
పూర్వకాలం బభ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు. మహోదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని, అతడు జనరంజక పాలన కొనసాగించేవాడు. ఒకనాడు ఆయన పరివారంతో కలసి వేట కోసం కీకారణ్యానికి వెళ్లాడు. అడవిలో ఒక లేడి కనిపించింది. బభ్రువాహనుడు ఆ లేడిని వేటాడాలనుకుని, దానిపై బాణం వేశాడు. అది బాణం నుంచి తప్పించుకుని, పరుగు తీసింది. దాన్ని ఎలాగైనా వేటాడి తీరాలనుకుని, బభ్రువాహనుడు ఆ లేడిని వెంటాడుతూ, తన పరివారానికి దూరంగా సాగిపోయి, ప్రేతాలు సంచరించే తావుకు చేరుకున్నాడు.అదే సమయానికి అక్కడ ఉండే ఒక ప్రేతం బభ్రువాహనుడి ముందు ప్రత్యక్షమైంది.
‘మహారాజా! చాలా ఏళ్లుగా నేను ప్రేతరూపంలో ఉన్నాను. ఇన్నాళ్లకు రాజువైన నిన్ను చూడటంతో నా పాపాన్ని కొంత పోగొట్టుకున్నాను. నేను మరణించాక, నాకు ఉత్తరక్రియలు జరిపేవారు ఎవరూ లేక నేనిలా ప్రేతంగా మారాను. నువ్వు రాజువు. రాజు అంటే ప్రజలను రంజింపజేసేవాడు. కాబట్టి, నువ్వు నగరానికి వెళ్లిన తర్వాత నాకు ఉత్తరక్రియలు జరిపించు. బాగా బతికిన వాణ్ణి. అనాథలా ఇతరుల సొమ్ముతో ఉత్తరక్రియలు జరిపించుకోలేను. నా దగ్గర ఒక అతిలోకమణి ఉంది. ఇదిగో! ఆ మణి. దీనిని తీసుకో! ఇది చాలా విలువైనది. ఖర్చు నిమిత్తం ఇచ్చాననుకున్నా సరే, లేదా ఈ మణికి నువ్వు వారసుడివి అనుకున్నా సరే, నాకు అభ్యంతరం లేదు. ఇది తీసుకుని, నాకు ఉత్తరక్రియలు జరిపించడం మాత్రం మరువకు’ అని వేడుకుంది.
తన ఎదుట ప్రేతం ప్రత్యక్షమవడంతోనే బభ్రువాహనుడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రేతం కోరిన కోరిక విన్న తర్వాత మరింతగా విస్మయం చెందాడు. రాజు కాబట్టి తన భావోద్వేగాలను బయటపడనివ్వకుండా, తొణకకుండా ఇలా అడిగాడు:‘ఓ ప్రేతమా! నువ్వు కోరిన కోరిక సబబుగానే ఉంది. నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు, గోత్ర ప్రవరలు తెలియకుండా ఉత్తరక్రియలు జరిపించడం, కర్మకాండలు ఆచరించడం సాధ్యం కాదు కదా! అందువల్ల నువ్వు పార్థివదేహంతో జీవించి ఉన్ననాటి వివరాలు చెప్పు!’ అన్నాడు.
బభ్రువాహనుడు అడిగిన దానికి ప్రేతం బదులిస్తూ, ‘మహారాజా! పార్థివదేహంతో నేను జీవించిన నాటి వివరాలు చెబుతాను, శ్రద్ధగా విను! వైదేశమనే నగరంలో వైశ్యుడిగా జన్మించాను నేను. నా పేరు దేవగుప్తుడు. జ్ఞానం తెలిసినది మొదలు నేను ఎన్నడూ ధర్మం తప్పలేదు. జీవించిన కాలమంతా నిత్య దేవతారాధనలు చేశాను. పేదసాదలకు దాన ధర్మాలు చేశాను. ఎన్నో శిథిలాలయాలకు జీర్ణోద్ధరణ చేశాను. నిర్మితాలైన శూన్యాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసి, వాటిలో పూజాదికాలకు అన్ని ఏర్పాట్లు చేశాను. విప్రులకు అగ్రహారాలు ఇచ్చాను. సత్యాన్ని గౌరవించాను, ధర్మాన్ని ఆచరించాను. అయినా ఏంలాభం? మరణానంతరం ఇదిగో! ఇలా ప్రేతంలా మారిపోయాను’ అని చెప్పింది.
