
నమ్ పెన్: కంబోడియా దేశంలో గత 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హున్ సెన్ మరోసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరైన ప్రతిపక్షమే లేని దేశంలో కంబోడియన్ పీపుల్స్ పార్టీ అధినేత హున్ సెన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు.
ఈ ఆదివారం జులై 23న కంబోడియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నామమాత్రంగా జరిగే ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని హున్ సెన్ మళ్ళీ ఆ పీఠాన్ని అధిష్టించి అత్యధిక కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన ప్రధానిగా రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల సంగతి అటుంచితే అక్కడ సరైన ప్రతిపక్షమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నియంత పాలన కొనసాగుతుందని స్థానికుల్లో ఒకరు తెలిపారు.
2018లో జరిగిన గత ఎన్నికల్లో హున్ సెన్ మొత్తం 125 పార్లమెంటు సీట్లకు గాను 125 సీట్లను గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని బలహీనమైన ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేసి గెలిచారని చెబుతుంటారు. మరికొంత మంది ఆయన రిగ్గింగ్ కు పాల్పడి గెలిచారని చెబుతుంటారు. ఏదైతేనేం చట్టసభల్లో ప్రతిపక్షం లేకుండా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు హున్ సెన్.
నియంత ఖైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానిగా 1985లో బాధ్యతలు చేపట్టిన హున్ సెన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2013లో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా 2018లో మాత్రం పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది. దగ్గరగా నలభై ఏళ్ల హున్ సెన్ పాలనలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది.1990లో ప్రజాస్వామ్య హోదా దక్కించుకున్న కంబోడియాలో ఈ సారైనా ప్రతిపక్షంలో ఎవరో ఒకరు కూర్చుంటారని ఆశిస్తున్నారు స్థానికులు.
ప్రతిపక్షంలో ఎవరు కూర్చున్నా ప్రధానిగా మాత్రం హున్ సెనే పీఠమెక్కనున్నారనేది సుస్పష్టం అంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు.
ఇది కూడా చదవండి: పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది
Comments
Please login to add a commentAdd a comment