బంజారాహిల్స్: తనకు బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్ష తీర్చుకునేందుకు తాజా ప్రియుడితో కలిసి వేసిన పన్నాగం బెడిసికొట్టి ఓ లా విద్యార్థిని కటకటాలపాలైంది. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు యత్నించి అడ్డంగా బుక్ అయిన సదరు యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా.. రహ్మత్‌నగర్‌కు చెందిన గుండ్రపల్లి అదోక్షజ అలియాస్ రింకి అలియాస్ రీనా(26) కూకట్‌పల్లిలోని అనంత లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ చదువుతోంది. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్‌కు చెందిన కాశగోని శ్రావణ్(30)ని ప్రేమించింది. వారి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగు నెలల క్రితం విడిపోయారు.
బ్రేకప్ అయిన తర్వాత తనను తిరుగుబోతు అని పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోందని, డ్రగ్స్ తీసుకుంటోందని శ్రావణ్ ప్రచారం చేస్తున్నాడని, అతడిపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో గడ్డి అన్నారం ప్రాంతానికి చెందిన తాజా ప్రియుడు దీపక్ మోహన్‌తో కలిసి పథకం వేసింది. పది రోజులుగా ఎన్డీపీఎస్ యాక్ట్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటాన్ని గుర్తించిన ఆమె శ్రావణ్ కారులో గంజాయి ప్యాకెట్లు పెట్టి అతడిని ఇరికించాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా రూ.14 వేలు దీపక్‌కు జీపే చేసింది. దీపక్ తన స్నేహితుడు యశ్వంత్‌సాయికి రూ.3,500 ఇచ్చి ధూల్‌పేట్‌కు వెళ్లి గంజాయి తీసుకురావాల్సిందిగా చెప్పడంతో సోమవారం అతను ఎనిమిది గంజాయి ప్యాకెట్లు కొనుక్కొచ్చాడు.
రింకి, దీపక్, యశ్వంత్‌సాయి, దీక్షిత్‌రెడ్డి, ప్రణీత్‌గోపి, సూర్యతేజ, మహేందర్ యాదవ్ తదితరులు ప్లాన్ ప్రకారం శ్రావణ్‌కు ఫోన్ చేసి కృష్ణకాంత్ పార్కు వద్దకు రావాలని విడిపోయిన రింకీని, నిన్ను మళ్లీ కలుపుతామని నమ్మించారు. శ్రావణ్ కారులో అక్కడికి రాగా వెనక ప్రణీత్, సూర్యతేజ కూర్చోగా ముందు సీట్లో శ్రావణ్ పక్కన దీక్షిత్ కూర్చున్నారు. దీపక్, అదోక్షజ ఇద్దరూ బైక్‌పై జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని అమ్నేషియా పబ్‌కు వచ్చారు. కారులో వస్తున్నప్పుడే పథకం ప్రకారం ప్రణీత్, సూర్యతేజ తమ జేబుల్లో ఉన్న గంజాయి ప్యాకెట్లను శ్రావణ్ సీటు కింద పెట్టారు.
అమ్నేషియా పబ్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఎవరికి వారు ఫోన్లు వచ్చినట్లు నటిస్తూ అక్కడి నుంచి జారుకున్నారు. కిందికి వచ్చిన అదోక్షజ అమ్నేషియా పబ్ ముందు ఓ కారులో గంజాయి ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీసులు పబ్ వద్దకు చేరుకుని తనిఖీలు చేయగా కారు సీట్ల కింద ఎనిమిది గంజాయి ప్యాకెట్లు దొరికాయి. శ్రావణ్‌ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పాడు. తీగలాగితే డొంక కదిలినట్లుగా మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికిద్దామని పక్కా ప్లాన్ వేసిన అదోక్షజ గుట్టు రట్టయింది. అదోక్షజతో పాటు దీపక్ మోహన్, యశ్వంత్‌సాయి, దీక్షిత్‌రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్యతేజ, మహేందర్ యాదవ్‌లపై కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment