Hyderabad Roads: గంతలు కట్టుకున్నారా? గుంతలు కానరాట్లేదా? | - | Sakshi
Sakshi News home page

Hyderabad Roads: గంతలు కట్టుకున్నారా? గుంతలు కానరాట్లేదా?

Published Thu, Aug 3 2023 3:24 AM | Last Updated on Thu, Aug 3 2023 9:53 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వైష్టవి అనే డిగ్రీ విద్యార్థిని ద్విచక్రవాహనంపై కాలేజీకి వెళ్తుండగా బోయిన్‌పల్లిలో రోడ్డుపై గుంతలతో అదుపు తప్పి తండ్రీకూతుళ్లిద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో వారి వాహనం పక్కనుంచి వెళ్తున్న వ్యాన్‌.. వైష్ణవిని ఢీకొనడంతో తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చేరింది.

►బాచుపల్లి రోడ్డు ప్రమాదంలో మూడో తరగతి చదువుతున్న దీక్షిత మరణానికి రోడ్డుపై గుంతలు కూడా ఓ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం జరిగిన తాజా ఘటనలు నగరంలో రహదారుల దుస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలు ఇలా ప్రతిరోజూ ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రేటర్‌ నగరంలో రహదారులు బాగుపడ్డాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వానొస్తే రోడ్లు చెరువులుగా మారే పరిస్థితి తప్పడంలేదు. వాన వెలిశాక అడుగడుగునా గుంతలతో వాహనాలు అదుపు తప్పుతుండటం, గుంతలో పడకుండా వాహనాన్ని సడన్‌గా పక్కకు తప్పించబోయి కింద పడి తీవ్రగాయాలు అవుతుండటం, అడపాదడపా ప్రాణాలు పోవడం పరిపాటిగా మారింది.

నగరంలో ఎక్కడ చూసినా..
► గ్రేటర్‌లో 9వేల కిలోమీటర్లకు పైగా రోడ్లున్నాయి. వాటిలో దాదాపు 900 రోడ్ల నిర్మాణం, నిర్వహణను అయిదేళ్ల పాటు సీఆర్‌ఎంపీ కింద జీహెచ్‌ఎంసీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఈ పథకం కింద చేసిన పనులకు కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇప్పటి వరకు దాదాపు రూ. 1200 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ఒప్పందం మేరకు, రోడ్లకు గుంతలు పడ్డా, ఇరవై నాలుగ్గంటల్లో పూడ్చివేయాలి. కానీ అది జరగడం లేదు. ఇది ప్రధాన రహదారుల్లోని పరిస్థితి కాగా, సీఆర్‌ఎంపీయేతర రహదారులు, కాలనీలు, బస్తీ ల్లోని రోడ్ల పరిస్థితులు పరమ అధ్వానంగా ఉన్నాయి. వానొస్తే చాలు బురద గుంతలుగా మారుతుండటంతో ప్రయాణానికి ఆటంకాలుగా మారాయి. అక్కడా ఇక్కడా అని కాదు నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, రామ్‌నగర్‌, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, కార్వాన్‌, బేగంబజార్‌.. ఎటు చూసినా ఇదే దుస్థితి. అధ్వానపు రోడ్లతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.

అడుగడుగునా గుంతలు
ఇటీవల వర్షాలు కురిసిన పదిరోజుల్లో రోజుకు కనీసం 250 నీరునిలిచిన ఫిర్యాదులందాయి. అందని ఫిర్యాదులు ఇంకా రెట్టింపే ఉంటాయి. నీరు నిలిచిన పలు ప్రాంతాలు గుంతలు పడి,కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. జీహెచ్‌ఎంసీ రోడ్ల నిర్మాణం,నిర్వహణ పనుల కోసం ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా, మూడు విభాగాల ద్వారా క్వాలిటీ పరీక్షలు జరుగుతున్నా పరిస్థితులు మారడం లేవు.

ఇష్టానుసారంగా తవ్వకాలు
ఇందుకు ప్రధాన కారణం అనుమతులున్నా లేకున్నా అడ్డగోలుగా రోడ్లను తవ్వడం. వివిధ అవసరాల కోసమంటూ రోడ్లను తవ్వుతున్నారు. పనులు ఆపడానికి వీలులేని అత్యవసరమైన తాగునీరు, డ్రైనేజీల పేరిట వర్షాకాలంలోనూ రోడ్లు తవ్వుతున్నారు. ఇక విద్యుత్‌, టెలికాం సంస్థలు సైతం రోడ్లను తవ్వుతూనే ఉన్నాయి. దొంగచాటుగా రాత్రివేళల్లో సైతం రోడ్లు తవ్వుతున్నారు.వర్షాలకు పడే గుంతలతోపాటు ఈ తవ్వకాల వల్ల మరింత ప్రమాదకర పరిస్థితులేర్పడుతున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీకి ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపంతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి.

నిధులు ఖర్చు చేస్తున్నా..
గత సంవత్సరం దాదాపు రూ.1273 కోట్ల అంచనా వ్యయంతో 4790 రోడ్ల పనుల్ని చేపట్టారు. వాటిలో 2500 పూర్తయ్యాయి. అందుకు రూ.700 కోట్లు ఖర్చయింది. ఈ సంవత్సరం సైతం సీఆర్‌ఎంపీ మార్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో దాదాపు రూ. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో 2500 పనులు చేపట్టినప్పటికీ, సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో పనులు కుంటుతున్నాయి. వర్షాలొస్తే గుంతల పూడ్చివేతల పేరిట దాదాపు రూ.20 కోట్లు, ప్యాచ్‌వర్క్స్‌ పేరిట దాదాపు రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గడచిన నాలుగైదేళ్లలో రోడ్ల నిర్మాణం, నిర్వహణల పేరిట దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement