వాషింగ్టన్: అమెరికా నివాసి అలిస్సాకు అనుకోని వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ తీవ్ర ఉద్వేగానికి గురి చేసింది. కొద్దిసేపు ఆమె కాళ్లు చేతులు ఆడలేదు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తేరుకున్న తర్వాత కలా నిజమా అంటూ తనను తానే గిల్లి చూసుకుంది. నిజమని తేలడంతో ఫుల్లు ఖుషీ అయ్యింది. అలిస్సాను ఇంతలా టెన్షన్ పెట్టిన ఆ కాలర్ ఎవరంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. అవును ఆయనే అలిస్సాకు కాల్ చేశారు. డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు ఓటు వేయాల్సిందిగా కోరారు. వారు మాట్లాడుకుంటూ ఉండగా అలిస్సా ఎనిమిది నెలల కుమారుడు ఏడుపు లంకించుకున్నాడు. ఎందుకంటే ఒబామాతో మాట్లాడటానికట. దాంతో మాజీ అధ్యక్షుడు ఆ చిన్నారిని ఎలా ఉన్నావ్ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: నల్లజాతి కళ్లలోంచి మన కులవ్యవస్థ)
కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దాంతో ఒబామా ఇలా ఫోన్‌లోనే బైడెన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఫోన్ బ్యాంకింగ్ అంటారు. దానిలో భాగంగా అలిస్సాకు కాల్ చేశారు. ఇక తనకు ఒబామా కాల్ చేశాడని తెలియడంతో అలిస్సా ఆశ్చర్యంతో ఒకింత ఆందోళనకు గురవుతారు. బైడెన్, కమలా హారిస్‌కు ఓటు వేయడానికి తాను ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నాని అలిస్తా ఒబామాతో అంటారు. అలానే బైడెన్‌కు ఓటు వేయాల్సిందిగా తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పమని ఒబామా ఆమెను కోరారు. అవసరమైతే ఆమె పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా తెలియజేస్తాను అన్నారు. వీరి సంభాషణ కొనసాగుతుండగా చిన్నారి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. (చదవండి: బైడెన్ కోసం బరాక్ ప్రచారం)
దాని గురించి ఒబామా అలిస్సాను ప్రశ్నించగా.. ఎనిమిద నెలల తన చిన్నారి జాక్సన్ ఏడుస్తున్నాడని.. ఎవరైనా కాల్ చేస్తే తను కూడా వారితో మాట్లాడాలని ఏడుస్తాడని తెలిపింది. దాంతో ఒబామా హాయ్ జాక్సన్.. ఏం జరుగుతుంది అని పలకరిస్తారు. ఆ తర్వాత చిన్న బిడ్డ తల్లిని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేస్తారు. 2016 ఎన్నికల సమయంలో కూడా ఒబామా హిల్లరీ క్లింటన్ తరఫున రెండు నెలల పాటు ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment