ప్రశ్నించిన పోలీసులపై మద్యం మత్తులో వీరంగం
ఆరు గంటల పాటు రోడ్డుపై బైఠాయింపు
కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు
బంజారాహిల్స్: డ్రంకన్ డ్రైవ్ జరుగుతున్న విషయం తెలుసుకుని డ్రైవర్ సీటులో నుంచి మారిన ఓ యువకుడు తన స్థానంలో ఓ యువతిని కూర్చోబెట్టగా గమనించిన ట్రాఫిక్ పోలీసు ఇదేమిటని ప్రశ్నించడంతో జరిగిన గొడవలో ఇద్దరు మందుబాబులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా నడిరోడ్డుపై కారు నిలిపి న్యూసెన్స్‌కు పాల్పడ్డ యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే..మారేడుపల్లికి చెందిన పర్మార్ సిద్ధార్ధ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా ఆయన స్నేహితుడు పొన్నం శేషశాయి ప్రసాద్ అలియాస్ కిట్టు మరో ముగ్గురు యువతులు కలిసి క్లబ్ రోగ్ పబ్‌లో శుక్రవారం రాత్రి ఒంటిగంట దాకా విందు చేసుకుని తమ కారులో ఇంటికి బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని పార్క్‌హయత్ హోటల్ వద్ద ట్రాఫిక్ ఎస్‌ఐ గోవర్దన్‌రెడ్డి నేతృత్వంలో డ్రంకన్ డ్రైవ్ జరుగుతుండగా ఈ విషయాన్ని కారు నడుపుతున్న సిద్ధార్థ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి సమీపంలో గమనించాడు.
తాను మద్యం సేవించడంతో డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోతాననే ఉద్దేశంతో పక్క సీట్లోకి మారి ఆ సీట్లో ఉన్న యువతిని డ్రైవర్ సీట్లోకి మార్చాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు హరికృష్ణ ఈ విషయాన్ని గమనించి వెంటనే ముందున్న ఎస్‌ఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో సిద్ధార్ధకు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు యత్నించగా సహకరించలేదు. అదే సమయంలో సిద్ధార్ధ స్నేహితుడు శేషశాయి ప్రసాద్ వెనకాల ర్యాపిడో బైక్‌పై వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. కారును నడిరోడ్డుపై ఆపి ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ పోలీసు విధులకు అడ్డుపడ్డారు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం ఉదయం 7 గంటల వరకు..దాదాపు 6 గంటల పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు రోడ్డుపై బైఠాయించి నానా రభస చేశారు. సిద్ధార్ధకు శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం మోతాదు 75 ఎంజీగా తేలింది. ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 110, 292, 132, 221, 351 (2), 126 (2), 324 (2), రెడ్‌విత్ 3 అండ్ 5 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment