జుట్టును సంరక్షించుకోవడం ఒక సమస్య. ఉన్న జుట్టును మరింత ఆరోగ్యంగా, వేగంగా పెంచుకోవడం మరో సమస్య. ఇందుకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం, చుండ్రులేకుండా జాగ్రత్త పడటంతోపాటు, జుట్టు చివర్ల (స్ప్లిట్ ఎండ్స్)ను కట్ చేయడం లాంటివి చేయడం చాలా మంది పాటించే పద్ధతి. అయితే ఇలా చేయడం వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.
నిజానికి జుట్టు చివర్లు కత్తిరించడం వల్ల అది వేగంగా పెరుగుతుందనే వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటు జుట్టు పెరుగుదల స్కాల్ప్ నుంచి మొదలవుతుంది. కుదుళ్లు బలంగా ఉంటే జుట్టు బలంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన చివర్లను కత్తిరించడం వల్ల అది వేగంగా పెరగదు. కానీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. స్ప్లిట్ చివర్లు , డ్యామేజ్ అయిన జుట్టును కత్తిరించడం వల్ల, క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు, ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపిస్తుంది.
ఎన్ని రోజులకోసారి కట్ చేయాలి?
సాధారణంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి అంగుళం మేర కత్తిరించుకోవాలి. ఎంత మేర ట్రిమ్ చేయాలి. ఎన్నిరోజులకు ఒకసారి చేయాలి అనేది ఇది జుట్టు పొడవు, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్య బట్టి ఉంటుంది. చాలా మందికి రోజుకు 50-100 వెంట్రుకలు రాలిపోతాయి. అయితే ఈ వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊడిపోయిన వాటి స్థానంలో కొత్త జుట్టు రావాలంటే సరైన పోషణ అవసరం.
జుట్టుకూ ఉండాలి పోషణ
అందమైన మెరిసే జుట్టు కావాలంటే పోషణ అవసరం. వారానికి ఒకసారి అయినా కుదుళ్లకు తాకేలా నూనెతో మర్దనా ఉండాలి. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. రసాయన రహిత షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉండాలి. బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం లాంటివి తరచుగా చేయకుండా ఉండాలి. ఇవి జుట్టు సహజ మెరుపును, అందాన్ని పాడుచేస్తాయి. నాణ్యమైన హెయిర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి.
జుట్టు ఆరోగ్యం కోసం ఆహారం
ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ ఈ చాలా కీలకం. ఇది బొప్పాయి, బాదం, హాజెల్ నట్స్, అవకాడోస్, దోసకాయ బచ్చలికూర వంటి అనేక పండ్లు , కూరగాయలలో సహజంగా లభిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు, సాల్మన్ ట్యూనాతో సహా అనేక రకాల చేపలు విటమిన్ ఇ-రిచ్ ఫుడ్స్. ప్రొటీన్ తగ్గడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. జింక్, సెలేనియం, బయోటిన్ లభించే గుడ్లు తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ,ఫోలేట్లు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఐరన్ లోపం లేకుండా చేసుకోవాలి.
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం జిడ్డుగా ఉంటే జుట్టును తరచుగా శుభ్రం చేసుకోవాలి. క్లోరిన్ హానికరమైన ప్రభావాలకు దూరంగా ఉండాలి. ఈత కొట్టే స్యంలో జుట్టును కప్పుకోవాలి. ఇంటినుంచి బయటికి వెళ్లినపుడు కాలుష్యం యూవీ కిరణాలనుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కట్టుకోవడం, గొడుగు వాడటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment