యుద్ధంలో పరాజితులే తప్ప విజేతలెవరూ ఉండరని టాల్‌స్టాయ్ తన ‘వార్ అండ్ పీస్’ నవలలో ఎప్పుడో చెప్పాడు. చరిత్ర దానిని అనేక మార్లు రుజువు పర్చింది కూడా! ఏడాది దాటిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, నెల రోజులుగా పాలస్తీనా (హమాస్) – ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో ‘పరా జిత’... యావత్ ప్రపంచం అంటే అతిశయోక్తి కాబోదు. అయితే, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య రాజుకొన్న యుద్ధ మూలాలు 40వ దశకం చివర్లోనే ఏర్పడ్డాయి.
1948లో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పడి, ఆక్రమిత ప్రాంతాల నుంచి అరబ్బులను తరమికొట్టడంతోనే పశ్చిమాసియాలో శాంతికి విఘాతం ఏర్పడింది. ‘పాలస్తీనా విమోచన సంస్థ’ (పీఎల్‌ఓ) ఏర్పడి ఆక్రమిత ప్రాంతాలను తమకు అప్పగించాల్సిందిగా ఇజ్రా యెల్‌ను కోరింది. అందుకు భారత్‌తో సహా వివిధ దేశాల మద్దతు కోరింది. అయితే, స్వప్రయోజనాలు, రాజకీయ కార ణాలతో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఇజ్రాయెల్‌ను బలపర్చడమే కాకుండా, భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌ను మందలించే తీర్మానాలన్నింటినీ వీటో చేశాయి. ఈ నేపథ్యంలోనే అరబ్బులు ఇస్లావ్‌ు ఏకత్వ నినాదాన్ని ఎత్తుకొని ఇస్లా మిక్ దేశాలను తమకు అనుకూలంగా చేసుకోవాలని ప్రయ త్నించారు. కానీ, మత దృష్టితో ఏకం కావడం అన్నది తాత్కాలిక ప్రయోజనాలనే తీరుస్తుందన్నది పాలస్తీనా విష యంలో అనేకసార్లు రుజువయ్యింది.
యుద్ధం అన్నది ఓ ఆకస్మిక పరిణామం కాదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం అయినా, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధమైనా వాటికి చారి త్రక కారణాలు ఉన్నాయి. ఈ పరిణామాలకు గల మూల కారణాలను అర్థం చేసుకొని తగిన చొరవతో పరిష్కారానికి ప్రయత్నిస్తేనే యుద్ధాలు నివారించబడతాయి. కానీ, ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఐక్యరాజ్య సమితా? పేరుకు తటస్థం అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి కొన్ని దేశాలకు కొమ్ముకాసే జేబు సంస్థగా మారిపోయిందన్న అపప్రథను ఎప్పుడో మూటగట్టుకొంది. ఐరాస తన అంతర్జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో వెనుకబడింది.
గాజాలోని ఆసు పత్రిపై బాంబులు పడి వందలాది మంది మరణిస్తే.. ఆ క్షణాన్నే ఇజ్రాయెల్ భూభాగంపై కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ బాంబులు వేసింది ఇజ్రాయెల్ సైన్యం కాదనీ, ఉగ్రవాదుల పనేననీ ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకొని ఆ దేశాన్ని వెనకేసుకొచ్చారు. జనావాసాలపై, ఆసుపత్రులపై, విద్యా సంస్థలపై దాడులు చేయ కూడదని ‘జెనీవా ఒప్పందం’ ఉన్నా... వాటిని ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తుంటే, నోరు విప్పలేని ఐరాస ఆశక్తత అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్‌పై ‘హమాస్’ చేసిన దాడిని ఎవ్వరూ సమర్థించరు. కానీ, ఉగ్రవాదుల ఏరివేత ముసు గులో గాజాలోని సామాన్య పౌరులను, ముఖ్యంగా పసి పిల్ల లను హతమార్చడాన్ని ఎవరు హర్షించగలరు?!
ప్రపంచీకరణ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలూ పరస్పర ఆధారితమైపోయిన నేపథ్యంలో... ఆ యా దేశాల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పు చోటుచేసుకొంది. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి వ్యవస్థ పుట్టుకొచ్చి
ఆ యా దేశాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను శాసించే స్థాయికి చేరుకొన్న తర్వాత, అంతర్జాతీయ పరిణామాలు కొన్ని దేశాలకు కొత్త సవాళ్లను తెచ్చి పెట్టాయి. ప్రపంచీకర ణతో లాభం పొందిన చైనా... దక్షిణాసియా దేశాల అంత ర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. బలహీనదేశాలకు ఆర్థిక సాయం అందించే నెపంతో కొన్ని దేశాల విదేశాంగ ప్రతిపత్తిని దెబ్బతీసే యత్నాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి.
కాగా, భారత్‌కు సంబంధించినంతవరకు పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్నీ, ఏడాదికి పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా నడుమ జరుగుతున్న యుద్ధాన్నీ ఏ దృక్కోణంలోంచి చూడాలన్న అంశంలో దేశంలోని పాలక పార్టీ బీజేపీకీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం అంత ర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. జవహర్‌లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాంగ వ్యవహా రాలను కూడా ఆయనే నిర్వహించేవారు. సహజీవన సూత్రం ఆధారంగా అంతర్జాతీయ వ్యవహారాలను చూస్తామనీ; దానికి అనుగుణమైనదే దేశ తటస్థ వైఖరి అంటూ ఆ ప్రాతిపదికననే అలీన విధా నాన్ని (నాన్ అలైన్డ్) రూపొందించారు.
అంతేకాదు... వివిధ దేశాల మధ్య సహృద్భావం, అవగాహనతోనే సమస్యలు పరి ష్కారం అవుతాయితప్ప సైనిక ఒప్పందాలు (పాక్ట్స్), సైనిక కూటములలో తీసుకునే సభ్యత్వాలు పరిష్కారం అందించ వని నిర్ద్వందంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం నుంచి ఆ తర్వాత ఏ ఒక్క ప్రధానమంత్రీ... చివరకు వాజ్‌పేయి కూడా భిన్నంగా వ్యవహరించలేదు. 1999– 2004 మధ్య దాదాపు ఐదేళ్ల పాటు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి పలుమార్లు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.
అయితే, తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి తెగబడి వందలాది మంది అమాయక ప్రజల్ని విచక్షణా రహితంగా చంపివేసిన దారుణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించి ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాలస్తీనాకు మద్దతు ఇస్తూ తీర్మానం చేసింది. సాధారణంగా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి దేశంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. కేంద్రానికి బాసటగా నిలవాలి. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల మద్దతు పొందడమే లక్ష్యంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లు అర్థమవుతోంది.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం పట్ల అనుసరిస్తున్న తటస్థ వైఖరినే పాలస్తీనా–ఇజ్రాయెల్ అంశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇజ్రా యెల్‌పై హమాస్ దాడి ఓ ఉగ్రవాద చర్య. దీనిని ఖండిస్తూ ఇజ్రాయెల్‌కు బాసటగా నిలుస్తామని దేశ ప్రధానీ, విదేశాంగ మంత్రీ ఇరువురూ స్పష్టంగా వెల్లడించారు. మరోపక్క గాజా ప్రాంతంలోని బాధితులకు అవసరమైన ఆహారం, ఔషధా లను భారత్ తరలించడాన్నీ బాధ్యతాయుతమైన చర్యగా చూడాలి. ఇటీవల ఐరాస సర్వప్రతినిధి సభలో ‘ప్రజల భద్రత, న్యాయమైన మానవీయ బాధ్యత కోసం’ అంటూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. దీనిపై వచ్చిన విమర్శలూ గమనార్హమే. నిజానికి, కీలకమైన ఇటువంటి అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం పాలక బీజేపీ, అన్ని ప్రధాన రాజకీయ పక్షాలను పిలిచి సమావేశం నిర్వహించాలి.
గత 8 ఏళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అమెరికా అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్ని ఆక్ర మించిన చైనాను నిలువరించలేకపోవడం, నేపాల్‌తో గత దౌత్యపరమైన సంబంధాలను చెడగొట్టుకోవడం, ఇటీవల కెనడాతో సంబంధాలు క్షీణించడం వంటి అంశాలను చూపించి విదేశాంగ విధానంలో ఎన్డీఏ విఫలమైనట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అయితే, ఓట్ల రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తోందని అది దేశ అంతర్గత భద్రతకు ముప్పు అని బీజేపీ తిప్పికొడుతోంది. కారణాలేవైనా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మును పటిలా దేశంలో రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఓ చేదు వాస్తవం!
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు
విదేశాంగ నీతిలో కొరవడిన మూల సూత్రాలు
Published Fri, Nov 3 2023 5:48 AM | Last Updated on Fri, Nov 3 2023 5:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment