ఊరుకున్నంత ఉత్తమం లేదని మన పెద్దలు అంటుంటారు. అతిగా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తడమే కాకుండా మానసిక శక్తి బలహీనపడుతుంది. కొన్నిసార్లు అతిగా మాట్లాడటం పెద్దపెద్ద వివాదాలకు దారితీస్తుంది. మౌనం వహించడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ షౌనక్ అజింక్యా మౌనం గొప్పదనాన్ని వివరించారు. ఒక రోజంతా నిశ్శబ్దంగా ఉంటే అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ‘స్పీచ్ ఫాస్టింగ్’ గొంతులోని స్వర తంతువు (వాయిస్ రీడ్స్)లకు విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా నిశ్శబ్దంగా ఉంటడం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసటను తొలగిస్తుంది. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది.
రోజంతా మౌనంగా లేదా అధికంగా మాట్లాడకుండా ఉండగలిగితే మానసిక స్వాంతనను పొందుతారు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినగలుగుతారు. మౌనంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. పలు మతాలలో మౌనవ్రతం అనేది భగవంతుడిని చేరుకునేందుకు ఒక మార్గంగా చెబుతారు. మౌనవ్రతం అంతర్గత బలాన్ని పెంచుతుంది. మనలోని అంతరంగాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
రోజంతా మౌనంగా ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందని డాక్టర్ అజింక్య తెలిపారు. స్వర తంతువులు, గొంతు కండరాలు, ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అధికసమయం మౌనంగా ఉండటం, గాఢమైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవడమే కాకుండా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువగా మాట్లాడటం వల్ల మెదడుకు పదును పెట్టినట్లవువుతుంది. అలాగే పరధ్యానం తొలగి, మరింత ఏకాగ్రత ఏర్పడుతుందని అజింక్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment