
హైదరాబాద్: అతి ఎత్తైన పర్వాతాలను అధిరోహిస్తూ ఇప్పటికే 3 వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్న నగరానికి చెందిన 14 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ మరో వరల్డ్ రికార్డును సాధించాడు. ఈ నెల 17న లద్దాక్ సమీపంలో హిమాలయాల్లోని 6,400 మీటర్ల ఎత్తైన కాంగ్ యాట్సే–1 పర్వతాన్ని అధిరోహించి నాల్గో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విశ్వనాథ్ కార్తికేయ గతంలోనే 6.270 మీటర్ల ఎత్తున్న కాంగ్ యాట్సే పర్వతాన్ని, 6,240 మీటర్ల ఎతైన ద్జోజొంగో పర్వాతాన్ని అధిరోహించి ఈ పర్వతాల శిఖరాగ్రాలను చేరుకున్న అతిపిన్న వయస్కునిగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఐరోపాలోనే అత్యంత ఎత్తైన ఎల్‌బ్రస్ పర్వత తూర్పు(5,621మీ), పడమర(5,642మీ) శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పర్వత శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.
ప్రయాణం సాగిందిలా...,
తన నాల్గో వరల్డ్ రికార్డ్ శ్రీకాంగ్ యాట్సే–1శ్రీను పూర్తి చేయడంలో భాగంగా ఈ నెల 7న 3 వేల మీటర్ల ఎత్తలోని శ్రీలేహ్‌శ్రీకు చేరుకున్నాడు. అనంతరం 5,100 మీటర్ల ఎత్తులోని బేస్ క్యాంపును 13వ తేదీన చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో రెండు రోజుల ట్రెక్కింగ్ తరువాత 5,700 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్–1ను, 16న 5,900 మీటర్ల బేస్ క్యాంప్–2ను చేరుకున్నాడు. చివరగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ నెల 17న 6,400 మీటర్ల ఎత్తైన శిఖరాగ్రాన్ని చేరుకుని రికార్డు సృష్టించాడు.
ట్రెక్కింగ్‌పైన ఆసక్తిని క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అతడి తల్లి లక్ష్మీ తెలిపింది. ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతాలన్నింటినీ అధిరోహించడమే లక్ష్యంగా తన కుమారుడి ప్రయాణం ముందుకు సాగుతుందన్నారు. ట్రెక్కింగ్‌తో పాటు చదువులను సైతం అదే క్రమంలో కొనసాగిస్తున్నాడన్నారు. 4వ వరల్డ్ రికార్డు సాధించిన విశ్వనాథ్ కార్తికేయ ఈ రోజు నగరానికి చేరుకోనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment