
ప్రస్తుతం దేశ ఆర్థిక సుస్థిరతకు, నిరుద్యోగ నివారణకు, వ్యవసాయ ప్రాముఖ్యం కలిగిన జాతీయ ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ఉంది. 65 శాతం ప్రజలకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయి పోటీకి నిలబడే స్థాయిలో వనరులు, వసతులు కల్పించాలి. రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు కలసి రైతుల ఆర్థిక సుస్థిరతకు, సామాజిక గుర్తింపు పొందేందుకు అవసరమైన కొత్త విధానాలు అమలు పరచాలి.
రాజ్యాంగం ఆర్టికల్ 14–18 ద్వారా పౌరులకు సమానత్వ హక్కు కల్పించినది. కానీ డెబ్బై ఐదేళ్ల తరువాత కూడా అసంఘ టిత రైతులకు.. సంఘటిత వర్గాలైన ఉద్యోగులు, వ్యాపారులతో సమానంగా ఆర్థిక సమానత్వం కలగనేలేదు. ఆర్టికల్ 19–22 పేర్కొన్నట్లుగా స్వేచ్ఛా వ్యాపారానికి గాని, సాంకేతిక నైపు ణ్యాన్ని గానీ పొందేందుకు స్వతంత్రం లేదు. ఆర్టికల్ 23–24 నిర్దేశించినట్లుగా దళారుల దోపిడీని అరికట్టే శక్తి స్థోమతలు లేవు. ఆర్టికల్ 29–30 ప్రకారం నాణ్యమైన విద్యా హక్కు లేదు, ఆరోగ్య వసతులు లేవు.
రైతులు నేడు 23 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 31 కోట్ల టన్నుల కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడి ఆహార కొరత లేకుండా చేశారు. కానీ దేశంలో ఏ ఒక్క రైతుకు కూడా ఆర్థిక స్థిరత్వం లేదు. గత ముప్పై ఏళ్లుగా పారిశ్రామిక సేవా రంగాలు 10 శాతం అభివృద్ధి సాధించాయి కానీ, వ్యవసాయ రంగం 2 శాతం దగ్గరే స్తంభించిపోయింది. నిరుద్యోగం, వలసలు, ఆత్మ హత్యల పరిస్థితిలో మార్పులు లేవు. వ్యవసాయంలోకి యువ కులు అసలే రావటం లేదు.
నిత్యం కరువుకాటకాలతో బాధపడుతున్న తెలంగాణ రైతులకు కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి సౌకర్యం కలుగజేసింది. వరి ఉత్పత్తి 40 లక్షల టన్నుల నుండి 110 లక్షల టన్నులు పండించేందుకు అవకాశం కల్పించింది. ఇంతచేస్తున్నా పండించిన వరి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర ఇవ్వక, కొనుగోలు చేసే వసతి లేక తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటల అమ్మకానికీ, ఎగుమ తులకు వసతి కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధి లోనే ఉన్నప్పటికీ ఆ మేరకు చర్యలు చేపట్టలేదు.
వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగంలో పేర్కొన్నారు. పంటల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి ఆంక్షలు విధించే అధికారం ఉంది. అందుకే ఎగుమతి, దిగుమతులపై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పంటల ధరల్ని నియంత్రించే కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయానికి అవసరమైన పురుగు మందులు, డీజిల్, యంత్రాలపై ధరలను అదుపు చేయడం లేదు. రుణాలు అందించడంలో, బీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయి. పండించి పతనమవుతున్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల వారి రైతుల సమస్యలకు ముఖ్య కారణమిదే.
1960లో నెహ్రూ ఆహార కొరత తీర్చడానికి భారీ నీటిపారుదల ప్రాజె క్టులు చేపట్టినా.. ఇందిరా గాంధీ అధి కారంలోకి వచ్చిన తరువాత హైబ్రిడ్ గోదుమ విత్తనాలను మినహాయించి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే రైతుల దుఃస్థితికి ఈనాటికీ ఒక ముఖ్య కారణం. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2004–2012 మధ్య వ్యవసాయ అభివృద్ధికి అత్యంత ఉపయో గకరమైన డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ రిపోర్టును అమలు చేయటంలో విఫలమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఇష్టారాజ్యంగా అధికారం చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి నిలిచింది ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే! ఆయన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకత్వాన్ని ధిక్కరించి మరీ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవ డానికి ఏకైక కారణం నరేంద్రమోదీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చేసిన వాగ్దానాలే! అయితే గత ఏడు సంవత్సరాలలో బీజేపీ వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను, నాణ్యతను మెరుగు పరచడానికి, ఖర్చులు తగ్గించడానికి, అంతర్జాతీయ స్థాయికి వ్యవసాయ రంగం ఎదిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదు. 2020లో ప్రకటించిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలలో స్పష్టత లేనందున, కొన్ని వర్గాల రైతులలో వ్యతిరేకత వల్ల ఆ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుతం దేశ ఆర్థిక సుస్థిరతకు, నిరుద్యోగ నివారణకు, వ్యవసాయ ప్రాముఖ్యం కలిగిన జాతీయ ప్రణాళికలు రూపొం దించవలసిన అవసరం ఉంది. 65 శాతం ప్రజలకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయి పోటీకి నిలబడే స్థాయిలో వనరులు, వసతులు కల్పించాలి. రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు కలసి రైతుల ఆర్థిక సుస్థిరతకు, సామాజిక గుర్తింపు పొందేందుకు అవసరమైన కొత్త విధానాలు అమలు పరచాలి. రాజ్యాంగం కూడా రైతు హక్కులను కాపాడటంలో విఫలమైందని స్పష్టంగా నిరూపితమైంది. దేశంలో కుల వ్యవస్థ స్థానంలో, వర్గవ్యవస్థ ఏర్పడింది. నేడు దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, పంటలకు లాభసాటి ధరలు నిర్ణయించి, రైతు లకు ఆర్థిక సమానత కల్పించి, సామాజిక గౌరవం కలిగించా లంటే ఇప్పుడున్న లోపాలను పరిశీలించి, చర్చించాలి. అవసర మైన రాజ్యాంగ మార్పులు తేవాలి.
పెద్దిరెడ్డి చంగల్‌రెడ్డి
వ్యాసకర్త న్యాయవాది, అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారు