డాక్టర్ జె. రాధాకృష్ణన్‌కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు.
సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్‌కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్‌కే తీసుకు వచ్చింది సౌమ్య.
సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్‌లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది!
2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్‌ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.
వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది.
2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్‌తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.
ఎకనామిక్స్‌లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్.
Comments
Please login to add a commentAdd a comment