ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్‌లను జనం ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు.
ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.
ఎందుకీ తీవ్ర కాలుష్యం?
థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి.
విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్‌లాండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్‌వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా.
ఇక రాజధాని బ్యాంకాక్‌లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన దానికంటే థాయ్‌లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్‌లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది.
వేధిస్తున్న నిధుల కొరత
మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్‌లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్‌లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది.
స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్‌పీస్ థాయ్‌లాండ్, ఎన్విరాన్‌మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్‌లాండ్ క్లీన్ ఎయిర్ నెట్‌వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
14.49 లక్షల మంది బాధితులు
థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్‌లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి.
బ్యాంకాక్‌లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్‌లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక వైద్యశాలలు
► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది
► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి.
► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేశారు.
► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్‌లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment