హైదరాబాద్: పాతనగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరో రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మజ్లిస్– బీఆర్‌ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని, తాము పోటీ చేయని స్థానాల్లో మాత్రం అధికార బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలకుండా మజ్లిస్ అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనారిటీ ఓట్లు మళ్లకుండా చేయడంతో పాటు పాతబస్తీ పార్టీగా ఉన్న పేరును చెరిపివేసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంంది.
పాతబస్తీలో తాము కచ్చితంగా గెలిచే 7 స్థానాలతో పాటు మరో రెండింటిలో బలమైన అభ్యర్థులు, మిగతా స్థానాల్లో మొక్కుబడిగా రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాలను లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో పార్టీకి బలమైన పట్టు ఉంది.
వాస్తవంగా కూడా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలుపు, ఓటములలో మైనార్టీ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముస్లిం సామాజికవర్గం ఓటర్లు ఎవరికి మొగ్గు చూపితే వారినే విజయం వరించనుంది. కాగా.. రాజేంద్రనగర్ నుంచి శాస్త్రిపురం కార్పొరేటర్ మహమ్మద్ ముబీన్, సులేమాన్‌నగర్ కార్పొరేటర్ అబేదా సుల్తానా భర్త నవాజుద్దీన్, అహ్మద్‌నగర్ కార్పొరేటర్ సోదరుడు గోల్డెన్ హైట్స్ కాలనీ నివాసి సర్ఫరాజ్ సిద్ధిఖీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment