తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాల పరిమితి ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఇలాంటి స్థితిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరైంది కాదు. తన నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. రాజీనామా చేయడం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే తప్పుడు సంకేతం ప్రజలకు ఇవ్వడం ఒకటి కాగా, రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి ఆయన తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్ని కల్లో పోటీ చేయటం వింతైన రెండో అంశం.
మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తుందని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరక్కపోతే శాసనసభ్యుడిగా ఆయన చట్టసభలో ప్రభు పై ప్రజా వాణి గట్టిగా వినిపించి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలి లేదా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కృషి చేయాలి. ఆ పని చేయకుండా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరికాదు. వాస్తవంగా తన సొంత ప్రయోజనాల కొరకే ఈ ఎన్నిక తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు దేశంలో గుర్తించబడిన కాంట్రాక్టర్ల లిస్టులో వీరి కుటుంబం ఒకటి. కేంద్ర బీజేపీ పాలకులు తనకు 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పని కట్టపెట్టారని ఆయన స్వయంగా ప్రకటించడం గమనార్హం. తన స్వప్రయోజనాలకు అభివృద్ధి కార్యక్రమాలకి ముడివేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంతో... ఆయనకు భయం పట్టుకుంది. మునుగోడు నియోజక వర్గంలో తమ ఓటమి ఖాయమని తెలిసిన రాజగోపాల్ రెడ్డి, ఆయనకి బడా కాంట్రాక్టు అప్పగించడంతో పాటు, రాజకీయ ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు కమ్యూనిస్టుల మీద విమర్శలకు దిగటం తగదు.
బీజేపీ దక్షిణ తెలంగాణలో కృత్రిమ ఊపును... ఒక్క మాటలో చెప్పాలంటే వాపును సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డిని ఒక ఎరగా ప్రయోగించి బలపడడానికి ప్రయత్నిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి వారికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా, అప్రజాస్వామికంగా కూల్చి తమకు అనూకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నామ రూపాలు లేకుండా చేయడానికి పూనుకుంటున్నారు.
దాంట్లో భాగంగానే తెలంగాణ టీఆర్‌ఎస్ శాసన సభ్యులను వందల కోట్ల రూపాయలతో కొనడానికి చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే. వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీ పాలకులు ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అంటూ ప్రజలను చీలుస్తూ మత సామరస్యాన్ని సమాధి చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఉప ఎన్నిక ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని, బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకుంది. అందుకు రాజగోపాల్ రెడ్డి కుటుంబం, బీజేపీకి బలమైన ఎరగా కనబడింది. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకి సంబంధించి భారతీయ జనతాపార్టీ అంతర్గత ఎజెండాను స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మతతత్త్వ విచ్ఛిన్న కర, ఫాసిస్ట్ విధానాల్ని తిప్పికొట్టేందుకు, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. రానున్న ప్రజా తీర్పు దేశ ప్రజలకు ఆదర్శం కాబోతోంది.
వ్యాసకర్త సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు- జూలకంటి రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment