Biological weapons in the Ukraine war: జీవాయుధాలనగానే జేమ్స్‌బాండ్ సినిమా నుంచి దశావతారం సినిమా వరకు కళ్లముందు కదలాడతాయి. ఒక్క బుల్లెట్ పేలకుండా, ఒక్క బాంబు పేలకుండా శత్రు దేశాన్ని, ముఖ్యంగా శత్రుదేశంలోని మనుషులందరినీ సైలెంట్‌గా లేపేయడానికి వీటిని విలన్లు వాడుతుంటారు. అయితే సినిమాల్లో కన్నా నిజజీవితంలో వీటి వాడకం అత్యంత విలయాన్ని సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు లేదా కీటకాలను కృత్రిమంగా వృద్ధి చేసి వాటిలో హానికారక లక్షణాలను పెంపొందించి శత్రువులపై ప్రయోగిస్తారు.
వీటినే జీవాయుధాలంటారు. వీటి ప్రయోగంతో శత్రుప్రాంతంలో కావాల్సిన జీవజాతిని టార్గెట్ చేసుకొని నాశనం చేయవచ్చు. ఇలా చేసే యుద్ధాన్నే బయోలాజికల్ వార్‌ఫేర్ లేదా జీవాయుధ యుద్ధం అంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో జీవాయుధాల ప్రయోగ అవకాశాలున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా ఒక ప్రమాదకరమైన ల్యాబ్‌లో జీవాయుధాలు సృష్టిస్తోందని అమెరికా ఆరోపిస్తోంటే, అమెరికానే ఉక్రెయిన్‌లో రహస్యంగా బయోవెపన్స్ తయారు చేస్తోందని రష్యా ప్రత్యారోపణ చేస్తోంది. తాజాగా ఐరాసలో అమెరికా రాయబారి మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా జీవాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని చెప్పడంతో అందరి దృష్టి ఈ ల్యాబ్‌లపైకి మరలింది. అటు ఉక్రెయిన్ తరఫున అమెరికా కానీ, ఇటు రష్యా కానీ జీవాయుధాలు ప్రయోగిస్తాయన్న భయాలు ఒక్కమారుగా పెరిగాయి.
వెక్టార్ ల్యాబ్
ద స్టేట్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ... పేరు వినగానే ఏదో పేద్ద పరిశోధనా శాల అనుకుంటారు. కానీ ఇది పుతిన్ బయోవెపన్స్ ఖజానా అని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. సైబీరియాలో ఉన్న ఈ జీవాయుధశాల జగత్ ప్రసిద్ధం. ఇందులో స్మాల్‌పాక్స్ నుంచి ఆంత్రాక్స్ వరకు పలురకాల వైరస్‌లను జాగ్రత్తగా నిల్వ ఉంచారు. దీని చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది. 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బిల్డింగ్‌ను రష్యన్లు వెక్టర్ ఇనిస్టిట్యూట్ అని పిలుచుకుంటారు.
ప్రపంచంలోని సుప్రసిద్ధమైన, అత్యంత భద్రతాయుక్తమైన 59 బయోలాబ్స్‌లో ఇది ఒకటి (కరోనాతో సంబంధమున్న వూహాన్ ల్యాబ్ వీటిలో ఒకటి). ఇందులో మానవాళికి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను నిల్వ చేసి పరిశీలించేందుకు అనుమతులున్నాయి. రష్యా 1992 తర్వాత దేశంలోని బయోవెపన్ ల్యాబ్స్‌ను మూసివేస్తూ వచ్చింది. ఈ క్రమంలో దీన్ని కూడా మూసివేస్తామని గతంలోనే రష్యా ప్రకటించింది. ప్రస్తుతం దీంట్లో కేవలం వ్యాక్సిన్లను మాత్రమే తయారు చేస్తున్నట్లు రష్యా చెబుతుంది.
కానీ ఇందులో జీవహననానికి అవసరమైన బయో వెపన్ ప్రోగ్రామ్‌ను రష్యా నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీన్ని వెంటనే మూసివేయాలని పలుమార్లు అమెరికా డిమాండ్ చేసింది. అయితే జీవాయుధాల తయారీ అమెరికానే చేస్తోందని, ఉక్రెయిన్‌లో అమెరికా రహస్య ల్యాబులు నెలకొల్పిందని రష్యా ఆరోపించింది. అయితే ఉక్రెయిన్‌లోని ల్యాబులు కేవలం బయోవెపన్లను గుర్తించి నిరోధించేపని మాత్రమే చేస్తాయని అమెరికా వివరిస్తోంది.
ఏమున్నాయి?
వెక్టర్ ల్యాబ్‌లో స్మాల్‌పాక్స్ వైరస్‌తో పాటు మార్‌బర్గ్ వైరస్ కూడా ఉంది. ఇది సోకిన వారిలో 88 శాతం మంది మృత్యువాత పడతారు. అలాగే ఇందులో ఎబోలా వైరస్ కూడా నిల్వ ఉంచారు. గతంలో ఈ సంస్థకు అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ డ్రొజ్‌డోవ్ 2017లో అదృశ్యమయ్యాడు. అతని వద్ద ఈ ల్యాబ్‌కు, ఇందులోని ఆయుధాలకు సంబంధించిన అనేక వివరాలున్నాయని అనుమానం.
కానీ ఇంతవరకు అతని ఆచూకీ తెలియరాలేదు. 2019లో ఈ ల్యాబ్‌లో గ్యాస్ సిలెండర్ పేలుడు సంభవించింది. అప్పుడు చెలరేగిన మంటలనార్పేందుకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో ల్యాబ్ నుంచి ఎలాంటి జీవాయుధ రసాయనాలు విడుదల కాలేదని అధికారులు చెప్పారు. తమ ల్యాబులో కేవలం ప్రాణాంతక వ్యాధులకు యాంటీడోసులను తయారు చేయడం మాత్రమే జరుగుతుందని చెప్పారు.
బీడబ్ల్యూసీ ఏం చెబుతోంది
జీవాయుధాల ప్రయోగాన్ని నిషేధించే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ద బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ (బీడబ్ల్యూసీ)ని రూపొందించుకున్నాయి. దీని ప్రకారం ఏ దేశం కూడా జీవాయుధాలను తయారు చేయడం, నిల్వ చేయడం నిషిద్ధం. 1975లో అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంపై 2022 నాటికి 183 దేశాలు సంతకాలు చేశాయి. పది దేశాలు మాత్రం దీనిపై సంతకాలు చేయలేదు.
సంతకాలు చేసిన దేశాల్లో యూఎస్, రష్యా కూడా ఉన్నాయి. ఈ ఒప్పందంలోని 1, 2 అధికరణల్లోని అంశాలను రష్యా ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపణ. నిజానికి ఈ ఒప్పందానికి అనుగుణంగానే రష్యా అధికారికంగా తన బయోవెపన్ ల్యాబులను మూసివేసింది. ప్రస్తుతం ఈ వెక్టర్ ల్యాబ్‌లో 1500మంది సిబ్బంది ఉన్నారు. అలాగే ప్రపంచంలో స్మాల్‌పాక్స్ వైరస్‌ను నిల్వ ఉంచేందుకు అనుమతులున్న రెండు కేంద్రాల్లో వెక్టర్ కేంద్రం ఒకటి. రెండో కేంద్రం అమెరికాలోని సీడీసీ సంస్థ. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుంటారు.
(చదవండి: రష్యా అణు చెలగాటం)
Comments
Please login to add a commentAdd a comment