‘జీవించినంత కాలం ధర్మాచార పరాయణుడివైనా, ఎందుకిలా ప్రేతంగా మారిపోయావు?’ ఆశ్చర్యంగా అడిగాడు బభ్రువాహనుడు.
‘ఎందుకంటే, ఏం చెప్పను మహారాజా! నేను కన్నుమూసే వేళకు చెవిలో నారాయణ నామాన్ని పలికేవారు ఎవరూ లేరు. అవసాన క్షణాల్లో గొంతులో ఉద్ధరిణెడు తులసితీర్థం పోసేవారు లేరు. ప్రాణాలు విడిచిన తర్వాత నా దేహాన్ని దహనం చేసే వారసులు లేరు. కనీసం కన్నీరు కార్చే సోదరులు, దాయాదులు లేరు. ఉత్తరక్రియలకు నోచుకోని కారణంగానే నేనిలా ప్రేతంగా మిగిలిపోయాను. ఇదిగో! ఈ మణిని తీసుకో! నాకు ఉత్తరక్రియలు ఆచరించు’ అంటూ మణిని బభ్రువాహనుడి చేతిలో ఉంచిందా ప్రేతం.‘తప్పకుండా నీకు ఉత్తరక్రియలు ఆచరిస్తాను’ మాట ఇచ్చాడు బభ్రువాహనుడు.‘అయితే, నాదొక సందేహం. ఉత్తరక్రియలకు నోచుకోనివారికేనా, ఇతరులు ఎవరికైనా కూడా ఇలా ప్రేతత్వం సిద్ధిస్తుందా?’ అని అడిగాడు.
‘ఇతరులకు కూడా సిద్ధిస్తుంది’ అని చెప్పసాగింది ప్రేతం.‘దేవతలు, బ్రాహ్మణులు, స్త్రీలు, బాల బాలికలు, వికలాంగులకు చెందిన ద్రవ్యాన్ని అపహరించిన వారికి ప్రేతత్వం సిద్ధిస్తుంది. పరస్త్రీలను బలవంతంగా చెరబట్టిన వారికి, బంగారాన్ని, నవరత్నాలను, తామర పువ్వులను దొంగిలించిన వారికి, యుద్ధంలో శత్రువుకు వెన్నుచూపి పారిపోయిన వారికి, తమకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టిన వారికి తప్పనిసరిగా ప్రేతత్వం సిద్ధిస్తుంది’‘ప్రేతత్వ విముక్తి మార్గమేమిటో చెప్పు’ అడిగాడు బభ్రువాహనుడు.
‘నియమబద్ధంగా ఉత్తరక్రియలు జరిపించడం, నారాయణ నామ పారాయణం, పూజ జరిపించడం ద్వారా ప్రేతత్వ విముక్తి కలుగుతుంది. ఉత్తరక్రియలలో బ్రాహ్మణులకు షడ్రసోపేతంగా సంతర్పణ చేయాలి. షోడశ దానాలు చేయాలి. ప్రేతత్వం పొందిన వారి విముక్తి కోసం ఎవరైనా పూనుకొని ఉత్తరక్రియలను నియమబద్ధంగా ఆచరించినట్లయితే, తక్షణమే ప్రేతత్వం తొలగిపోతుంది’ అని చెప్పింది ప్రేతం.ఈలోగా బభ్రువాహనుడి భటులు ఆయనను వెదుకుతూ అక్కడకు చేరుకున్నారు. వారి అలికిడికి ప్రేతం అదృశ్యమైపోయింది. నగరానికి చేరుకున్నాక, బభ్రువాహనుడు ఆ ప్రేతానికి ఉత్తరక్రియలు జరిపించాడు. ప్రేతత్వం నుంచి విడుదల పొందిన దేవగుప్తుడు ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment