లతా మంగేష్కర్ (1929 –2022)
సరస్వతీ దేవిని ఆరాధించే ‘వసంత పంచమి’ ఘడియల్లో సప్త స్వరాలు మూగబోయాయి. లతా మంగేష్కర్‌తో పాటు సాక్షాత్ సరస్వతీ స్వరూపం మరో లోకానికి మరలిపోయింది. దేశ సంస్కృతి, చరిత్రల్లో లతాజీ ఒక అంతర్భాగం. అఖండ భారత దేశంలో తన గాన యాత్ర ప్రారంభించి, ఏకంగా 7 దశాబ్దాల పాటు అవిరామంగా ఆ యాత్రను సాగించిన సాంస్కృతిక సమున్నత చిహ్నం ఆమె. మరాఠీ నాటక రంగంలో గాయక– నటుడు దీనా నాథ్ ఐదుగురి సంతానంలో ప్రథమ సంతానం లత. తండ్రి ఆకస్మిక మరణంతో 13వ ఏట తన ముగ్గురు సోదరీమణులు, సోదరుడు హృదయనాథ్‌ల పోషణ, కుటుంబభారాన్ని ఆమె తనపై వేసుకున్నారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తోబుట్టువులంతా సంగీత రంగంలోనే రాణించడం విశేషమే.
లత తన తండ్రి స్నేహితుడు, నటి నందా తండ్రి అయిన మాస్టర్ వినాయక్ (సంగీత దర్శ కుడు, దర్శకుడు) మార్గదర్శనంలో మరాఠీ సినిమాలలో నటించారు. పాటలు పాడడం మొదలు పెట్టారు. అప్పట్లో నూర్జహాన్, షంషాద్ బేగమ్‌ల తారస్థాయిలో పాడే విధానంతో పోలిస్తే, లత గొంతు కొంత పీలగా ఉందని సంగీత దర్శకులు నిరుత్సాహపరిచిన సందర్భాలున్నాయి. క్రమంగా జోహ్రాబాయి, అమీర్‌బాయి కర్నాటకీ, షంషాద్, సురయ్యాల మధ్య... సంగీత దర్శకుడు గులామ్ హైదర్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో లత పాటలు పాడారు. సంగీత దర్శకులు అనిల్ బిశ్వాస్, నౌషాద్, హుస్న్‌లాల్ – భగత్‌రామ్ ద్వయం కూడా లతా మంగేష్కర్ ప్రతిభను గుర్తించి, పాడించారు.
1949లో బాంబే టాకీస్ నిర్మాణం ‘మహల్’లో పాట ‘ఆయేగా ఆయేగా’ పాట దేశమంతటా మారు మోగింది. అప్పట్లో సిలోన్ రేడియోలో ప్రతి రోజూ హిందీ సర్వీస్‌లో ఈ పాట ప్రసారం చేయమంటూ వేలల్లో ఉత్తరాలు వస్తుండేవట! ఆ ఉత్తరాల్లో గాయకురాలి పేరు కనుక్కోవడానికి వచ్చినవే ఎక్కువ. ఎందుకంటే, అప్పట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులలో సినిమాలోని పాత్రధారి పేరే ఉండేది. (చదవండి: వంద వసంతాల హేతువాది)
ఆ తరువాత రాజ్‌కపూర్ సొంత నిర్మాణంలో వచ్చిన ‘బర్సాత్’ చిత్రగీతాలతో దేశమంతా లతా ప్రభంజనం మొదలైంది. నాయికలు తమకు లతానే ప్లేబ్యాక్ పాడాలనే షరతు కాంట్రాక్ట్‌లో పెట్టడం వరకూ వెళ్లింది. సంగీత దర్శకులందరూ లత రికా ర్డింగ్ కోసం వేచి చూడడం, ట్రాక్ సింగర్లతో రికార్డ్ చేసి, పాట షూట్ చేసి, ఆ తర్వాత లతాజీతో ఒరిజినల్ వెర్షన్ పాడించిన సందర్భాలు కోకొల్లలు.
మాతృభాష మరాఠీపై అభిమానంతో, ‘ఆనంద్ ఘన్’ అనే మారుపేరుతో సంగీత దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించి, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారామె. అది జోల పాట కానీ, భజన గీతం కానీ, విషాద గీతం కానీ, ప్రబోధ గీతం కానీ లత ఏర్పరిచిన ప్రమాణాలను వేరెవ్వరూ అందుకోలేనంతగా అన్ని భారతీయ భాషలలో పాడారు. అనిల్ బిశ్వాస్ చొరవతో శ్వాసను ఎక్కువ సేపు నిలిపేలా చేసిన సాధనతో ఆమె సాధించిన విజయాలెన్నో! భారత్–చైనా యుద్ధానంతరం ఆమె పాడిన ‘ఆయ్ మేరే వతన్ కే లోగో’ పాట దేశ ప్రధాని నెహ్రూతో పాటు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఒక జాతీయ గీతం అంతటి స్థాయిని సాధించింది. ఈ పాటను కానీ, ‘ఆనంద్ మఠ్’లోని వందేమాతరం కానీ వినని భారతీయుడు ఉండడు!
ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఒకానొక సందర్భంలో ‘అసలీవిడ అపశ్రుతిలో పాడదా?’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆమెకు ‘ఉస్తాదోంకా ఉస్తాద్’గా కితాబిచ్చారు. ఫిలింఫేర్ అవార్డులు, అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పుర స్కారం, జాతీయ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో పాటు దాదాపు అన్ని సంగీత, సాంస్కృతిక అవార్డులకూ లత ఓ చిరునామా. (చదవండి: ఆదర్శ జీవితానికి కొలమానం)
క్రికెట్ అంటే లతాజీకి వీరాభిమానం. అందుకే, 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు నజరానాలు అందించడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వద్ద నిధులు లేకపోవడంతో తనే పూను కొని, ఒక సంగీత విభావరి నిర్వహించారు. రూ. 20 లక్షలకు పైగా సేకరించడమే కాక, ఎల్పీ రికార్డును విడుదల చేసి, రాయల్టీ కూడా బీసీసీఐకి అందించిన ఔదార్యం లతాజీది. తరాలు మారినా 7 దశాబ్దాల పాటు అన్ని ట్రెండ్‌లలో తన ఉనికి చాటుకున్నారు. రోషన్–రాజేష్ రోషన్, చిత్రగుప్త– ఆనంద్ మిళింద్, ఎస్డీ బర్మన్ – ఆర్డీ బర్మన్‌ల తరాలను దాటి నేటి ఏఆర్ రెహమాన్ వరకూ స్వరాన్ని అందించారు.
‘ఆన్’, ‘ఉడన్ ఖటోలా’ చిత్రాలు తమిళంలో డబ్ అయినప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ లతానే పాడారు. ఇక, తెలుగులో ‘సంతానం’ చిత్రంలోని అనిసెట్టి రచన ‘నిదురపోరా తమ్ముడా’, ‘ఆఖరి పోరాటం’లో ‘తెల్లచీరకు...’ పాటలు పాడారు. దర్శ కుడు వంశీ ‘గాలికొండాపురం రైల్వేగేటు’ నవలను సినిమాగా తీయాలనుకున్నప్పుడు, ఇళయరాజా సంగీతంలో లతాజీతో పాట రికార్డింగ్ చేయిం చారు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవ డంతో అందులోని ఆమె పాట వినే అదృష్టం తెలుగు అభిమానులు కోల్పోయారు. ఆమె తన 80వ ఏట అన్నమాచార్య కీర్తనలను టీటీడీ కోసం ఆలపించి, పారితోషికం స్వామికే సమర్పించడం విశేషం. హిందీ, బెంగాలీ, మరాఠీ, ప్రైవేట్ భజన్స్ ఏవైనా లతాజీ పాటల్లో అత్యుత్తమమైనవి ఎంపిక చేయడ మంటే సంద్రాన్ని దోసిట పట్టాలనుకోవడమే!‘నాకు ఒక హార్మోనియం, లతాని ఇవ్వండి. సంగీతం కంపోజ్ చేసిచ్చేస్తా’ అన్నది ఎస్డీ బర్మన్ మాట. నటి నర్గీస్ – ‘లతాజీ పాడిన విషాద గీతం అభినయించా లంటే గ్లిజరిన్ అవసరం రాలేదు. లతాజీ గొంతులో పలికే ఆ భావమే నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు తెప్పించేది’. చలనచిత్ర సంగీతంలో లతాజీ ముద్ర చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కొల్లలు. కవి జావేద్ అఖ్తర్ అన్నట్లు ‘ఈ భూగ్రహానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే లతా!’
– రవి పాడి, రైల్వే ఉన్నతాధికారి
అరుదైన గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త
Comments
Please login to add a commentAdd a comment