సాక్షి, వెబ్‌డెస్క్: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. చిన్న తనంలో మనం విన్న కథల్లో దెయ్య కథలది ఓ ప్రత్యేక స్థానం. పెద్దలు, స్నేహితులు దెయ్యం కథలు చెబుతున్నపుడు భయపడుతూ వినేవాళ్లం. ఆ రాత్రి వాటిని గుర్తుకు తెచ్చుకుని విపరీతంగా భయపడి సరిగా నిద్రకూడా పోయేవాళ్లం కాదు. ‘ఇంకోసారి దెయ్యం కథలు వినకూడదు బాబోయ్’ అని ఆ రాత్రే తీర్మానం కూడా చేసుకునేవాళ్లం. అయితే, మళ్లీ దెయ్యం కథలు వినడానికి తీరుకునేవాళ్లం. దెయ్యం కథల మీద ఆసక్తి మనల్ని దెయ్యం పట్టినట్లు పట్టి పీడించేది మరి.
ప్రాంతాల వారీగా కొన్ని దెయ్యం కథలు బాగా ప్రచారంలో ఉండేవి. కొందరు కొన్నింటిని తమ ఇంట్లో వారికి.. తమకే జరిగినట్లుగా పిల్లలకు చెప్పేవారు. గీకుర మల్లయ్య.. దెయ్యం కొంప.. మేక దెయ్యం లాంటి కథలు ఒక్క మనదగ్గరే కాదు ప్రపంచ నలుమూలలా ప్రచారంలో ఉన్నాయి. అలాంటిదే సంకెళ్ల దెయ్యం కథ..
ప్రాచీన ఏథెన్స్‌లో ప్రచారంలో ఉండిన సంకెళ్ల దెయ్యం కథ :
ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందనే కథ ప్రచారంలో ఉండటంతో అక్కడ ఉండటానికి జనం భయపడేవారు. అయితే, ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆ ఇంటిలోకి చేరాడు. ఆ రోజు రాత్రినుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినపడసాగింది. ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది. గొలుసుల శబ్ధానికి మేలుకున్న వారికి మసి కొట్టుకుపోయి, చిరిగిన దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు.
సంకెళ్లతో ఉన్న ఆవ్యక్తి ఇంటి సభ్యుల దగ్గరకు వచ్చి, తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయాలని ప్రాథేయపడేవాడు. ఆ వ్యక్తి ప్రతి రోజు రాత్రి అలా సంకెళ్లతో వచ్చి కుటుంబసభ్యులను ప్రాథేయపడుతుంటంతో వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ సంకెళ్ల వ్యక్తి ఎవ్వరికీ కనిపించలేదు. ఎవరైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు. తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయమని ప్రాథేయపడేవాడు. ఈ దెయ్యం కథను విన్న ‘‘అథెనోడొరస్’’ అనే వ్యక్తి ఆ ఇంట్లో దిగాడు. ఆ ఇంట్లో ఏ దెయ్యమూ లేదని నిరూపించటం అతడి ఉద్ధేశ్యం. అయితే, అతడి ఆలోచనలను తలకిందులుచేస్తూ ప్రతి రోజు రాత్రి ఇంటి బయటినుంచి సంకెళ్ల చప్పుడు వినపడేది. తనను సంకెళ్లనుంచి విముక్తుని చేయమని ఓ వ్యక్తి మాటలు కూడా వినపడేవి.
ఓ రోజు రాత్రి అథెనోడొరస్ ధైర్యం తెచ్చుకుని శబ్ధం వస్తున్న వైపు వెళ్లాడు. అలా ఆ శబ్ధాన్ని ఫాలో అవుతూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి కాళ్లు భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. అథెనో అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంకెళ్లనుంచి బయటకు విడిపించమని ప్రాథేయపడ్డాడు. కొన్ని నిమిషాల తర్వాత మాయమయ్యాడు.
ఉదయం కాగానే అథెనో సంకెళ్ల మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు. అక్కడో కుళ్లిన శవం బయటపడింది. రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్లతో బంధించి ఉంది. అథెనో సంకెళ్లను తీసి, ప్రజలతో కలిసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఎవ్వరికీ ఆ సంకెళ్ల దెయ్యం మళ్లీ కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment