ఎన్టీఆర్ స్టేడియంలో గద్దర్ ప్రాంగణం
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది.
ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది.
మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.
కోల్‌కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి.
డిజిటల్ మీడియా వెల్లువలోనూ..
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు.
ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి.
పిల్లలకు ప్రత్యేక పోటీలు..
బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్‌షాపు, గ్రూప్‌డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment