జీవామతం కలుపుతున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,శ్రీదేవి (ఫైల్‌ఫొటో)
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూమిని పరిరక్షించుకోవడం మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని నాగంపేట సమీపంలోని తమ పొలంలో గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. చెరువు నీటిని వినియోగించి ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపిసిఎన్‌ఎఫ్) విభాగం అధికారులు, సిబ్బంది సూచనల ప్రకారం 12 ఎకరాల్లో వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. జాతీయ వ్యవసాయ కమిటీలో సభ్యులైన ఎంపీ చంద్రశేఖర్ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం.
మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తున్నారు. భూసార వృద్ధికి నవధాన్యాలను సాగు చేసి కలియదున్నుతున్నారు. ఘనజీవామృతం వేసి లైన్ సోయింగ్ చేస్తున్నారు. ద్రవ జీవామృతం ప్రతి 15 రోజులకు ఇస్తున్నారు. ఆవు పేడ, మూత్రం ఇంగువతో తయారైన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వీటితోపాటు మీనామృతం, కోడుగుడ్ల ద్రావణం, పుల్లటి మజ్జిగ, సప్తధాన్యాంకుర కషాయం, బ్రహ్మాస్త్రం.. అవసరం మేరకు పిచికారీ చేయటం వంటి నియమాలు పాటిస్తూ సాగు చేస్తున్నారు. చంద్రశేఖర్ సతీమణి శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి రైతు తోనూ ప్రకృతి వ్యవసాయం చేయించాలని ఎంపీ చంద్రశేఖర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడెకరాల్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్‌తో పాటు ఐదెకరాల్లో సజ్జలు, కొర్రలు, రాగులను సాగు చేయిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు తాను పండించిన విత్తనాలను అందించనున్నారు. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం, ఇన్‌పుట్స్: మరిపి సతీష్‌కుమార్, చీపురుపల్లి
టీవీలో సీఎం మాటలు విని..
వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం మాది. మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుండగా ఓ రోజు టీవీలో చూసి, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఏపీసిఎన్‌ఎఫ్ అధికారుల సహకారంతో 12 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పండించాం. 18 రకాల నవధాన్యాలను కలిపి దుక్కి దున్ని పొలంలో చల్లాం. 45 రోజులు పెరిగిన తరువాత భూమిలో కలియదున్నించాం. ఎకరాకు ఒక డ్రమ్ము ఏర్పాటు చేసి 200 లీటర్ల జీవామృతం పొలంలో చల్లిస్తున్నాం. అలాగే ఎకరాకు 12 కోడిగుడ్లు, నాలుగు రకాల నూనెలతో తయారు చేసి పిచికారీ చేయించాం. 11 రకాల ధాన్యం మూడు రోజులు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత ద్రావణాన్ని మరోసారి స్ప్రే చేయించాం. వరి పంటకు ఎలాంటి తెగుళ్లు రాలేదు. ఈ ఏడాది చిరుధాన్యాలను విత్తనాల కోసం పండిస్తున్నాం. – బెల్లాన శ్రీదేవి, ఎంపీ చంద్రశేఖర్ సతీమణి
Comments
Please login to add a commentAdd a comment