్థానీ భాషలో ఇంగ్లిష్‌ను వివరిస్తూ సంభాషణలు రికార్డ్ చేసింది. ఇవి అందరికీ నచ్చాయి.
ఈ పని అనురాధాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇవి మరింత మందికి ఉపయోగపడాలని ఒక ఫేస్‌బుక్ పేజీ తెరిచి వాటిలో ఆ పాఠాలను పోస్ట్ చేసింది. అక్కడా ఆదరణే. అప్పుడే ఒక వ్యక్తి ఆమెకు ‘మా అమ్మ బెంగాలీ. బెంగాలీ భాషలో ఇంగ్లిష్ పాఠాలు తయారు చేస్తే ఆమెకు ఉపయోగపడతాయి’ అని మెసేజ్ చేశాడు. ఒక్కసారిగా ఆమెకు మబ్బు తొలిగిపోయింది. దేశమంతా ఇంగ్లిష్ కావాల్సినవారు ఉన్నారు అని గ్రహించింది. వారందరికీ జన్మతః మాతృభాష వచ్చు. ఆ మాతృభాషతో వారికి ఇంగ్లిష్ నేర్పించాలి అని గ్రహించింది. అలా వచ్చిన ఆలోచనే ‘మల్టీభాషి’ యాప్. బెంగళూరు లో ఇందుకోసం ఆఫీస్‌ను స్థాపించింది.
మల్టీభాషి
మన దేశం బహుభాషల దేశం. ఒక్కో భాషలో ఒక్కోదేశానికి సరిపడినంతమంది ఉన్నారు. వీరందరికీ వారి వారి మాతృభాషల్లో పాఠాలు చెప్పాలని ‘మల్టీభాషి’ స్టార్టప్ మొదలెట్టింది. దేశంలో దాదాపు 46 కోట్ల మంది భారతీయులు ఇంగ్లిష్ భాష అవసరంలో ఉన్నారని ఆమె అంచనా. అందుకే పదకొండు భాషల్లో ఇంగ్లిష్ భాషను నేర్పించేలా ఈ యాప్‌ను తయారు చేసింది. అలాగే ఇంగ్లిష్ ద్వారా ఆ భాషలు నేర్చుకునే పాఠాలు కూడా ఈ యాప్ సమకూరుస్తుంది. అయితే భాషను నేర్పించడం అనేది పెద్ద పని. పైగా ఇన్ని భాషల ద్వారా అంటే ఇంకా పెద్ద పని. అనురాధ తన యాప్ కోసం 25 మంది కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. వీరిలో ఎక్కువమంది మహిళలే. ఇక పాఠాలు తయారు చేసేపని లో దేశవాప్తంగా 600 మంది ఉన్నారు. వీరిలో కూడా ఎక్కువమంది స్త్రీలకే అవకాశం వచ్చింది. ‘వారి కుటుంబ జీవనానికి భంగం కలగకుండా పని చేసే గంటల్లో సౌలభ్యం ఇస్తాను’ అంటుంది అనురాధ. ఈ యాప్ ద్వారా ఇప్పటికి 15 లక్షల మంది పాఠాలు వింటున్నారు. కేవలం 200 చెల్లించి పాఠాలు పొందవచ్చు. గరిష్టంగా 5 వేలు ఫీజు ఉంటుంది.
స్త్రీలు పని చేయాలి
‘స్త్రీలు పిల్లల్ని పెంచడానికే ఎక్కువ ఇష్టపడతారు. అయితే వారు పని చేయడాన్ని కూడా ఇష్టపడతారు. ఈ రెంటిని సమన్వయం చేసుకోవాలి. పిల్లలు కూడా తమ పని చేసే తల్లిని తప్పక గౌరవిస్తారు. స్త్రీలు కలలు కనడం ఆపేయడం, అడ్డంకులతో ఆగిపోవడం సరి కాదు. కలలు కని సాధించుకోవడంలో తృప్తిని నేను అనుభవిస్తున్నాను’ అంటుంది అనురాధ. అనురాధ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు జపాన్‌వంటి దేశాల నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment