ప్రతీకాత్మక చిత్రం
రామాయణ కాలం నుంచీ వధూవరులు సమానమైన వయస్సు, నడవడి, శీలము, ఉత్తమ గుణాలు కలిగిన వారై ఉండాలని సీతారాముల అన్యోన్యార్హతను వివరిస్తూ వాల్మీకి రచించిన ‘తుల్యశీల వయో వృత్తాం...’ అనే శ్లోకం వల్ల తెలుస్తోంది. ఆ మాటకొస్తే సీత... రాముడి కంటే పెద్దదని జనశ్రుతి. కానీ ధర్మశాస్త్రాలలో వరుడు వధువు కంటే పెద్దవాడయి వుండాలనీ, వరహీనమైతే పురుషుడికి ఆయుఃక్షీణమనీ చెప్పారు. ఈ నియమం మన వివాహ వ్యవస్థలో అన్ని కులాలలోనూ పాటింపబడుతోంది.
పెళ్లికూతురు కంటే పెళ్లికొడుకు కనీసం అయిదేళ్లయినా పెద్దగా ఉండాలనే ఆచారాన్ని నిన్నటి పురుషా ధిక్య సమాజం స్వార్థంతో దుర్వినియోగం చేసింది. ‘అష్ట వర్షాత్ భవేత్ కన్యా’ అని కన్యా లక్షణానికి హద్దుల్ని నిర్ణయించి ఆడపిల్లలకు ఎనిమిదేళ్ల లోపే పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని భావించారు. అలాంటి మూఢ విశ్వాసంతో శారదా చట్టం (1929లో బాలికల వివాహ వయస్సు 14 సంవత్సరాలు) అమలులో ఉన్న కాలంలో కూడా ఆ చట్టం వర్తించని ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికలకు వివాహాలు చేశారు. ఇదే అదనుగా ముసలివాళ్లు కూడా కన్యాశుల్కాన్ని చెల్లించి ముక్కు పచ్చలారని పసిపిల్లలకు మూడుముళ్లు వేసి వాళ్ల భవిష్యత్తులను అంధకారమయం చేశారు. అలాంటి అభాగినులకు బాసటగా గురజాడ, కందుకూరి మొదలైన కవులూ, సంస్కర్తలూ నిలిచి బాల్య వివాహాలను రూపుమాపడానికీ, వితంతు వివాహాలను ప్రోత్సహించడానికీ కృషి చేశారు.
బాల్య వివాహాల దురాచార దశ దాటిన తర్వాత కూడా ఆడపిల్లల అగచాట్లు అంతం కాలేదు. 1978లో ప్రభుత్వం అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయస్సులుగా నిర్ణయించినా అమ్మాయిలు మైనర్లుగా ఉండగానే వాళ్ల ఇష్టా నిష్టాలతో సంబంధం లేకుండానే చాలామంది తల్లి దండ్రులు వాళ్లకు మూడుముళ్లు వేయించి బాధ్యత తీరిపోయిందనుకునేవారు. వయోభేదం కంటే జాత కాలకు ప్రాధాన్యాన్నిచ్చి పెళ్లికూతురు కంటే రెట్టింపు వయసున్న పెళ్లికొడుకులకు కూడా కట్టబెట్టేవాళ్లు. ‘కన్యాశుల్కం’ నాటకంలో అగ్నిహోత్రా వధాన్లు చెప్పినట్టు పెళ్లి కోసం యిచ్చే ఆ జాతకాల్లో కూడా నిజాలు ఉండేవి కావు. ఆస్తులు బయటకు పోకుండా ఉండాలని బలవంతంగా కట్టబెట్టిన మేనరికాలు... అక్క చనిపోతే వయసుతో తేడాను లెక్క చేయకుండా పిల్లల తండ్రి అయిన బావకు ముడిపెట్టిన రెండో పెళ్లిళ్లు... రెండో పెళ్లి వాడయినా మూడో పెళ్లి వాడయినా సంపన్నుడయిన అల్లుడు ముందుకొస్తున్నాడని అతని కూతురు వయసు కూడా లేని పడుచు పిల్లను కన్యాదానం చేసే పేద తల్లిదండ్రుల దీనావస్థకు చెందిన పెళ్లిళ్లు– ఇలా అనేక సందర్భాలలో గత్యం తరం లేక కన్నె పిల్లలు బలి పశువులయ్యేవారు! పైన పేర్కొన్న అన్ని రకాల పెళ్లిళ్లలోనూ వయస్సులో పెద్దవాళ్లయిన ‘మొగుళ్ల’ను కట్టుకుని ముద్దు ముచ్చట లేకుండా ‘అరిటాకు – ముల్లు’ సామెతగా జీవితంలో వసంతం లాంటి యవ్వనానికి దూరమైంది ఆడ పిల్లలే!
కాలం మారింది. కన్యాశుల్కమే కాదు, వరకట్నం కూడా తగ్గుముఖం పట్టింది. ఆడపిల్లలు చదువుకొని మగవాళ్లతో సమంగా ఉద్యోగాలు చేస్తున్న వర్తమాన సమాజంలో సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు కూడా గణనీయంగానే జరుగుతున్నాయి. ‘జగత్తులో నేడు సగం దగాపడుట మానుకొంది’ అని దాశరథి గారన్నట్టు జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరమేమిటి అనే రోజులు పోయాయి. వివాహానంతరం కూడా భర్తతో సరిపడకపోతే నవ వధువు రాజీ ధోరణి విడిచి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తోంది. ఈలోగా అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు.
డేటింగులూ, సహజీవనాలూ కూడా మన వివాహ వ్యవస్థలో చొరబడిన ఈ కాలంలో ప్రేమ వివాహాలకు సంబంధించినంతవరకూ అమ్మాయి అబ్బాయి పుట్టిన తేదీ తెలుసుకుని ప్రేమించడం లేదు. పెద్దలు ఏర్పాటు చేస్తున్న పెళ్లిళ్లలో కూడా పెళ్లి కూతురు తన కంటే ఒకటి రెండేళ్లు మాత్రమే పెద్ద వాడయిన వరుణ్ణి కోరుకుంటోంది. పెద్దలు అంగీకరిస్తే అన్ని విధాలా అనుకూలమైన సంబంధమైతే పెళ్లికొడుకు ఒకటి రెండేళ్లు చిన్నయినా చేసుకోవడానికి సిద్ధమంటోంది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో జంట మధ్య స్వల్పమైన వయోభేదం వల్ల వచ్చే నష్టమేమీ లేదనిపిస్తోంది. ఆడపిల్ల అబ్బాయి కంటే శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదుగుతుంది. ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు, పరిణతి ఆడపిల్లకు తక్కువ వయస్సులోనే అలవడ తాయి గనుక పెళ్లికొడుకు కంటే పెళ్లికూతురు చిన్నదిగా ఉండాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచి ఉండొచ్చు.
వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనే ఆలోచనలకు కాలం చెల్లి, దాంపత్య జీవితంలో అపస్వరాలు వినిపించకుండా వివాహానికి ముందే అన్ని నిజాలూ చెప్పడం మంచిదనే అభిప్రాయాలు నేడు ఇరుపక్షాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయసును మగవారితో సమంగా 21 ఏళ్లకు పెంచుతూ సవరణ బిల్లును తీసుకురావడం హర్షదాయకం. ప్రభుత్వం ఆదేశంతో పెద్దలు కూడా మారి వైవాహిక జీవితానికి ఈడూ జోడూ ముఖ్యమనే ఆడపిల్లల అభిప్రాయంతో ఏకీభవించి, వారిని ఆశీర్వ దిస్తారని ఆశిద్దాం.
– పి. మానసారెడ్డి
సామాజిక విశ్లేషకులు, దుబాయ్
(కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచేలా బిల్లు తెచ్చిన సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment