నాయీ బ్రాహ్మణుల నిరసన
పారిశ్రామికీకరణ కర్కశ పాదాల కింద ఎన్నో చేతివృత్తులు నలిగి పోయాయి. ఇంతకాలం మైల పనిగా భావించిన వృత్తుల్లో సైతం ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో సాంప్రదాయిక మంగలి (నాయీ బ్రాహ్మణ) వృత్తిపై కార్పొరేట్ కన్ను పడింది. కేశాలంకరణకు, రూప సౌందర్యానికి ఎంతైనా ఖర్చుపెట్టేవాళ్లు పెరుగుతున్న క్రమంలో వారి అవసరాలు తీర్చే రీతిలో కులవృత్తి మంగళ్ళు ఎదిగివచ్చే పరిస్థితులు లేవు. దీన్ని కార్పొరేట్లు చేజిక్కించుకొని, క్షుర కర్మ ఒక కుల వృత్తి అనే ముద్రని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం 45 శాతం కస్టమర్లు మాములు కటింగ్ చేయించుకోగా మిగతావారు చూడచక్కగా కనబడేందుకు సెలూన్లకు వస్తున్నారు. ఐదేళ్లలో ఈ ఫ్యాషన్ కస్టమర్ల సంఖ్య 60 శాతం పెరిగిందట.
2014లో రిలయన్స్ రిటైల్ తరపున హెయిర్ కటింగ్ షాపులు ఆరంభిస్తామన్న ప్రకటన రాగానే క్షురకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది. ఈ నవంబర్ మొదటివారంలో మరో వార్త వచ్చింది. నేచురల్స్ స్పా సంస్థలో 49 శాతం భాగస్వామ్యాన్ని కొనుగోలుకు ముకేశ్ అంబానీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన నేచురల్స్‌కి దేశంలోని ప్రముఖ నగరాల్లో 700 పైగా సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్యను 3,000కి పెంచాలనే ఆలోచనతో ముకేశ్ పావులు కదుపుతున్నారని వార్త. ఆయన సొంత సొమ్ముతో కొన్ని దుకాణాలు తెరిచినా కొంత కాలం తర్వాత ఫ్రాంచైజీ విధానాన్ని మొదలు పెడతారు.
బ్రాండ్ పేరు కస్టమర్లలో చొచ్చుకు పోయాక ఆ పేరుతో షాపు తెరిచేందుకు వచ్చినవారి నుండి డిపాజిట్లు వసూలు చేసి రోజువారీ వ్యాపారంలో కమిషన్ తీసుకుంటారు. సొంత షాపుల బేరాలు దెబ్బ తింటే మంగలి కులంవారు ఈ సెలూన్లలో పనికి కుదరక తప్పదు. వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు తమ వృత్తిలోనే కూలీలుగా మారే దుఃస్థితి వస్తుంది. అందుకే కార్పొరేట్లు ఈ వ్యాపారంలోకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి. (క్లిక్ చేయండి: ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి)
– బి. నర్సన్, రచయిత
94401 28169
Comments
Please login to add a commentAdd a comment