
‘సున్నితమైన విషయాలలో ఎలా స్పందించాలో, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కలిగించాలో కొందరికి కనీస స్పృహ లేకుండా పోతోంది. ఒక దేశం బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రజలలో అవగాహన ఎలా పెంచుతుంది?! రొమ్ము కేన్సర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లలో ‘మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి’ అంటూ తెలియజేసే ప్రకటన పోస్టర్‌ను ఢిల్లీ మెట్రోలో చూశాను. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను.
ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు, వీటిని ఎవరు ఆమోదిస్తారు? ఈ పోస్టర్‌ను పబ్లిక్‌లోకి తీసుకు రాగలిగేటంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా?!’ అంటూ ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా దుయ్యబట్టారు. కేన్సర్ సర్వైవర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్వచ్ఛంద సంస్థ ‘యువికాన్’ ఈ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
దీని వెనుక ఉద్దేశం రొమ్ము కేన్సర్ పట్ల సామాన్యులలో అవగాహన కల్పించడమే. కానీ, ఇలాంటి ప్రచారాలు కొన్నిసార్లు అసౌకర్యంగానూ, పనికిమాలినవిగానూ కనిపిస్తాయి. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ యూజర్లు కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ‘ఇది క్రికెటర్ యువరాజ్‌సింగ్ క్యాంపెయిన్ అని తెలుసుకున్నాను. వీరి ఉద్దేశ్యం సరైనదే కావచ్చు. కానీ, ఇది నిజంగా అసహ్యకరమైనది. ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలనుకుంటున్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు.
‘భారతదేశంలో బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఒక శాతం మందికి కూడా సరైన అవగాహన లేదు. తలాతోకా లేని ఇలాంటి ప్రకటన ద్వారా ప్రజలకు విషయం ఎలా చేరుతుంది అనుకుంటున్నారు? స్త్రీలను కించపరిచేలా ఉన్న ఈ ప్రకటన సరైనది కాదు’ అని ఇంకొకరు, ‘సమస్యను ఎంత బాగా అర్థమయ్యేలా తెలియజేయాలో ఆ ఫౌండేషన్ వాళ్లకే అర్థం కాలేదు’ అని మరొకరు ‘ప్రకటనదారులు సున్నితమైన విషయాలను పట్టించుకోరు, ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తారు’ అని ఒకరు ‘ఇది గ్రామీణ జనాభా కోసం కాదు. కేవలం ఇంగ్లిషు మాట్లాడే మహిళల కోసమే’ అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
(చదవండి: చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..? )