తండ్రి ఆమిర్‌ఖాన్‌తో ఇరా ఖాన్, ఇరా ఖాన్
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది.
బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్‌లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు.
ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్.
స్వయంగా బాధితురాలు
‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు.
అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్.
మానసిక శుభ్రత
‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది.
యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్.
గమనించుకోవాలి
‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్.
మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె.
Comments
Please login to add a commentAdd a comment