ఈ నెల 6న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం.
మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు.
అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్‌ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్‌లను పాక్‌కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్‌ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు.
తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్‌లోకి ప్రవేశించారు.
భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్‌ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్‌కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment