దేశంలో విద్యుత్ వాహనాల వాడ కానికి మద్దతు ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు గానే కంపెనీలు కూడా విద్యుత్ వాహనాలకు (ఈవీలు) సంబందించి తమదైన ప్రణాళికళను సిద్ధం చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కూడా విద్యుత్ వాహనాల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థలో పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మిగిలిన వారి కంటే ఒకడుగు ముందుకేసినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్రవాహనాల్లో 30 శాతం వరకూ విద్యుత్ వాహనాలే ఉండటం పెరుగుతున్న మద్దతుకు నిదర్శనం. 2040 నాటికి పెట్రోలు డీజిళ్లతో నడిచే వాహ నాలకంటే ఈవీలే ఎక్కువగా ఉంటాయని అంచనా. కానీ భారతదేశంలో వీటి కొనుగోలుకు ఆసక్తి పెరుగుతున్నా ఇతర దేశాలతో పోలిస్తే వాడకం తక్కువగానే ఉంది. ఇప్పటికీ దేశం మొత్తమ్మీద వాడకంలో ఉన్నది మూడు శాతమే.
డా. ఎస్. సుధాకర్ బాబు
పర్యావరణం దెబ్బతింటూండటం, వాతావరణ మార్పుల ప్రమాదం పొంచి ఉండటం, శిలాజ ఇంధనాలు తరిగిపోతూండటం ఈవీల అవసరాన్ని స్పష్టంగా చెబు తూండగా– వేగంగా పెరుగుతున్న జనాభా రవాణా అవసరాలను తీర్చేందుకు సృజనాత్మకమైన, సుస్థిరాభి వృద్ధికి దోహదపడే పరిష్కారాలు కావాలన్నది కూడా అంతే స్పష్టం. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు, స్థూలంగా ఉద్గారాల మోతాదును సున్నాకు చేర్చడం వంటి వాటి సాకారంలోనూ ఈవీల పాత్ర ముఖ్యమైందనడంలో సందేహం లేదు. రానున్న దశాబ్ద కాలంలో ఈవీల సంఖ్య పెరుగుతుందన్న అంచనా నిజమైతే, ముడిచమురు వినియోగం రోజుకు పదిలక్షల బ్యారెళ్ల వరకూ తగ్గుతుంది. భారత్ ఇంధన అవసరాలు 90 శాతం దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. దిగుమతుల మోతాదు తగ్గితే ముడి చమురు కొనుగోళ్లకు ఉపయోగిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు.
ఈవీల వాడకం పెరిగిన కొద్దీ వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఈ క్రమంలో అనేక కొత్త ఉద్యోగాలూ అందుబాటులోకి వస్తాయి. పెట్రోలు, డీజిళ్లతో నడిచే వాహనాల కోసం ఏర్పాటైన వ్యవస్థ స్థానంలో విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఏర్పాట్లు జరిగేందుకు కొంత సమయం అవసరం. పాత వాహనాల స్థానంలో కొత్త ఈవీలు కొనుగోలు చేయా లంటే... ధరలు మరింత తగ్గించడమే కాకుండా, ఛార్జింగ్ పాయింట్ల సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంతోపాటు భారత్‌లోనూ విద్యుత్తు వాహన వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 20 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.
సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వచ్చినప్పుడల్లా కొంతమందికి లాభం, మరికొంతమందికి నష్టం సహజం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో సామా న్యంగా పేదలు చివరివారుగా ఉంటారు. విద్యుత్తుతోనే నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తే తమ వద్ద ఉన్న పెట్రోలు, డీజిల్ వాహనాలను అమ్ముకుంటే వచ్చే నష్టాన్ని భరించడం, లేదా అధిక ధరలు వెచ్చించి విద్యుత్తు వాహ నాలను కొనుగోలు చేయడం రెండూ పేదల విషయంలో కష్టమైపోతాయి. పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాలను ప్రవే శపెట్టాలని ప్రభుత్వాలు తలిస్తే... పేదల అవసరాలను, పరిమితులను గుర్తెరిగి ఈవీల వైపు మళ్లనందుకు వారికి జరిమానాలు విధిస్తే సమాజంలో అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాల విస్తృత వాడకం జరిగేందుకు ముందే చాలా అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. పవర్ గ్రిడ్లు, మరీ ముఖ్యంగా భారత్‌లోని వాటితో ఉన్న ఒక సమస్య విద్యుత్తు వాడకంలో వచ్చే హెచ్చుతగ్గులు. ఒక్కో సారి విపరీతమైన డిమాండ్ ఉంటే, కొన్ని సందర్భాల్లో అతితక్కువ డిమాండ్ ఉంటుంది. వీటికారణంగా ఈవీ ల్లోని ప్రధాన విడిభాగాలైన బ్యాటరీలను దెబ్బతీసే అవ కాశం ఉంది. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో తగిన మార్పులు చేయడం అత్యవసరం.
దీంతోపాటు ఈవీల వాడకంపై ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉండేందుకు తగినన్ని ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం కారణం. దూర ప్రయాణాల్లో ఛార్జింగ్ అయిపోతే? బ్యాటరీలను ఛార్జ్ చేసుకునేందుకు గంటల కొద్దీ వేచి ఉండటం కూడా సమస్యే. ఈ ‘రేంజ్ ఆంగై్జటీ’ సమస్యలను అధిగమించేం దుకు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రయత్నాలే జరుగు తున్నాయి. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 కోట్ల ఛార్జింగ్ పాయింట్లు అవసరమవుతాయని ఒక అంచనా. ప్రస్తుతం ప్రతి రోజూ పదిలక్షల కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతుండగా, భారత్‌లో ఈ సంఖ్య 25 లక్షలకు చేరుకుంటే కానీ రేంజ్ ఆంగై్జటీ సమస్యలను అధిగమించలేము.
విద్యుత్తు వాహనాల వాడకం పెరక్కపోయేందుకు ఉన్న ఇంకో అవరోధం భారీ ధరలు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గించాలంటే ప్రజా రవాణా వ్యవస్థలో, మరీ ముఖ్యంగా రోడ్డు రవాణ రంగంలో ఈవీల వాడకం భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఆర్థిక సమస్యల కార ణంగా చాలా రాష్ట్రాలు ఇప్పటికీ ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతుల్లేకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్ వాహ నాల స్థానంలో విద్యుత్తు వాహనాల కొనుగోళ్లకు రుణాలు ఇవ్వడం కాకుండా గ్రాంట్లు ఇవ్వాల్సిన అవసరముంది.
గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు నిధులు సమకూర్చడం ద్వారా కేంద్రం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపునకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసేం దుకు వీలేర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈ గ్రాంట్లు కేవలం బస్సులు కొనేందుకు మాత్రమే కాకుండా... ఇతర మౌలిక సదుపాయాల కల్పనకూ ఉపయోగపడతాయి. అదే సమయంలో ఈవీ వాహనాల మరమ్మతులు చేసే వారు కూడా అవసరమవుతారు. దూర ప్రయాణాల్లో కొన్ని చోట్ల వాడేసిన బ్యాటరీల స్థానంలో పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీలను అమర్చేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల ప్రయాణీకులకు సమయం ఆదా అవు తుంది. ఇంకోటి ఏమిటంటే.. ప్రభుత్వం ఈవీలు కొనే వారికి ఇచ్చే సబ్సిడీలు కొనసాగించాలి. దూర ప్రయా ణాలకు ఈవీలను వాడని వారు కూడా ఈ సబ్సిడీల కారణంగా వీటిని కొనేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది.
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment