ప్రపంచంలో ఏ దేశానికైనా దాని బలమైన నాయకత్వం దేశాన్ని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుంది. అలాగే ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అందరికీ ఆదర్శంగా నిలి చేలా చేస్తుంది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం విశ్వ గురువుగా తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుందనీ, అది మరెంతో దూరం లేదనీ చెప్పవచ్చు.
మోదీ భారత్ ప్రధానమంత్రి అవ్వడం నూతన శకానికి నాంది అయ్యిందని చెప్పవచ్చు. ప్రపంచ దృష్టిని తన వైపు మళ్లించుకునేలా భారత్ పురోగమిస్తోంది. వసు ధైక కుటుంబం అనే భావన ప్రాచీన కాలం నుంచీ భారత్ నమ్ముతోంది. ఈ భూమిపై ఉన్న సకల చరాచర జీవులనూ ఒకే కుటుంబంగా పరిగణిస్తూ అంతర్జాతీయంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.
జీ20 దేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి చేరిందంటేనే భారత్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతుంది. జీ20 దేశాలకు నాయకత్వం వహించడం ద్వారా 75 శాతం ప్రపంచ జీడీపీకి, 75 శాతం ప్రపంచ వర్తకానికీ, 66 శాతం ప్రపంచ జనాభాకీ ఒక మార్గదర్శిగా భారతదేశం మారిం దనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ ఘనత సాధించడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశం వివిధ దేశాలతో సాగించిన అంతర్జాతీయ వ్యవహారాలూ, అంతర్గతంగా దేశ ఆర్థిక స్థిరత్వానికీ ముందుచూపుతో మోదీ తీసుకున్న విధాన నిర్ణయాలూ కారణాలుగా చెప్పుకోవచ్చు.
2012లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం 11వ స్థానంలో ఉండగా 2022 సంవత్సరం నాటికి అది 5వ స్థానానికి ఎగబాకటం వెనుక ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ముఖ్యంగా నోట్లను రద్దు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన దొంగ నోట్ల చలామణీని అడ్డుకోవడం, బ్లాక్ మనీ నిర్మూలనా చేయగలిగాం. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ద్వారా లెక్కలలోకి రాకుండా ఉన్న అవ్యవస్థీకృత ఆర్థిక కార్యక్రమాలన్నీ స్థూల దేశీయోత్పత్తి గణనలోకి తీసుకురావడం జరిగింది. దీని వల్ల కేంద్ర ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది.
మేధో వలస లను నివారించి దేశ అభివృద్ధిలో మేధావులయిన యువతను ఉప యోగించుకోవడానికి ‘స్టార్ట్ అప్ ఇండియా’నూ, స్వదేశంలోనే మనకు కావలసిన వస్తూత్మత్తిని సాగించే ‘మేకిన్ ఇండియా’నూ కార్యరూపంలో పెట్టారు మోదీ. తద్వారా ఆర్థిక వ్యవస్థను మును పెన్నడూ లేని విధంగా బలోపేతం చేయడం జరిగింది. నైపుణ్యం ఉండి పెట్టుబడులు పెట్టడానికి మూలధనం లేని వారికి ‘ముద్ర యోజన’ పథకం ద్వారా నిధులను అందుబాటులోకి తేవడం, రాయితీలతో కూడిన మూలధనాన్ని అందించి సన్న, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగింది.
ప్రపంచ దేశాలు ఈరోజు ఇంధన కొరత సమస్యతో ఇబ్బంది పడుతూ ద్రవ్యోల్బణంలోకి జారిపోతున్నాయి. అభివృద్ధి చెందా యని చెప్పుకొంటున్న అమెరికా, యూరప్ దేశాలలో ద్రవ్యో ల్బణం 7 శాతం పైగా నమోదు కాగా... భారతదేశంలో సుమారు 5 శాతం, లేదా మరి కొంత ఎక్కువగా నమోదయి స్థిరంగా కొన సాగుతోంది. ధరల నియంత్రణకు భారతదేశం తీసుకున్న ద్రవ్య, కోశ విధానాలతోపాటూ... రష్యా నుండి చౌకగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత 8 ఏళ్లుగా భారతదేశం సగటున 6.5 శాతంతో స్థిరమైన ఆర్థిక వృద్ధితో ముందుకు వెళ్తోంది.
ఒకప్పుడు భారతదేశం చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ నుంచి మహిళలు ఉపయోగించే పిన్నీసులు, ఇతర గృహోపకరణాల దాకా తాను ఉత్పత్తి చేయకుండా దిగుమతులపై ఆధారపడడం జరి గింది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతూ వచ్చింది. అదే సమయంలో చైనా ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఉత్పత్తులకు భారతదేశం ఒక మార్కెట్‌గా మారింది. గత ఎనిమిది సంవ త్సరాలుగా పీఎం మోదీ నాయకత్వంలో తీసుకున్న ఆర్థిక సంస్కరణలు వల్ల ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్‌లో 2022 సంవత్సరానికి భార త్ 62వ స్థానానికి చేరుకుంది. 2012 –13 కాలానికి 192 దేశాలలో భారత్ స్థానం 133 లేదా 132 స్థానంలో ఉండేది.
ప్రస్తుత ర్యాంకింగ్ భారతదేశం విదేశీ పెట్టుబడులకు ఎంత అనుకూలమైన వాతావరణం కలిగి ఉందో తెలియ జేస్తోంది. గత 22 ఏళ్లుగా (1999–2021) మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం విలువ 847 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో గత 8 (2014–2021) ఏళ్లలోనే 440 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇది మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 51 శాతంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మౌలిక సదుపాయాలు పెరిగాయి. దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తూ, విదేశీ చెల్లింపుల శేషం లోటును తగ్గించడం జరిగింది.
ఇలాంటి తరుణంలో ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక సమస్యలకూ, వివిధ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలనూ తగ్గించడానికీ, ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించడానికీ అవకాశం ఉన్న జీ20కి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ ప్రజలందరం ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా ఉంటూ ‘ప్రపం చానికి భారత్, భారత్‌కు ప్రపంచం’ అన్న నినాదంతో ముందుకు సాగుదాం.
డాక్టర్ కె. లక్ష్మణ్
వ్యాసకర్త ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్
Comments
Please login to add a commentAdd a comment