రోడ్డును మింగేశారు..
బంజారాహిల్స్: ఇంటి ముందు ఖాళీ స్థలం కనిపిస్తే కాస్తా ముందుకు జరగడం పరిపాటి. అయితే తమ ఇళ్ల ముందు ఉన్న రోడ్డునే దిగమింగేసి ఎన్నో ఏళ్లుగా ఏమీ జరగనట్లు నటిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు తమ కళ్ల ముందే ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–36 పోలీస్ స్టేషన్ వెనుక రెండు రోజుల క్రితం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్వయంగా వెళ్లి సుమారు 1300 గజాల జీహెచ్‌ఎంసీ స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని మేయర్ ఆదేశాలతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన లేఅవుట్‌లో రోడ్డునెంబర్–19 నుంచి 21 వైపు ఎల్ ఆకారంలో సుమారు 40 అడుగుల వెడల్పుతో సుమారు 550 అడుగుల పొడవు గల లింక్ రోడ్డు ఉన్నట్లు స్పష్టంగా మ్యాపుల్లో కనిపిస్తుంది. దీనిలో కొంతభాగం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక ఖాళీగా ఉంది. సదరు ఖాళీ స్థలంలో పోలీస్ స్టేషన్ పరిదిలో సీజ్ చేసిన వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో పాటు ప్లాట్‌నెంబర్ 457, 456, 455, 454,, 453 ప్లాట్ల వెనుక నుంచి రూట్స్ కాలేజ్ పక్క వరకూ లింక్ రోడ్డు ఉండేది. కాగా ప్లాట్ నెంబర్ 457 వెనుక ఉన్న సుమారు 1250 గజాల స్థలాన్ని సదరు ఇంటి యజమాని దర్జాగా ఆక్రమించుకుని భారీ ప్రహరీ నిర్మించాడు. తన ఇంటికి చెందిన ప్రహరీ నుంచి రోడ్డు స్థలాన్ని మొత్తం కూరగాయల తోటగా మార్చేశారు. ఇది బయట నుంచి పార్కు స్థలంగా కనిపించేలా కొన్నాళ్ల పాటు జీహెచ్‌ఎంసీ బోర్డు సైతం పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా రెండేళ్లుగా ఈ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు ఏకంగా కూరగాయల తోటనే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్థలం పక్క నుంచి ఉన్న రోడ్డు స్థలాన్ని సైతం మరి కొందరు భవన నిర్మాణ దారులు దర్జాగా ఆక్రమించుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ప్లాట్ నెంబర్ 471, 472, 473, 474లతో పాటు 453 ప్లాట్ల యజమానులు సుమారు 1500 గజాల రోడ్డు స్థలాన్ని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ సుమారు రూ.60 కోట్లు పైగానే ఉంటుందని తెలుస్తోంది. మేయర్ పర్యటన అనంతరం ప్లాట్‌నెంబర్ 457 వెనుక కబ్జాకు గురైన 1250 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రహరీలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు మిగిలిన 1500 గజాల స్థలాన్ని కూడా ఆక్రమణల భారీ నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
కదులుతున్న ఆక్రమణల డొంక..
మేయర్ పర్యటనతో మరిన్ని కబ్జాలు వెలుగులోకి
అధికారులపాత్రపై అనుమానాలు..
అధికారుల తీరుపై అనుమానాలు..?
ఇదిలా ఉండగా నగర మేయర్ వచ్చి చూసే దాకా ఇంత ఖరీదైన స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే స్థానిక టౌన్‌ప్లానింగ్, యూబీడీ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలుతలెత్తుతున్నాయి. పేదలు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకున్నా గద్దల్లా వాలిపోయే టౌన్‌ప్లానింగ్, హైడ్రా సిబ్బంది నగరలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన రోడ్డు స్థలాన్ని బడాబాబులు దర్జాగా ఆక్రమించుకుంటే ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఈ ఆక్రమణలపై సొసైటీ పెద్దలు సైతం జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఇప్పటికై నా కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment