నేనే రాజు.. నేనే మంత్రి - | Sakshi
Sakshi News home page

నేనే రాజు.. నేనే మంత్రి

Published Sun, Jun 16 2024 1:20 AM

నేనే రాజు.. నేనే మంత్రి

టీజీ ఎన్పీడీసీఎల్‌లో సమాంతర వ్యవస్థ నడిపిస్తున్న ఓ డివిజన్‌ అధికారి

హన్మకొండ: ‘ఇక్కడ నేనే రాజు... నేనే మంత్రి అన్నట్లుగా ఓ డివిజన్‌ అధికారి వ్యవహరిస్తున్న తీరు టీజీ ఎన్పీడీసీఎల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సంస్థ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ విధానాలు, పాలక మండలి తీసుకున్న నిర్ణయాల మేరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నడుచుకుంటారు. కానీ ఆ డివిజన్‌ అధికారి మాత్రం తన ఆలోచనలు, నిర్ణయాలు ఆచరిస్తూ టీజీ ఎన్‌పీడీసీఎల్‌కు సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారని విద్యుత్‌ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఎన్పీడీసీఎల్‌ వ్యాప్తంగా డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు, ఎస్‌ఈలు, డీఈలు, మానవ వనరుల విభాగం అధికారులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ సంస్థ నిబంధనలు ఆచరిస్తూ అమలు చేస్తుంటే హనుమకొండ సర్కిల్‌లోని ఈ డివిజన్‌ అధికారి అవేమీ తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో ఉద్యోగం చేస్తూ, జీతం తీసుకుంటూ సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి..

టీజీ ఎన్పీడీసీఎల్‌లో డిప్యుటేషన్లపై నిషేధం కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ సమయంలో ఎటువంటి బదిలీలు, డిప్యుటేషన్లు ఉండొద్దు. అయినా ఈ డివిజన్‌ అధికారి ఏప్రిల్‌ 4న పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ఉండగా సంస్థ నిబంధనలను పక్కనపెట్టి ఇద్దరు ఉద్యోగులకు డిప్యుటేషన్‌ వేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రెండు రోజుల తర్వాత పాత తేదీ ఏప్రిల్‌ 4వ తేదీతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రద్దు చేస్తున్నట్లు మరో ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పాటు ఆదే తేదీతో వర్క్‌ ఆర్డర్‌ పేరుతో అదే డిప్యుటేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌లో డిప్యుటేషన్‌ వేసే అధికారం కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌కు మాత్రమే ఉంది. ఒకవేళ డిప్యుటేషన్‌ అవసరమైతే సీఎండీ నుంచి అనుమతి పొందాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండా వర్క్‌ ఆర్డర్‌ పేరుతో డిప్యుటేషన్‌ కొనసాగిస్తుండడం గమనార్హం. మే 17న ‘సాక్షి’లో ‘ఎన్పీడీసీఎల్‌లో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతోపాటు పలు విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు దిద్దుబాటుకు ఉపక్రమించారు. మే మాసం రెండో పక్షంలో ఏప్రిల్‌ 4కు ముందు డిప్యుటేషన్‌కు అనుమతి కోరుతున్నట్లు హనుమకొండ సర్కిల్‌కు లేఖ రాశారు. ఏప్రిల్‌లో చేసిన డిప్యుటేషన్‌కు మే రెండో పక్షంలో లేఖ రాయడం, ఈ లేఖపై హనుమకొండ ఎస్‌ఈ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలోని సీఈ స్థాయి అధికారుల ద్వారా ఎస్‌ఈపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‌లో హనుమకొండ సర్కిల్‌ కార్యాలయంలో డీఈ టెక్నికల్‌గా ఉన్న విజేందర్‌రెడ్డి మేలో సెలవుపై వెళ్లారు, ఈస్థానంలో మరో అధికారికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. పాత తేదీతో లేఖ పంపగా.. ఆ లేఖపై సీఈ స్థాయి అధికారుల ఆదేశంతో ఎలాంటి తేదీ వేయకుండా ఎస్‌ఈ సంతకం చేసినట్లు తెలిసింది. డివిజన్‌ కార్యాలయం నుంచి మేలో డిస్పాచ్‌ నంబర్‌–1.. తేదీ 1–4–2024తో లేఖ పంపితే అదనపు బాధ్యతల్లో ఉన్న డీఈ టెక్నికల్‌ మాత్రం తనకు లేఖ అందిన మే 24 తేదీతో సంతకం చేసి సంబంధిత సెక్షన్‌కు పంపారు. పర్సనల్‌ ఆఫీసర్‌ కూడా మే 24న తన చేతికి వచ్చినట్లు నమోదు చేసినట్లు సమాచారం.

బిల్‌కౌంటర్ల ఎత్తివేత..

విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడానికి ప్రతి విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయం (ఈఆర్‌ఓ)లో బిల్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ డివిజనల్‌ అధికారి తన డివిజన్‌ పరిధి రెండు బిల్‌ కౌంటర్‌లు ఎత్తివేశారు. యాజమాన్యం, సీఎండీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన సొంత నిర్ణయాలు అమలు చేస్తూ.. బిల్‌ కౌంటర్లు లేకుండా చేశారు. దీంతో విద్యుత్‌ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎన్పీడీసీఎల్‌కు వచ్చే ఆదాయ మార్గాలను మూసి వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ డివిజనల్‌ ఇంజనీర్‌ వ్యవహార శైలితో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆయన వేధింపులు భరించలేక కొందరు అధికారులు, ఉద్యోగులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

నేనే నాయకుడిని..

నాకు ఎదురులేదని బెదిరింపులు

యాజమాన్యం నిబంధనలు

ఆ అధికారికి పట్టని వైనం

తన ఆలోచనలే ఆచరణ..

సంస్థ నిర్ణయాలు ఇక్కడ బేఖాతర్‌

ఇబ్బందులు పడుతున్న కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement