
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లులపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ జమ్మూకశ్మీర్‌లోకి పూర్తిగా భారత బలగాలు వెళ్లేలోపే కాల్పుల విరమణకు నెహ్రూ ఆదేశాలిచ్చారు.
అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారై అక్కడి ప్రజలు కష్టాలపాలయ్యారు’’ అని సోమవారం రాజ్యసభలో ఆరోపణలుచేయడం తెల్సిందే. దీనిపై మంగళవారం రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఘాటుగా స్పందించారు. ‘‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్నీ ధారపోశారు.
స్వాత్రంత్య్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇంకా ఇలాంటి చరిత్ర అంతా అమిత్ షాకు తెలీదనుకుంటా. అందుకే పదేపదే చరిత్రను తిరగరాస్తున్నారు. ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే. కుల గణన వంటి సమస్యల సంగతేంటి? అసలు ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?. ఈ అంశాలను బీజేపీ అస్సలు చర్చకు స్వీకరించదు. భయంతో పారిపోతోంది. బీసీలను పట్టించుకోవట్లేదు’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ఓబీసీల ప్రాధాన్యం పెరగాలి
గిరిజన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా, ఓబీసీ నేతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందికదా ? అన్న మీడియా ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. ‘‘మేం కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేశాం. వాళ్లు కూడా మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను సీఎంగానే చేశారు. బీసీలకు ఒకే ఒక్క కీలక పదవి ఇస్తే సరిపోదు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు. మరింత మంది ఓబీసీలకు ప్రాధాన్యత దక్కాలి. వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మోదీ సర్కార్ ప్రధానాంశాలను పక్కనబెట్టి ప్రజల దృష్టికి మరల్చుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు.