ఆశ ఎప్పుడూ వెలుగుతుండాలి. అప్పుడే.. నిరాశ అనే రెక్కల పురుగు..దీపం దగ్గరకు చేరలేదు. నిన్న మళ్లీ ఒలింపిక్స్ జ్యోతి వెలిగింది! వచ్చే ఏడాదికి కౌంట్‌డౌన్. బంగారు లాంతరులో ఉన్న ఆ దీపం.. సన్నగిల్లని అథ్లెట్స్ ఆశల ప్రతిరూపం. రెండు వేల ఇరవైకి రాసి పెట్టిన పెద్ద ఈవెంట్ ‘టోక్యో ఒలింపిక్స్’. రెండు వేల ఇరవైలో ఎవరూ ఊహించని ప్రాణాంతక విపత్తు ‘కరోనా ప్యాండమిక్’. ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం గురువారం (జూలై 23) జపాన్‌లోని షింజుకు సిటీలో.. నేషనల్ ఒలింపిక్ స్టేడియంలో ఒలింపిక్ క్రీడల ప్రారంభ మహోత్సవం జరగాలి. శుక్రవారం ఆటలు మొదలవ్వాలి. 68 వేల మంది క్రీడాభిమానులు ప్రత్యక్షంగా వాటిని తిలకించాలి. నాలుగు వందల కోట్ల మంది ఆ సంబరాలను టీవీలలో వీక్షించాలి. 185 దేశాలకు చెందిన 12 వేల మంది క్రీడాయోధులు పదహారు రోజుల పాటు తమ ప్రతిభా ప్రావీణ్యాలను ప్రదర్శించాలి.
ఇప్పుడు ఇవేమీ జరగడం లేదు. మళ్లీ ఏడాదికే ఒలింపిక్స్. మళ్లీ అదే టోక్యోలో, అవే స్టేడియంలలో, ఇవే తేదీలకు. (జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు). అప్పుడైనా కరోనా కరుణిస్తేనే! నిరుత్సాహపరిచే సంగతే. ఒలింపిక్స్ నిర్వహణ కోసం జపాన్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది! తమ క్రీడాకారుల శిక్షణ కోసం ప్రపంచ దేశాలు కూడా కోట్లలోనే ఖర్చు చేసి ఉంటాయి. అథ్లెట్స్‌ని సిద్ధం చేయడానికి మన దేశానికి అయిన ఖర్చు సుమారు యాభై ఎనిమిది కోట్లు. ఖర్చు అటుంచితే.. ఏడాది పాటు సాధన చేసి, కదన రంగంలోకి దూకేందుకు క్రీడా ఖడ్గచాలనాలతో కాలుదువ్వుతున్న అథ్లెట్స్ మనసు ఎంత ఉసూరుమంటుంది! మనం పడే బాధ కూడా. అయ్యో.. మేరీ కోమ్ గోల్డ్ మెడల్‌కు ఇంకో ఏడాది ఆలస్యం అయిందే! సింధు ఈసారి తప్పనిసరి గా బంగారు సింధుగా హైదరాబాద్‌లో ఫ్లయిట్ దిగి ఉండేదే! అంజుమ్ మౌద్గిల్ తన రైఫిల్‌కి పసిడి పతకాన్ని తొడిగి ఉండేదే. రాణి రాంపాల్ టీమ్.. మహిళా హాకీకి హ్యాపీ డేస్‌ను తెచ్చి ఉండేదే.. అనిపిస్తుంది. నిరాశ సహజమే. అయితే ఒలింపిక్స్ జ్యోతి వెలుగు వేడిమికి రాలిపోయే శలభం ఈ నిరాశ. అందుకే ఆశ అనే జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి.
ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి కదా అని టోక్యో నేషనల్ స్టేడియంలో ఒలింపిక్ జ్యోతి వెలగకుండా ఏమీ లేదు. వచ్చే ఏడాది జరిగే ఆటలకు జపాన్ ‘లాంతరు దీపం’ వత్తిని పెంచింది.! ఆ బంగారు లాంతరులో ఒలింపిక్స్ జ్యోతి కాంతులీనింది. అథ్లెట్‌లను మానసికంగా ‘డౌన్’ కానీయకుండా ఒలింపిక్ నిర్వాహకులు చేసిన ‘కౌంట్‌డౌన్’ ఇది. లాంతరును చేతితో ఎత్తిపట్టుకుని చిరువ్వులు చిందించిన అమ్మాయి 20 ఏళ్ల రికాకో. జపాన్ స్విమ్మర్.
2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆరు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించింది! అలాంటి అమ్మాయి, నిండా రెండు పదుల వయసులోని అమ్మాయి గత ఏడాది ఫిబ్రవరిలో మూడు వారాల ఆస్ట్రేలియా ట్రైనింగ్ క్యాంప్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోలేక మధ్యలోనే జపాన్ తిరిగి వచ్చేసింది. వైద్యపరీక్షల్లో ‘లుకేమియా’ క్యాన్సర్ అని నిర్థారణ అయింది! ఆ విషయాన్ని అదే నెల 12న తనే స్వయంగా ట్విట్టర్‌లో పెట్టింది. అలాంటి అమ్మాయి.. ఆశాదీపాన్ని పట్టుకున్నట్లుగా ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చింది. మనం ఒకదారిలో ఉంటాం. జీవితం ఇంకో దారిలోకి తీసుకుపోతుంది. ఏ దారిలోనైనా మన చేతిలో ఉండవలసిన దీపం.. ఆశ. దానిని ఆరనివ్వకూడదు.
ఏడాదే కదా
అంతా సక్రమంగా ఉంటే ఇప్పటికి అథ్లెట్స్ విలేజ్‌లో ఉండేవాళ్లం. బాగా ప్రిపేర్ అయ్యాక వాయిదా పడటం అంటే.. కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఒకటే తేడా. పోటీ పడటం కోసం ఇంకో ఏడాది వరకు ఎదురు చూడాలి. మిగతా అంతా మామూలే. హార్డ్ వర్క్.. హార్డ్ వర్క్. శారీరకంగా, మానసికంగా పర్‌ఫెక్ట్‌గా ఉండటం కోసం రోజూ ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రశాంతంగా, స్ట్రాంగ్‌గా ఉండటానికి సాధన ఉపయోగపడుతుంది. అది నిరంతరం. రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు. అన్నీ చక్కబడతాయి. అనుకున్నదీ సాధించి తీరుతాం. – పి.వి. సింధు (బ్యాడ్మింటన్) : 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత
ఎప్పుడైనా సిద్ధమే
వచ్చే ఏడాదైనా ఒలింపిక్స్ జరిగే పరిస్థితులు ఉంటాయా అన్నది సందేహమే. ఏదెలా ఉన్నా అథ్లెట్స్ తమకు చేతనైనంత వరకు మనసును, శరీరాన్ని నియంత్రణ లో ఉంచుకోవాలి. నియంత్రణ అనేది మనసును ఉల్లాసంగా, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. అప్పుడు ఏ నిముషం పోటీ జరిగినా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. – అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్) : మహిళల 50 మీ.ల రైఫిల్ మూడు పొజిషన్‌లలో (నీలింగ్, ప్రోన్, స్టాండింగ్) ఇండియాలో నెం.1
కల చెదరలేదు
ఒలింపిక్ ‘గోల్’్డ నా కల. అదే నా ప్రాధాన్యం. ఒలింపిక్స్ వాయిదా పడినా నా కల చెదరలేదు. నా ప్రాధాన్యం మారలేదు. ఏమైనా.. వాయిదా పడటం అనేది ఇప్పటికీ నేను అంగీకరించలేకపోతున్న వాస్తవం. కరోనా అనేదొకటి ఇంతగా ప్రపంచాన్ని స్తంభింపజేస్తుందని ఎవరు ఊహించగలరు? రోజూ వర్క్‌అవుట్స్ చేస్తున్నాను. ట్రైనింగ్ కూడా. ఒలింపిక్స్ మాత్రమే వాయిదా పడ్డాయి. నా సాధన కాదు. అది కొనసాగుతుంది. – మేరీ కోమ్ (బాక్సింగ్), 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత
ఇంకా బెటర్ అవుతాం
మా టీమ్ మంచి ఆటతీరుతో ఉంది. పోటీలకు అందరం సిద్ధంగా ఉన్నాం. ఒలింపిక్స్ వాయిదా పడటం వల్ల ఇంకో ఏడాది ప్రాక్టీస్‌కి సమయం లభించింది అన్నంత వరకే మనసుకు తీసుకుంటున్నాం. ఈలోపు జట్టులోని జూనియర్ ప్లేయర్స్ ఇంకా బెటర్ అవుతారు. టోక్యోలో వచ్చే ఏడాది ఆడబోయే మా తొలి గేమ్‌లో విజయం సాధించడానికి అవసరమైన ప్రాక్టీస్‌ను నిరంతరం చేస్తుంటాం.
– రాణి రాంపాల్,మహిళల హాకీ టీమ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment