సందర్భం
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన మలుపు తిప్పిన రోజు కేసీఆర్ ఆమ రణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ తేదీ. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’నని నినదించి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరాలకు మరల్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రగా నిలిచారు. కట్టలు తెగుతున్న ప్రజాగ్రహాన్నీ, ప్రజాసంఘాల పటు త్వాన్నీ రాజకీయ ప్రక్రియగా మరల్చి, కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యం నెరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆయన తెలంగాణ ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యలకు స్వరాష్ట్ర సాధనే పరిష్కారమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించాడు. ఉద్యమ ఎగుడు దిగుళ్లను చూసుకుంటూ చివరి ప్రయత్నంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తెలంగాణ అంతా భగ్గుమంది.
14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకుని ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు దారి చూపింది. ఆ సత్యాగ్రహి చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరు. వాట్సాప్‌లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పంపుకొనే చెత్త వాదనల అభూత కల్పనలు చరిత్ర కాదు. చరిత్ర తెలుసుకోవాలంటే 78 ఏళ్లకు పూర్వమే తెలంగాణ స్వతంత్ర రాష్ట్ర మన్న విషయం తెలిసి ఉండాలి. 1953లో ఆనాటి సీమాంధ్ర నాయకులు కొందరు చేసిన కుతంత్రాలు తెలుసుకోవాలె. పచ్చటి తెలంగాణ ఎడారిగా
ఎందుకయ్యిందో తెలవాలె. పంట భూముల తెలంగాణ... బీడు భూములై, ముంబై బొగ్గు బాయ్, దుబాయ్ వలస బతుకులుగా ఎట్లా మారిందో; అందుకు కారకులెవరో తెలుసు కోవాలి. కేసీఆర్ ‘జై తెలంగాణ’ అంటే తెలంగాణ సమాజమంతా జై జై అన్నది. ఆయన అడుగుల్లో అడిగేసి నడిచింది.
తెలంగాణ విద్రోహుల కుట్రలను ఎప్ప టికప్పుడు కనిపెడుతూ ఉద్యమాన్ని నిత్య నదిలా మార్చి ప్రవాహ పరుగుగా మారాడాయన. గాంధీ మార్గంలో ఆమరణ దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన వచ్చేలా చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమ యోధుడు. తలవంచని, వెన్నుచూపని యోధుల వెంటే తెలంగాణ నిలిచింది. శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య వంద లాది మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే గుక్క పట్టి ఏడ్చి ‘బిడ్డలారా! మీ కోసమే తెలంగాణ. మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఆకాశం బద్దలు కొట్టయినా తెలంగాణ తెస్తానని రాష్ట్రం వచ్చేదాకా మడమ తిప్పన’ని స్వరాష్ట్ర కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాధన ప్రకటనయ్యింది. ఇదీ చరిత్ర! ఇది మనమందరం ఉద్యమమై ఉద్యమించిన చరిత్ర.
తల్లి స్తన్యం బిడ్డ కందనప్పుడు వేసిన కేక తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణే కాదు. నా తెలంగాణ కోటి కత్తుల వాన, ఉద్యమ ఉద్విగ్న వీణయని పిడికిలెత్తి నిలిచిన స్వరాష్ట్ర ఉద్యమ సమరయోధుడు సలిపిన ఉద్యమ చరిత్రను మననం చేసుకోవాలి. దగా పడ్డ తెలంగాణకు రాష్ట్ర సాధన ఒక్కటే విముక్తి దారని చెప్పిన యోధుడి చరిత్రను చదవాలి. జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ పిడికిలిని చూడాలి. ఓ బక్క మనిషి పిలిస్తే తెలంగాణ ఎలా కదిలిందో చరిత్ర. అసెంబ్లీ, పార్లమెంట్‌లు అచ్చెరువై చూసి స్వరాష్ట్ర సాధన ప్రకటనలు చేసే దాకా తీసుకుపోయిన తెలంగాణ జయుడి కథను రాబోయే తరాలు తెలుసుకోవాలి. ప్రతి ఊరు ఉద్యమ ‘ధూంధాం’గా మారిన చరిత్రను తప్పక తరతరాలు తెలుసుకోవాలి.
కరీంనగర్ సింహ గర్జనల సభలు, వరంగల్‌లో పోటెత్తిన లక్షలాదిమంది సభలు, ఆదిలాబాద్ అడవుల్లో ఇంద్రవెల్లి స్తూపాలు పరవశించిన కథలు, గోదావరిలోయ ప్రతి ఘటనా పోరు దారులన్నీ పొంగి పరవశించిన గాథలు, నగారా మోగించిన నల్లగొండ, మహ బూబ్‌నగర్‌లు; మెతుకు సీమ మెదక్ బిడ్డల ఆకాంక్షలు, ఖమ్మం తొలిదశ ఉద్యమ నిప్పును రాజేసిన నిజామాబాద్ సకలజనుల సమ్మెలు, సాగర హారాలైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనయాత్రలూ.... అన్నింటినీ రాజకీయ ప్రక్రియగా మార్చి స్వరాష్ట్ర ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన ఉద్యమ చరిత్రను కాదన గలరా?
ఉద్యమ జ్యోతి ఆగిపోకుండా, ఉద్యమ వేడి తగ్గకుండా పధ్నాలుగేళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపించిన కేసీఆర్‌ను మరుస్తదా బిడ్డా తెలంగాణ గడ్డ? ప్రపంచీకరణ కాలంలో కోట్లమందిని ఒక్కతాటిపైకి తెచ్చిన ఆయన ‘దీక్షా దివస్’ చరిత్రలో చెక్కు చెదరనిది. వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు (2009లో స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు నేడు)
-జూలూరు గౌరీశంకర్
Comments
Please login to add a commentAdd a comment