యాప్ స్టోర్‌లలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌ల హవా కొనసాగుతుండగానే ‘నేను సైతం’ అంటోంది ఫోన్‌పే. ‘ఇండస్ స్టోర్’ పేరుతో కొత్త యాప్ స్టోర్‌ను తీసుకురానుంది.యాప్ స్టోర్‌ల పోటీ సంగతి ఎలా ఉన్నా, దేశీయ యాప్‌లు వెలిగిపోతున్న కాలం ఇది. ‘ఒక యాప్ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనేది నిజమే అయినా అది ఎలాంటి ఐడియా అనేదే కీలకం. ఆ కీలకమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని పాపులర్ యాప్‌ల రూపకల్పనపై దృష్టి పెడుతున్నారు యంగ్ యాప్ డెవలపర్‌లు. యాప్–పాపులారిటీని కలిపి నెటిజనులు సరదాగా సృష్టించిన ‘యాప్‌లారిటీ’కి న్యాయం చేసేలా కృషి చేస్తున్నారు...
‘సాధించాలనుకున్నప్పుడు సాధన చెయ్’ అనే మంచి మాట శివరీన సారికను కొత్త దారిలోకి తీసుకెళ్లింది. ‘ప్రెగ్‌బడ్డీ’ అనే పాపులర్ యాప్ ఆవిష్కరించడానికి కారణం అయింది. స్టార్ డెవలపర్‌గా తన పేరు మారుమోగేలా చేసింది. గేమింగ్ స్టూడియో ‘99 గేమ్స్’ వైస్ ప్రెసిడెంట్ శిల్పాభట్ ‘నేను సాధిస్తాను’ అంటూ నమ్మకంగా రంగంలోకి దిగి, సక్సెస్‌ఫుల్ డెవలపర్‌ల వరుసలో నిలిచింది.శివరీన ఐఐటీ–ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్. తన సోదరికి గర్భస్రావం అయినప్పుడు కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ‘మనం నిరంతరం టెక్నాలజీ మధ్యలోనే గడుపుతున్నాం అనుకుంటున్నప్పటికీ, ఆ టెక్నాలజీని కీలకమైన సమయంలో మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నాం’ అనే ఆలోచనతో తల్లులు, తల్లులు కావాలనుకునేవారి కోసం వాట్సాప్ గ్రూప్ మొదలు పెట్టింది. వారిని ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకుంది.
నాలుగు నెలల తరువాత తన టీమ్‌తో కలిసి ‘ప్రెగ్‌బడ్డీ’ యాప్ డెవలప్‌మెంట్‌పై పనిచేసింది. తల్లులు, తల్లి కావాలనుకుంటున్నవారికి అనేక రకాలుగా ఉపయోగపడే ఈ యాప్ సంవత్సర కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.ఉడిపి (కర్నాటక)లోని ‘రోబోసాఫ్ట్’ అనే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీలో పనిచేసిన శిల్పాభట్ ‘99గేమ్స్’తో గేమ్ డెవలపర్‌గా మారింది.‘చాలామందికి టెక్నాలజీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆవిష్కరణల విషయం వచ్చేసరికి అది వేరే వాళ్ల వ్యవహారం, మనం చేయలేం అనుకుంటారు. అయితే ఇది సరికాదు. మనం ఏదైనా చేయాలంటే ముందు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తెలుసుకుంటూ నేర్చుకుంటూనే ఎన్నో చేయవచ్చు’ అంటుంది శివరీన.‘సాధించాలనే తపన గట్టిగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు.
ప్రోగ్రామింగ్ లేదా గేమ్ డెవలప్‌మెంట్ మీ ప్యాషన్ అయితే, ఆ ప్యాషన్‌ను గుండెల్లోకి తెచ్చుకోండి. గుండె నిండా ధైర్యంతో నేను సాధించగలను అనే నమ్మకాన్ని సొంతం చేసుకోండి’ అంటుంది శిల్పాభట్. చిన్న వయసులోనే ఎన్నో మిలియన్ డాలర్ యాప్స్‌ను సృష్టించి పెద్ద పేరు తెచ్చుకున్నాడు సిద్దార్థ్ నాయక్. సక్సెస్‌ఫుల్ యాప్‌లను ఎలా బిల్డ్ చేయాలో బాగా తెలిసిన నాయక్ పదమూడు సంవత్సరాల వయసులోనే వెదర్ ప్రెడిక్షన్ యాప్‌ను క్రియేట్ చేశాడు. ‘తనదైన విలువను మార్కెట్‌లో సృష్టించగలిగినప్పుడే ఒక వ్యాపారసంస్థకు సంబంధించిన ప్రయోజనం నెరవేరినట్లు అవుతుంది. వినియోగదారులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్‌ల ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడే యాప్‌ను సృష్టించడంపై దృష్టి పెడతాను. అత్యంత విలువైన సాంకేతిక పరిజ్ఞానంతో యాప్‌ను రూపొందించినప్పటికీ అది వినియోగదారులను ఆకట్టుకోకపోతే ప్రయోజనం నెరవేరనట్లే.
యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని యాప్‌ను డిజైన్ చేయడం అనేది ముఖ్యమైన విషయం’ అంటున్నాడు నాయక్.చిన్న యాప్‌లు కూడా పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం క్రియేటర్‌లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకోవడమే. చైనీస్ యాప్‌లను నిషేధించిన తరువాత ఆ ప్లేస్‌లోకి మన కుర్రాళ్ల యాప్స్ వచ్చాయి. ‘ఎంఎక్స్ టకాటక్’ అలాంటిదే. ‘ఇదే సరిౖయెన సమయం అనుకొని మా టీమ్ ఆరు రోజులు రాత్రి, పగలు కష్టపడి ఈ యాప్‌ను డిజైన్ చేశాం. భారతీయత ఒక్కటే మార్కెట్‌లో విజయం సాధించడానికి కారణం కాదు. ఇతరుల కంటే ఏ రకంగా భిన్నంగా ఉన్నాం అనేదానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది’ అంటున్నాడు ‘ఎంఎక్స్ టకాటక్’ సీయివో కిరణ్ బేడీ. స్వదేశీ యాప్‌లు విజయంతో వెలిగిపోతున్న కాలం ఇది.‘నాణ్యత అంశాలను విస్మరిస్తే ఫలితం వేరేలా ఉంటుంది. ఎప్పటికప్పుడు మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి’ అంటున్నారు నిపుణులు.
బిలియన్ డాలర్ ఐడియా
యాప్ బిల్డింగ్‌పై ఆసక్తి ఉన్న యువతరానికి ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి... జార్జ్ బెర్కోవోస్కీ ‘హౌ టు బిల్డ్ ఏ బిలియన్ డాలర్ యాప్’ పుస్తకం. ‘మొబైల్ జెనెటిక్స్’ ‘ఏ బిలియన్ డాలర్ ఐడియా’ ‘ఈజ్ యువర్ యాప్ రెడీ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్?’ ‘హౌ మచ్ ఈజ్ యువర్ యాప్ వర్త్ అండ్ హౌ మచ్ మనీ షుడ్ యూ రైజ్?’ ‘ది టెన్–మిలియన్– డాలర్ యాప్’ ‘మేక్ సమ్‌థింగ్ పీపుల్ లవ్’ ‘డాలర్స్ ఇన్ ది డోర్’ ‘ ఏ కలర్‌ఫుల్ లెస్సన్’ ‘మనీ ఫర్ సేల్’... మొదలైన ఆసక్తికరమైన చాప్టర్‌లు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘బిలియన్ డాలర్‌ల యాప్స్‌ను రూపొందించిన వారి బుర్రలతో ఆలోచింపచేసే పుసక్తం ఇది’ అంటున్నాడు బెర్కోవోస్కీ. ఇంజనీర్, సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన బెర్కోవోస్కీ ఎంతోమంది విజేతలతో మాట్లాడి, తన స్వీయ అనుభవాలను జోడించి ఈ పుస్తకం రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment