Reasons to Discover Sangti Valley: కనుచూపు మేరలో ఎటుచూసినా ధీరగంభీరంగా హిమాలయ పర్వతాలు. చడీచపుడు చేయకుండా సన్నగా కురిసే మంచు. మంచుకు ఆవల కనుచూపుమేర విస్తారమైన పండ్లతోటలు. కివి, అప్రికాట్, పెద్ద సీమ కమలాలు, కశ్మీర్ యాపిల్‌ను తలదన్నే ఎర్రటి యాపిల్ పండ్లు... రంగురంగుల్లో నోరూరిస్తుంటాయి. నల్ల మెడ తెల్ల కొంగలు ఈ తోటల్లో సొంతదారుల్లా విహరిస్తుంటాయి. ఈ తోటల వాలులో ఝమ్మని మంద్రంగా శబ్దం చేస్తూ కనిపించీ కనిపించకుండా ప్రవహించే నది పాయలు. ఇది అరుణాచల్ ప్రదేశ్, సంగ్తిలోయకు సొంతమైన ప్రకృతి సౌందర్యం.
బస ఇలాగ!
సంగ్తి వ్యాలీ పూర్తిగా ప్రకృతి ఒడి. ఇక్కడ ఆధునికత అంటే పర్యాటక ప్రధానమైన అభివృద్ధి మాత్రమే. పర్యాటకులు ప్రకృతితో మమైకమై జీవించిన అనుభూతి పొందడం కోసం బసకు గుడారాలుంటాయి. గుడారపు బసలు విలాసవంతంగా ఉండవు. కానీ చక్కటి బెడ్, లైట్‌లు, ఫ్యాన్, అటాచ్‌డ్ బాత్‌రూమ్‌తో సౌకర్యవంతంగానే ఉంటాయి. గుడారాలన్నీ నది తీరానే ఉంటాయి. ఈ ట్రిప్‌లో... రాత్రి భోజనం తర్వాత నది తీరాన చలిమంట వేసుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.
ఇక్కడ ఏమి తినాలి?
ఆహారంలో మసాలాలు తక్కువగా ఉంటాయి. భోజనం రుచిగానే ఉంటుంది. స్థానిక భోజనం రుచి చూడాలంటే కొంచెం కష్టమే. ఇక్కడి హోటళ్లలో టూరిస్టుల కోసం నార్త్, సౌత్ ఇండియన్ రుచులనే ఎక్కువగా వండుతారు.
ఇంకా!
►మొబైల్ సిగ్నల్స్ ఉండవు. కాబట్టి రూట్‌ని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ ఉండదు, కాబట్టి టూర్‌ని ఆసాంతం ఆస్వాదించవచ్చు.
►ఇక్కడి మనుషులు అత్యంత వినయశీలురు, నిజాయితీపరులు. క్యాబ్ డ్రైవర్‌లు డ్యూటీ టైమ్‌కి పది నిమిషాల ముందే సిద్ధంగా ఉంటారు.
►పర్యాటకులు క్యాబ్‌లో పర్సు మర్చిపోతే ఫోన్ చేసి మరీ ఆ పర్సును డబ్బుతో సహా జాగ్రత్తలగా పర్యాటకులకు చేరే ఏర్పాటు చేస్తారు.
►టూరిస్టు ప్రదేశాలన్నీ ప్లాస్టిక్ రహితంగా ఉంటాయి. కానీ స్థానికులకు ప్లాస్టిక్ వాడకం పట్ల పెద్దగా పట్టింపులు ఉన్నట్లు కనిపించదు.
►యధేచ్ఛగా వాడేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రపంచం స్వీయనియంత్రణలు అనుసరిస్తున్న సంగతి బహుశా వాళ్లకు తెలియకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment