తనను ‘అలా’ పిలవొద్దని ఆగ్రహానికి గురైన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎక్కువమంది నోళ్లలో ‘అలా’నే నానిపోయే పరిస్థితి తెచ్చు కున్నారు. మామూలుగా మాట్లాడినా పవన్ ఆవేశంగానే మాట్లాడినట్టు ఉంటుంది. ఇక ఆవేశంగా మాట్లాడితే బ్యాలెన్స్ తప్పినట్టే కనబడుతుంది. ఆ క్రమంలోనే ‘చెప్పు’కోలేని మాటలదాకా వెళ్లిపోయారు. తిరిగి చెప్పించుకునే స్థితి తెచ్చుకున్నారు. పోనీ తాను ‘అలా’ కాదని అంత గట్టిగా సమర్థించుకున్న పవన్ తీరా చేసింది ఏమిటంటే, చంద్రబాబు పక్కన ‘అలా’ అనుకునేట్టుగానే నిలబడటం. పార్టీ మీటింగ్‌లో పవన్ ఎందుకు అంత ఆవేశం కనబరిచారు? తదుపరి ఎందుకు చంద్రబాబు వద్ద అంతలా లొంగిపోయి వ్యవహరించారన్న ప్రశ్నలకు జనసేన అభిమానుల దగ్గర కూడా సమాధానాలు లేవు.
చదవండి: టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భలే కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా ప్రత్యర్థుల పేర్లను అనవసరంగా తీయకుండా, తాను చెప్పదలచు కున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా ఎవరికి తగలాలో వారికి తగి లేలా సమాధానం ఇచ్చారు. ఒకరకంగా తన రిప్లైతో ప్రత్యర్థుల మాడును పగలగొట్టినంత పని చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఉపన్యాసాలను పోల్చి చూస్తే ఎంతో తేడా కనిపిస్తుంది. చంద్రబాబు ఒకదానితో మరొకదానికి లింక్ లేకుండా మాట్లాడేవారు. జగన్ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడదలిస్తే దాని పైనే కేంద్రీకరిస్తారు.
పవన్ తెలివితక్కువతనాన్ని జగన్ బాగా ఎక్స్‌పోజ్ చేసినట్లు అర్థం అవుతుంది. తాను ప్రజల మేలు కోసం మూడు రాజధానులు అంటుంటే, ఒకాయన మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రజ లకు సూచిస్తున్నారని జగన్ అవనిగడ్డలో జరిగిన సభలో పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే ఆ ప్రాంతంలో జగన్ మాట్లాడుతుంటే వచ్చిన స్పందన కూడా విశేషమైనదే. దీనిని బట్టే పవన్ కల్యాణ్ ఎంతలా ప్రజలలో పలుచన అయింది తెలుస్తుంది.
ఎవరైనా నాయకుడు ప్రజలకు మంచి చెబుతారా? లేక మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతారా అని జగన్ ప్రజలను ప్రశ్నిం చారు. అందరూ అలా చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటని అడి గారు. దత్తపుత్రుడు, దత్తతండ్రి అంతా కూటమి కట్టి ‘మీ బిడ్డనైన నాపైకి’ యుద్ధానికి వస్తున్నారనీ, దుష్టచతుష్టయంలో భాగంగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నాయనీ అన్నారు. వచ్చే 19 నెలలు ఈ దుష్ట చతుష్టయంతో యుద్ధాన్ని ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. సుమారు 35 వేల ఎకరాల భూమిని రైతుల పరం చేస్తూ పట్టాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో తొలుత తమ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సేవలను వివరించిన తర్వాత, ఏపీ ముఖ్యమంత్రి రాజకీయ అంశాలు మాట్లాడారు.
నిజంగానే పవన్ కల్యాణ్ తెలివితక్కువగా మాట్లాడి పెళ్లిళ్ల గోలలో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. నిజానికి ఈ మధ్యకాలంలో పవన్‌పై వైసీపీ నేతలు పెద్దగా విమర్శలు చేయలేదు. విశాఖలో జరిగిన ఘటనల తర్వాత పవన్ మంగళగిరి పార్టీ కార్యకర్తల సమా వేశంలో రెచ్చిపోయి మాట్లాడారు. ఆ క్రమంలో బేలెన్స్ తప్పారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని అనడమే కాకుండా, చెప్పు కూడా చూపించడం అందరినీ విస్తుపరిచింది. ఒక పార్టీ అధి నేతగా ఉన్న వ్యక్తి ఎవరూ ఇలా గతంలో వ్యవహరించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా నేతలపై పలుమార్లు దూషణ లకు దిగినా, చెప్పులు చూపించేవరకు వెళ్లలేదు.
ఎవరి సలహాయో తెలియదు కానీ, ప్రజల దృష్టిలో ఈయన రాజకీయాలకు పనికి రారేమో అన్న భావన కల్పించారనిపిస్తుంది. రాజకీయంగా ప్యాకేజీ తీసుకుంటున్నాడని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పడం తప్పు కాదు. ఆయన తన ఆదాయ వివరాలు, తనకు వచ్చే డొనేషన్లు తదితర అంశాలు వెల్లడించారు. అంతటితో ఆగితే సరి పోయేది. అలాకాకుండా చెప్పు చూపడం, బూతులకు తెగబడడం... ఇవన్నీ పార్టీ హార్డ్‌కోర్ కార్యకర్తలకు కాస్త జోష్ తెప్పించి ఉండవచ్చు. కానీ జన సామాన్యంలో మాత్రం బాగా నెగిటివ్ అయింది. పోనీ అదే ఆవేశంతో పవన్ ఉండిపోయారా అంటే అదేమీ లేదు. ఆ తర్వాత కాసేపటికి నోవాటెల్ హోటల్‌కు వెళ్లడం, అక్కడకు వ్యూహాత్మకంగా చంద్రబాబు రావడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకుని మీడియా ముందుకు రావడం, ఆ సందర్భంగా చంద్రబాబు పక్కన పవన్ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న సన్నివేశాలు చూసిన తర్వాత ఆయన హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా తీరని ఆవేదనకు గురయ్యారు.
సహజంగానే వైసీపీ నేతలు పవన్ నోవాటెల్ హోటల్‌లో చంద్ర బాబును కలవడం, ప్యాకేజీ కాక మరేమిటని ప్రశ్నించారు. మూడు పెళ్ళిళ్ల అంశాన్ని కూడా ప్రస్తావించి, పవన్ ఒకరిని పెళ్ళి చేసుకుని, మరొకరితో సహజీవనం చేయడం చెల్లుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ఈ మొత్తం ప్రహసనంలో పవన్ కల్యాణ్ పూర్తిగా నష్టపోతే, చంద్రబాబు నాయుడు ఆయన్ని బకరా చేసి వాడుకున్నారన్న అభి ప్రాయం కలుగుతుంది. మరోవైపు వీరిద్దరు కలవడం ద్వారా జగన్ ఎంత బలంగా ఉన్నది చెప్పకనే చెప్పారు. ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ గెలుపు దాపులోకి కూడా రాదన్న భయం చంద్రబాబును వెంటాడు తోందన్న భావన ఏర్పడింది. అది తెలుగుదేశం పార్టీకి కలిగిన డామేజీ. మరో వైపు ముఖ్యమంత్రి చాలా హుందాగా తన ప్రసంగాన్ని సాగించడమే కాకుండా, ప్రత్యర్థులను తుత్తునియలు చేసేవిధంగా, జాతీయ నేతల స్థాయి ప్రమాణాల్లో ప్రసంగించి ప్రజలను ఈ తతంగంపై ఆలోచించేలా చేయగలిగారు.
మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావించాలి. పవన్ కల్యాణ్ ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సహజీవనం చేశారన్న విమర్శలను కూడా ఎదుర్కుంటున్నారు. సరిగ్గా అదే ధోరణిలో ఆయన రాజ కీయంగా కూడా చేశారనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్నారు. టీడీపీతో కలవడానికి బీజేపీ ససేమిరా అంటోంది. అలాంటి పరిస్థితిలో బీజేపీతో విడాకులు తీసుకోకుండానే, టీడీపీతో కలిసి ఒక ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేస్తామనడం కూడా బీజేపీతో పెళ్లి అయితే, టీడీపీతో రాజకీయ సహజీవనం అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. ఇది పవన్ తెలివిగా చేశారని ఎవరూ భావించలేక పోతున్నారు.
ఆయన కాపు సామాజిక వర్గ ఓట్లపైన ఎక్కువ ఆధార పడాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఓట్ల మద్దతు తమకు కలిస్తే అది మరికాస్త ఉపయోగమని చంద్రబాబు ఆశ. పోనీ పవన్ నిజంగానే కాపుల పక్షాన పూర్తిగా నిలబడ్డారా అంటే అలానూ లేరు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్ ఆందోళన సాగుతున్నప్పుడు వారికి రిజర్వేషన్లు ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా అవమానించినా పవన్ నోరు తెరవలేదు. ముద్రగడను చంద్రబాబు హయాంలో పోలీసులు కనీసం పాదయాత్ర చేయడానికి కూడా అనుమతించలేదు. అయినా ఇప్పుడు చంద్రబాబులో ఆయనకు పెద్ద ప్రజాస్వామికవాది కనిపిస్తున్నారు.
ఇక చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనసేన పార్టీ కార్యకర్తలు ఏపీ మంత్రులపై దాడులకు తెగబడితే, కనీసం ఖండించలేని చంద్రబాబు దాడులు చేసినవారిని అరెస్టు చేస్తే అక్రమం అని చెప్పి ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్న చందంగా, ఎలాగోలా జనసేనను తన ట్రాప్‌లో వేసుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ ఉచ్చులో పవన్ పడినట్లు గానే కనిపిస్తుంది. ఫలితంగా జనసేనకు ఏ పదో పరకో సీట్లు ఇచ్చి, తన వెంట తిప్పుకోవాలన్నది ఆయన వ్యూహం కావచ్చు.
కొద్దికాలం క్రితం తాము త్యాగాలకు సిద్ధంగా లేమనీ, ఒకవేళ పొత్తు కుదిరితే సీఎం పోస్టుకు పట్టుబడతామనీ సంకేతాలు ఇచ్చిన పవన్ ఇప్పుడు జారీ పోయినట్లే ఉంది. ఒంటరిగా పోటీచేస్తే వైసీపీని ఓడించలేమన్న భయంతోనే టీడీపీ ఈ రకమైన వ్యూహాలు పన్నుతోంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసినా వైసీపీకి ఢోకా లేదని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ తమతోనే జనసేన ఉంటుందనీ, అవినీతి టీడీపీతో పొత్తు లేదనీ అంటున్నారు. ముందుగా పవన్ ఈ పంచాయతీని తేల్చుకోవల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రజల మద్దతు జగన్‌కు ఉన్నంతకాలం ఎన్ని పార్టీలు కలిసినా ఆయనను ఏమి చేయలేరన్నది ప్రజావాణిగా ఉంది.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment