
మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
విశ్లేషణ
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం పరిహాసాస్పదం! అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి నాయకుడిగా ఎదిగి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని స్థాపించిన కేజ్రీవాల్ భారత రాజకీయాల్లో ఒక ఆశాకిరణంగా కనబడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందంటే దానికి కారణం కేజ్రీవాల్. అలాంటిది... ఇప్పుడు ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ఆప్ ముందున్న పెద్ద సవాలు. రెండవ వరుస నాయకులను ఎదగనివ్వకపోవడం ఆప్ వైఫల్యాలలో ఒకటి. ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ జైలు నుండే నడుపుతారని ఆప్ చెబుతోంది. ఈ వాదన ఆచరణలో నిలబడదు. చివరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను అమలు చేయడానికి ఇది తగిన సందర్భమయ్యే ముప్పుంది.
ఇది ఎంత పరిహాసాస్పద విషయం! అవి నీతి వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ నిలబడేనా?
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఢిల్లీలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన కేజ్రీవాల్ అరెస్టు ఉదంతం... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గణనీయ స్థాయిలో రిస్క్ తీసుకున్నట్లు చూపిస్తోంది. ఈడీ చర్య వెనక్కి తన్నడమే కాదు, ఆఖరికి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల అవకా శాలను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోగల దూతగా తనను తాను చూపించుకోవాలనే నరేంద్ర మోదీ గేమ్ ప్లాన్ లో భాగంగానే ఈ అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది.
తాను ప్రధాని అయినప్పటి నుండి మోదీ... తాను అవినీతికి పాల్పడని వ్యక్తిగానే కాదు, ఇతరులను కూడా అలా చేయడానికి అనుమతించనివాడిగా తన ఇమేజ్‌ను ఒక తెలివిడితో నిర్మించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సహా ప్రతిపక్షాలను అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ పార్టీల సమాహారంగా చిత్రీకరించడానికి ఆయన ఏ మార్గాన్నీ వదిలిపెట్ట లేదు.
ఎన్నికలు సమీపంలో ఉన్న కాలంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను (జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, ఢిల్లీలో కేజ్రీవాల్) అరెస్టు చేయడం చూస్తే, అవినీతి అనేదాన్ని ఎన్నికల్లో పెద్ద అంశంగా మోదీ కోరుకుంటున్నారని రుజువు. ఈ వ్యూహం విజయవంతమవుతుందో లేదో కానీ, కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రం కచ్చితంగా ఆప్‌కు అస్తిత్వ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉంది.
అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం తాలూకు పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ. రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ముందు దాని నాయకులకు క్రియాశీల రాజకీయాల్లో అనుభవం లేదు. ఇతర రాజ కీయ పార్టీల మాదిరిగా కాకుండా, ఆప్‌కి వెనక్కి మరలడానికి సంస్థా గత స్మృతి లేదు. పైగా ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొనే సంస్థాగత పటిష్ఠత కూడా దానికి లేదు. ఇటువంటి సంక్షోభాలు తరచుగా ఇతర నాయకులను ముందు వరసలోకి నెడుతుంటాయి. కానీ ప్రస్తుతానికి, ఇది ఆప్‌కు అసంభవంగా కనిపిస్తోంది.
కేజ్రీవాల్ లేనప్పుడు శూన్య తను భర్తీ చేయగల మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఇప్పటికే నిర్వీర్యులై జైలులో మగ్గుతున్నారు. ఈ ముగ్గురూ లేకపోవడంతో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్లు, క్యాడర్‌లందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ఎవరూ లేకుండాపోయారు. రెండవ వరుస నాయకులను ఎదగనివ్వకపోవడం ఆప్ అతిపెద్ద వైఫల్యాలలో ఒకటి. పార్టీ కేజ్రీవాల్ చుట్టూ కేంద్రీకృతమై నడిచింది. ఎవరికీ స్వయంప్రతిపత్తి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
పోరాట యోధుడు
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ దాని ప్రారంభం నుండి పోరాట పటిమను కలిగి ఉంది. ఇది అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. భారత రాజకీయాలలో సంక్షోభాలను ఎదుర్కోవడాన్ని ఆనందించడమే కాదు, మోదీలా అందరినీ ఏకతాటి మీదకు తెచ్చే నాయ కుడు కేజ్రీవాల్. ఆయన్ని ఇష్టపడవచ్చు లేదా ద్వేషించవచ్చు, కానీ ఎప్పుడూ విస్మరించలేం. ఆయన మేధావితనం లక్ష్యం కోసం ఒకే దీక్షగా సాగిన సాధనలో ఉంది.
ఆయన ఫీనిక్స్ పక్షిలా బూడిద నుండి లేచే అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఆయన అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ రూపశిల్పి. అది మొత్తం రాజకీయ వ్యవస్థను కదిలించింది, కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందంటే దానికి కారణం కేజ్రీ వాల్. అయితే, కేజ్రీవాల్ సృష్టించిన పరిస్థితిని బీజేపీ నేర్పుగా ఉపయోగించుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2014లో 49 రోజుల అధికారం తర్వాత కేజ్రీవాల్ తన ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆయన రాజకీయ జీవితం పట్ల అనేక సంస్మరణ గీతాలు రాసేశారు. ఆ తర్వాత, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ మొత్తం ఏడు స్థానాలను కోల్పోయింది. దీంతో 2015లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గెలుపొందుతుందనే ఆశను ఆఖరికి దాని నాయకులు కూడా కోల్పోయినప్పుడు ఇది జరిగింది: అపూర్వమైన తీర్పుతో పార్టీ తిరిగి పుంజుకుని, 70 అసెంబ్లీ సీట్లలో 67 గెలుచుకుంది.
కేజ్రీవాల్ పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో కనెక్ట్ అవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. కానీ నేడు పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దానిని నడిపించడానికి ఆయనకు స్వేచ్ఛ లేదు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని నిబంధనలతో ఆయనపై అభియోగాలు మోపారు. బెయిల్ అంత సులభం కాదు. పైగా ఆయన నెలలపాటు జైలులో గడపవలసి ఉంటుంది.
రాజీనామా చేయడమే మేలు!
ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ఆప్ ముందున్న మొదటి, అతిపెద్ద సవాలు. అయితే ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ జైలు నుండే నడుపుతారని ఆప్ చెబుతోంది. ఈ వాదన మంచి వాక్చాతు ర్యానికి పనికొస్తుందికానీ, ఆచరణలో నిలబడటానికి చట్టపరమైన ప్రాతిపదికలు లేవు. కేజ్రీవాల్ తన సహచరుల్లో ఎవరినీ విశ్వసించరనీ లేదా రాజ్యాంగ చట్రంపై ఆయనకు అంతగా అవగాహన లేదనీ సూచిస్తూ, పార్టీలోని అంతర్లీన బలహీనతను ఇది బహిర్గతం చేస్తుంది. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం మొత్తానికి మూలాధారం. కానీ ఆయనే జైలులో ఉంటే, అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసంపరిపాలనను నడపలేరు.
ఈ స్థితిని చేపట్టడం అంటే బీజేపీ,మోదీ ప్రభుత్వం చెప్పుచేతల్లో ఆడటమే అవుతుంది. ఇది రాజ్యాంగ విచ్ఛి న్నానికి దారి తీస్తుంది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను అమలు చేయడానికి తగిన సందర్భం అవు తుంది. మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జయలలిత అరెస్ట్ అయినప్పుడు చేసినట్టుగానే కేజ్రీవాల్ రాజీనామా చేసి, తాను లేనప్పుడు సీఎం కాగల కొత్త నాయకుడిని పార్టీ ఎన్నుకోనివ్వాలి. హేమంత్ సోరెన్ కూడా అరెస్టు కావడానికి ముందు, తన స్థానంలో చంపయీ సోరెన్ కు మార్గం సుగమం చేశారు.
అలా కాదంటే, ఆప్ ప్రస్తుత వ్యూహానికి ఎదురుదెబ్బ తగులు తుంది. పైగా ఢిల్లీకున్న డీమ్డ్ రాష్ట్ర హోదాను ఉపసంహరించుకునే పరిస్థితికి కూడా దారితీయవచ్చు. పైగా అది ఎన్నుకున్న ప్రభుత్వం లేదా అసెంబ్లీ లేకుండా 1993 పూర్వ స్థితికి తిరిగి వెళ్లవచ్చు. అది ఆమ్ ఆద్మీ పార్టీకి విపత్తే అవుతుంది.
ఆప్ ఆవిర్భావం ఒక ఆశాకిరణమై, భారత రాజకీయాల్లో ఆదర్శ వాదం తిరిగి వచ్చినట్లు ప్రశంసలు పొందింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు జాతీయ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించే అవకాశం ఉండింది. ఆప్ పాత భవనాన్ని ధ్వంసం చేసి కొత్త రాజకీయ నిర్మాణాన్ని నిర్మించాలనే చిత్తశుద్ధితో పాత వ్యవస్థ తిరస్కరణను ప్రబోధించింది. కానీ అయ్యో, దానికి చరిత్రపై స్పృహ లేకపోవడం, దేశాన్ని పునర్నిర్మించాలనే దృక్పథం లేకపోవడం వల్లే ఆప్ ఈనాటి నిరాశకు కారణమైంది.
ఆశుతోష్
వ్యాసకర్త ‘ఆప్’ మాజీ సభ్యుడు, పత్రికా సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment