
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా.. భారత్‌తో ప్రాంతీయ వాణిజ్యం, కనెక్టివిటీని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ సైనికాధికారులు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒడంబడికను చేసుకున్నారు. మరోవైపున, పాక్ ఆర్థిక మంత్రి హమీద్ అజర్ నేతృత్వంలోని ఆర్థిక సమన్వయ కమిటీ.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే భారత్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని సిఫార్సు చేసింది. అయితే ఈ కమిటీ సిఫార్సులను పాక్ కేబినెట్ ఆ మరుసటి రోజే తోసిపుచ్చింది. జనరల్ బజ్వా చేపట్టిన చొరవను అపహాస్యం చేయడానికే ఇమ్రాన్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. నియంత్రణ రేఖ పొడవునా చొరబాట్లకు వీల్లేకుండా చూడాలని శాంతికాముకులు పాక్‌ని హెచ్చరించాలి.
తన ఇరుగుపొరుగు దేశాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు ఒక నిరంతర అంశంగా కొనసాగుతున్నాయి. అయితే భారత్ అంటే బద్ధ శత్రుత్వంతో ఉండే పాక్ సైన్యం చాలా కాలం తర్వాత భారత్‌తో ఉద్రిక్తతలను సడలించుకోవడానికి సానుకూలత చూపుతుండటంతో నయా పాకిస్తాన్ ఆవిర్భవిస్తున్న క్రమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామా? భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు శాంతియుతంగా మనగలగడానికి చర్చలు జరిగే అవకాశాలపై జాగరూకతతో కూడిన ఆశావాదం పెట్టుకోవడానికి తగిన మంచి కారణాలు ఉన్నాయని ఇటీవలి కొద్ది రోజులుగా పరిణామాలు సూచిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా పాకిస్తాన్‌లో మొండిపట్టుదలకు మారుపేరుగా ఉండే రాజకీయనేతల్లో అగ్రగామిగా ఉంటున్న ఇమ్రాన్ ఖాన్‌తో భారత్ వ్యవహరిస్తోందని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ పార్టీ అయిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ భారత్ పట్ల బద్ధవ్యతిరేకత కలిగి ఉన్న ఐఎస్‌ఐ మాజీ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ హమీద్ గుల్ ద్వారా సైద్ధాంతికంగా రూపుదిద్దుకుంది మరి.
ఇమ్రాన్ ఖాన్ పాటిస్తున్న భారత వ్యతిరేక ధోరణి తనకు ఒక వరంగా మారిందని చైనా సహజంగానే గుర్తిస్తోంది. బీజింగ్ కమ్యూనిస్టు పాలకుల అధికార వాణి అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా రోజువారీగా వెలువడుతున్న భారత్ వ్యతిరేక భావాలను చైనా నాయకత్వం అభినందిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక వాస్తవికతను తక్షణం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని చాలామంది గ్రహిం చడంతో భారత్ వ్యతిరేక చైనా వ్యవహారం పాకిస్తాన్‌పై తగు ప్రభావం చూపుతోందని చెప్పాలి. పాకిస్తాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇప్పుడు కేవలం 14.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కానీ పశ్చిమ పాకిస్తానీ సోదరులు సాంప్రదాయికంగా చిన్న చూపు చూసే బంగ్లాదేశ్ మాత్రం తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను 44 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. పైగా 1971లో ఆవిర్భవించిన తర్వాత గత అర్ధ శతాబ్ది కాలంలో బంగ్లాదేశ్ వాస్తవంగానే ఆర్థిక, సామాజిక, ద్రవ్య సూచిల్లో పాకిస్తాన్‌ను అధిగమించేయడం కూడా మనం చూడవచ్చు.
ఈ అన్ని పరిణామాల కారణంగా తమ పొరుగుదేశాలతో ఆర్థికాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం తప్పనిసరి అని పాకిస్తాన్‌లో పలువురు నమ్ముతున్నారు. తన గత వారసుల్లాగే పాకిస్తాన్ వాస్తవ పాలకుడిగా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా.. భారత్‌తో ప్రాంతీయ వాణిజ్యం, కనెక్టివిటీని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు, భారత, పాకిస్తాన్ సైనికాధికారులు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒడంబడికను చేసుకున్నారు. మరోవైపున, పాక్ ఆర్థిక మంత్రి హమీద్ అజర్ నేతృత్వంలోని పాకిస్తాన్ కేబినెట్ స్థాయి ఆర్థిక సమన్వయ కమిటీ.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే భారత్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని సిఫార్సు చేసింది.
అయితే ఈ సమన్వయ కమిటీ సిఫార్సులను పాక్ మంత్రిమండలి ఆ మరుసటి రోజే తోసిపుచ్చింది. భారత్ వ్యతిరేక వార్తలు, ప్రకటనల్లో ఆరితీరిపోయిన పాక్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ఎమ్ ఖురేషి, హోంశాఖ మంత్రి షేక్ రషీద్ వంటి భారత్ బద్ధ వ్యతిరేకులు దీనివెనుక ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మజారి నొక్కి చెప్పారు: భారత్‌తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరగరాదని పాక్ కేబినెట్ స్పష్టంగా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌పై 2019 ఆగస్టు 5న భారత్ ప్రభుత్వం తీసుకున్న చట్టవ్యతిరేక చర్యలను వెనక్కు తీసుకునే వరకు భారత్‌లో సంబంధాల పునరుద్ధరణ జరగదని పాక్ ప్రధాని నొక్కి చెప్పారని మజారీ తెలిపారు.
అంటే భారత్‌తో సంబంధాలపై నెలకొన్న ఉద్రిక్తతలను సడలించడానికి చర్యలు చేపట్టాలంటూ జనరల్ బజ్వా చేపట్టిన చొరవను అపహాస్యం చేయడానికే ఇమ్రాన్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడం ద్వారా ఇమ్రాన్ ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌పై తాను డేగ కన్ను వేసి ఉన్నట్లు సందేశం పంపారన్నమాట. బజ్వా తర్వాత పాక్ సైన్యాధిపతి కానున్న ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌తో సహా పాక్ సైన్యం లోని బజ్వా వ్యతిరేకులను సంతృప్తిపర్చడానికే ఇమ్రాన్ ఇలాంటి సందేశం పంపారన్న విషయంలో సందేహమే లేదు. అయితే అదే సమయంలో ఈ ఐఎస్‌ఐ చీఫ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ అయిన బజ్వా పట్ల ఎనలేని విశ్వాసం ప్రకటిస్తుంటాడనడంలో కూడా ఎలాంటి సందేహమూ లేదు.
జనరల్ బజ్వాను వ్యతిరేకిస్తున్న వారిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇమ్రాన్ చేపడుతున్న ఇలాంటి చర్యలు ఉపయోగపడవచ్చు. తీవ్రమైన రాజకీయ సవాల్ చేయడానికి తన రాజకీయ ప్రత్యర్థులైన పీపీపీకి చెందిన అసిఫ్ ఆలీ జర్దారీ, జేయుఐ పార్టీ నేత, ఛాందసవాది మౌలానా ఫజుర్ రహమాన్ వంటివారికి తాను తలుపులు తెరిచే ఉన్నట్లుగా ఇమ్రాన్ సూచించారు కూడా. రాజకీయాల్లో తాను అడుగుపెట్టిన తొలిరోజుల్లో తన ప్రత్యర్థి నవాజ్ షరీఫ్‌ని సవాలు చేయడానికి ఇమ్రాన్ ఖాన్‌కి నాటి పాక్ సైన్యం బలంగా మద్దతిచ్చిన విషయం అతడికి తెలుసు. అలాగే గతంలో జనరల్ బజ్వాతో ఇమ్రాన్‌కు ఉన్నంత సౌహార్థ సంబంధాలు ఇప్పుడు లేనప్పటికీ, సైన్యంలోని ఉన్నతాధికారుల మద్దతును తాను నిలబెట్టుకోగలనని ఇమ్రాన్ భావిస్తున్నారు. అదే సమయంలో అప్ఘాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు సజావుగా ఉపసంహరించుకోవడంలో తాను సహకరిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఇమ్రాన్ నచ్చచెప్పాల్సి ఉంటోంది కూడా. మరోవైపున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు విశ్వసనీయుడిగా ఇమ్రాన్ తన పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే అప్ఘాన్‌లోని అపారమైన వనరులపై చైనా, రష్యా రెండు దేశాలు కన్నేసి ఉంచాయి.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్ ఎంతో నేర్పుతో తన వైఖరిని ప్రదర్శించాల్సి ఉంది. 1980ల ప్రారంభంలో ఇస్లామాబాద్‌లో భారత రాయబారిగా ఉన్న ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్తాన్‌లోని అంతర్గత పరిస్థితి సంక్లిష్టతలపై ఒక స్పష్టమైన అవగాహనను అభివృద్ధి చేశారు. ఇరుదేశాలు ముందుకు సాగాలంటే తమ తమ రాజధానుల్లో తప్పక రాయబారులను కలిగి ఉండాలి. ఆ తర్వాత దోవల్ తెర వెనుక చర్చల్లో ఎలాగూ తన పాత్రను కొనసాగిస్తారు. 2003లో కశ్మీర్‌లో కాల్పుల విరమణ తర్వాత జనరల్ ముషారఫ్ విశ్వసనీయుడైన తారిఖ్ అజీజ్‌తో సమావేశాలకుగాను పాకిస్తాన్లో నాటి హై కమిషనర్ సతీందర్ లంబా ప్రత్యేక దూతగా గణనీయమైన పాత్ర పోషించారు.
అయితే ఆనాడు జరిగిన ఆ చర్చల ప్రక్రియను మొత్తంగా ముషారఫ్ స్థానంలో వచ్చిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ కయ్యాని తోసిపడేశారు. భారత్‌పైకి సందుదొరికితే చాలు తుపాకి పేల్చాలనుకుం టున్న ఇమ్రాన్ ఖాన్... ఆనాడు సతీందర్ లంబాతో పాక్ సైన్యాధికారులు జరిపిన చర్చలను సవివరంగా అధ్యయనం చేయడం మంచిది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సాధారణ సూత్రీకరణ ప్రాతిపదికపై నాటి చర్చలు జరిగాయి. అవేమిటంటే.. సరిహద్దులు తిరిగి మార్చలేం. కానీ సరిహద్దులను మ్యాప్‌లోని రేఖలుగా మాత్రమే ఉంచేలా చేసేందుకు సరిహద్దు సమస్యలు అప్రస్తుతం అని తేల్చేవిధంగా మనం పనిచేయాల్సి ఉంది. అదేసమయంలో నియంత్రణ రేఖకు ఇరువైపుల ఉన్న ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తూ పరస్పరం వాణిజ్యం చేసుకోవాలి.
వ్యాసకర్త:జి. పార్థసారధి
జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ చాన్స్‌లర్
పాకిస్తాన్‌కి మాజీ హై కమిషనర్