వ్యాక్సిన్ల పనితీరును ఎలా లెక్కిస్తారు?! | Coronavirus : How Vaccine Efficacy Decides | Sakshi
Sakshi News home page

కరోనాపై వ్యాక్సిన్‌ సామర్థ్యం 90 శాతం అంటే ఏమిటీ?

Published Sat, Nov 28 2020 3:38 PM | Last Updated on Sat, Nov 28 2020 4:37 PM

Coronavirus : How Vaccine Efficacy Decides - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ రెండో విడత విజృంభణ ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న నేపథ్యంతో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కరోనా నిరోధక వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు  వరుసగా 70 శాతం, 90 శాతం, 95 శాతం సత్ఫలితాలను ఇస్తున్నాయంటూ వాటిని తయారు చేస్తోన్న కంపెనీలు ప్రకటించాయి. అంటే ఏమిటీ? వంద మంది వ్యాక్సిన్లు తీసుకుంటే 70 మంది, 90 మంది లేదా 95 మందికి కరోనా వైరస్‌ రాలేదనా? లేదా వచ్చినా దానంతట అదే తగ్గిపోతుందనా? కాదు,  అది ఎంత మాత్రం కాదు.

వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేయడానికి ఓ చిత్రమైన మేథమెటికల్‌ ఫార్ములాను అమలు చేస్తున్నారు. సాధారణంగా వ్యాక్సిన్ల పనితీరును మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా అంచనా వేస్తారు. స్వల్పకాలిక ప్రయోజనం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం, వాక్సిన్ల సామర్థ్యాన్ని అంచనావేయడం కోసం ఈ మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. స్వల్పకాలిక ప్రయోజనం తొలి దశ ట్రయల్స్‌లోనే తెల్సిపోతుంది. అన్నింటికన్నా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌లోనే అసలు వ్యాక్సిన్ల సామర్థ్యం రుజువవుతుంది. ఈ మూడు దశల క్లినికల్‌ అధ్యయనాలు పూర్తి కాకుండా వ్యాక్సిన్ల డోస్‌ల తయారీకి అనుమతి ఇవ్వకూడదంటూ దేశీయ, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు సూచిస్తున్నాయి. రష్యా తయారు చేస్తోన్న ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌కు కీలకమైన మూడవ ట్రయల్‌ను నిర్వహించకుండానే ఉత్పత్తికి, మార్కెటింగ్‌కు రష్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదాస్పదం అవడం తెల్సిందే. 

మూడవ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఎలా నిర్వహిస్తారు?
వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలనే అంశంపై 1915లో ప్రచురితమైన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రముఖ మేథమేటీషియన్స్‌ ఎం. గ్రీన్‌ హుడ్, జీయూ యూలే ప్రతిపాదించిన మ్యాథమేటికల్‌ ఫార్ములానే నేటికీ ప్రమాణంగా ఉపయోగిస్తున్నారు. వైరస్‌ అటాక్‌ రేట్‌ (ఏఆర్‌) ఎంత శాతం తగ్గుతుందనే అంశంపైనే వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఇందుకోసం మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా రెండు వాలంటీర్ల బృందాన్ని ఎంపిక చేస్తారు. రెండు బృందాల సంఖ్య సమంగా ఉండేలా చూస్తారు. అలా కుదరని పక్షంలో ఏ బృందంలో ఎంత మంది ఉంటే ఎంత మందిపై ప్రభావం ఉందనేదాన్ని నిష్పత్తి ద్వారా నిర్ధారిస్తారు. 

లెక్క కోసం రెండు బృందాల్లోనూ 50 మంది చొప్పున ఉన్నారనుకుందాం. అందులో ఓ బృందానికి వ్యాక్సిన్‌ డోస్‌లు ఇస్తారు. మరో బృందానికి ‘ప్లేస్‌బో’ ఇస్తారు. ప్లేస్‌బో అంటే ఉత్తుత్తి మందు ఇస్తారు. ఏ బృందానికి నిజమైన వ్యాక్సిన్‌  ఇచ్చారో, ఏ బృందానికి ఉత్తుత్తి మందు ఇచ్చారో చెప్పరు. వారిపై ఎలాంటి మానసిక ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో రెండు బృందాలకు వ్యాక్సిన్‌ డోస్‌లే ఇచ్చామని చెబుతారు. కాకపోతే కాస్త ఎక్కువ, తక్కువ అని సర్ధి చెబుతారు. నిర్ధిష్టకాలంలో వారిపై కరోనా లాంటి వైరస్‌ల ప్రభావం ఎలా ఉందో పరిశీలిస్తారు. 

వ్యాక్సిన్‌ డోస్‌లు తీసుకున్న వారిని ఏఆర్‌వీ గ్రూపని, తీసుకోని వారిని ఏఆర్‌యూ గ్రూపని వ్యవహరిస్తారు. ఏఆర్‌యూ గ్రూపులో ఎంత మంది ఉంటే ఎంత మందికి వైరస్‌ సోకిందీ అన్న లెక్కతో ఏఆర్‌వీ గ్రూపులో ఎంత మంది ఉంటే ఎంత మందికి సోకిందనే లెక్కవేసి, రిస్క్‌ రేట్‌ (ఆర్‌ఆర్‌)ను అంచనా వేస్తారు. రిస్క్‌ రేటు ఎంత తక్కువుంటే వ్యాక్సిన్‌ అంత సామర్థ్యంగా పనిచేస్తున్నట్లు లెక్క. రిస్క్‌ రేట్‌ పది శాతం ఉందనుకుంటే ఆ వ్యాక్సిన్‌ 90 శాతం పనిచేస్తున్నట్లు లెక్క. అదే రిస్క్‌ రేట్‌ 20 శాతం ఉంటే వ్యాక్సిన్‌ 80 శాతం పని చేస్తున్నట్లు లెక్క. 

మోడర్న కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో 30 వేల మంది వాలంటీర్లు పాల్గొనగా, ఫైజర్, బయోఎన్‌టెక్‌ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో 43,538 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ రెండు వ్యాక్సిన్ల ట్రయల్స్‌లోనూ వాలంటీర్లను రెండు సమాన బృందాలుగా విభజించి ఓ బృందానికి వ్యాక్సిన్‌ (ఏఆర్‌వీ), మరో బృందం (ఏఆర్‌యూ)కు ‘ప్లేస్‌బో’ ఇచ్చి ట్రయల్స్‌ నిర్వహించారు. రెస్క్‌ రేట్‌ను లెక్కగట్టి తమ వ్యాక్సిన్‌ సామర్థ్యం 95 శాతమని ఫైజర్‌ కంపెనీ ప్రకటించగా, తమ వ్యాక్సిన్‌ సామర్థ్యం 70 శాతమని ఆక్స్‌ఫర్డ్, 94.5 శాతమని మోడర్న కంపెనీ ప్రకటించడం తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement