
దేశం కోసం అంబేడ్కర్ కన్న కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉందని, ఆయన సూచించిన దిశలో జాతి పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూని వాటి ఆచరణకు నడుం బిగించారు.
స్వాతంత్య్రానంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించే సందర్భంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఉద్దేశించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. భారత్ ఒక దేశంగా మారిందని, ఒక పటిష్టమైన జాతిగా పునర్నిర్మాణం జరిగే అవకాశాన్ని పొందిందని, అందుకు కొన్ని లక్షణాలు కలిగివుండాలని.. అవి సమాజంలో నెలకొన్న కుల, మత, ప్రాంతీయ, భాషా అసమానతలను అధిగమించడమేనని పేర్కొన్నారు. స్వతంత్ర భారత మొదటి న్యాయ శాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ ప్రధాన రూపకర్తగా భారతదేశ పురోగతికి వారు చూపిన మార్గం సదా అనుసరణీయం. ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజ కీయవేత్త, సంఘసంస్కర్త అయిన బీఆర్ అంబేడ్కర్.. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో రాంజీ మాలోజీ సక్పాల్, భీమాబాయి సక్పాల్ దంపతులకు జన్మించారు.
భారతీయ సమాజంలో కుల వివక్ష, బడుగు, బలహీన వర్గాలకు సౌకర్యాల లేమికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ తన జీవితమంతా పోరాడారు. ఆధునిక బౌద్ధ ఉద్యమాన్ని ప్రోత్సహించి.. దళి తులు, మహిళలు, శ్రామికుల సామాజిక వివక్షను రూపుమాపేందుకు అహర్నిశలు శ్రమించారు. ఏ సమసమాజ నిర్మాణం జరగాలని అంబేడ్కర్ ఆశిం చారో.. ఆ సమాజాన్ని నిర్మించే దిశగా, ఆయన సూచించిన దిశలో జాతి పునర్నిర్మాణానికి మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మంత్రంతో అందరికీ అభివృద్ధి ఫలాలను అందించే లక్ష్యంతో.. ఎటువంటి వివక్షత లేకుండా పనిచేస్తున్నది.
అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజం గురించి అంబేడ్కర్ కలలుగన్నారు. ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తి నుండే మొదలు కావాలన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బోధించిన ‘అంత్యోదయ’ లక్ష్యం కూడా అంబేడ్కర్ కలగన్న సమసమాజ నిర్మాణానికి ఒక ప్రాతిపదికగా భావించవచ్చు. దేశం కోసం అంబేడ్కర్ కన్న కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉందని, వారు చూపిన ఆలోచనలు, ఆదర్శాలు కోట్లమందికి సరికొత్త శక్తిని ఇస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ’మహాపరినిర్వాన్ దివస్’ సందర్భంగా పునరుద్ఘాటించారు.
‘కొన్నిసార్లు, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని దళితుల సమస్యలకే పరిమితం చేయడం ద్వారా, జాతి నిర్మాణానికి వారుచేసిన కృషిని తక్కువ చేసి చూపిస్తున్నారు. కానీ వారు అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ పరితపిం చారు. ప్రపంచం మార్టిన్ లూథర్ కింగ్‌ను చూసినట్లుగానే మేం అంబేడ్కర్‌ని చూస్తాం’ అని ప్రధాని నరేంద్రమోదీ.. రాజ్యాంగ నిర్మాతపై తమ ప్రభుత్వానికున్న గౌరవాన్ని స్పష్టంగా వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ రాజకీయ ఐక్యత కోసం పనిచేసినట్లుగానే.. అంబేడ్కర్ సామాజిక ఐక్యత, దేశ సమానత్వం కోసం పనిచేశారని ప్రధాని గుర్తు చేశారు.
సమాజంలోని పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ తన జీవితాన్నంతా ధారపోశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా పథకాలను ప్రతిపాదిం చింది. అధికారంలోకి వచ్చినప్పటినుంచే ఆయా వర్గాల సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నడుం బిగించారు. వచ్చే ఐదేళ్లలో 4 కోట్లకు పైగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రాయోజిత ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’ పథకంలో మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకుగానూ మొత్తం రూ. 59 వేల కోట్లను కేటాయించింది.
‘స్టాండప్ ఇండియా’ పథకంలో భాగంగా దేశంలో 2.5 లక్షల ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూడా కేంద్రం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉంది. ప్రధాని ఆలోచనల మేరకు స్టాండప్ ఇండియా పథకం ఎస్సీ, ఎస్టీలలో ప్రత్యేకించి మహిళా వ్యాపారులను, పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. సమాజంలో అణచివేతకు గురైన పేద, దళిత వర్గాల ఆర్థిక సంక్షేమం కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దళిత మూలధన నిధిని ప్రారంభించింది.
ఆర్థికంగా వెనుకబడిన, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని సామాజిక వర్గాలలో ఉన్న పేద వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. దళితులు, గిరిజనులు, ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ప్రయోజనాలు ప్రభావితం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల్లోని పేద ప్రజలకు రిజర్వేషన్లు వర్తింపజేసింది. విద్య, ఉపాధిలో అందరికీ అవకాశాలను కల్పించే ఆశయంతో ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం.. అంబేడ్కర్ జీవనంతో సంబంధమున్న (జన్మిం చినప్పటి నుంచి నిర్యాణం వరకు) అన్ని ముఖ్యమైన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ‘అంతేకాకుండా అంబేడ్కర్ గౌరవార్థం స్మారక చిహ్నాలను నిర్మించడానికి కృషి చేస్తోంది. నిరంతర ప్రయత్నాల తరువాత, బాబాసాహెబ్‌కు సంబంధించిన ముఖ్యమైన క్షేత్రాలను పంచతీర్థ్‌గా అభివృద్ధి చేయడాన్ని బీజేపీ గర్వంగా భావిస్తోందని, ఇది తమకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తామని ప్రధాని పలు సందర్భాల్లో వెల్లడించారు. అంబేడ్కర్ జన్మస్థలం సందర్శన అయినా, చైత్య భూమి (అంబేడ్కర్ అంత్యక్రియలు జరిగిన స్థలం) వద్ద ఒక స్మారక చిహ్నాన్ని అభివృద్ధి చేయడానికి, మహారాష్ట్రలోని ఇందూ మిల్లు భూమిని కొనడం, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నాగ్‌పూర్‌లోని దీక్షాస్థలిని అభివృద్ధి చేయడం, ఢిల్లీలోని 15 జనపథ్‌లో అంబేద్కర్ మహాపరినిర్వాన్ స్థల్ వద్ద ఒక స్మారకాన్ని నిర్మిస్తూ.. ఈ కేంద్రాలను పంచతీర్థ్‌గా అభివృద్ధి చేయడానికి మోదీ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ విశిష్టతను ప్రస్తావిస్తూ, బాబాసాహెబ్ బోధనలు, వారి సందేశాలను అర్థం చేసుకోవటానికి భక్తి భావం ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ, సామాజిక ప్రయోజనాలతో పని చేయడం బాబాసాహెబ్ మాకు నేర్పించారని, వారు చూపిన మార్గం ఎప్పటికీ తమను సరైన దిశలోనే తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
జి. కిషన్ రెడ్డి
వ్యాసకర్త హోంశాఖ సహాయ మంత్రి