4 వేల అడుగుల ఎత్తున్న ఒక పర్వతం.. అక్కడ ఫుట్‌పాత్ సైజులో ఉన్న స్టీల్ ర్యాంప్.. దానిపై ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకెళ్తున్నాడు.. అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.. అంతే.. ఒక్కసారిగా పర్వతం మీద నుంచి జంప్ చేసేశాడు.. అందరి గుండెలు దడదడలాడుతున్నాయి.. మృత్యువుకు అతనికి మధ్య ఉన్నది ఒక్క పారాచూట్ మాత్రమే.. దాన్ని సమయానికి తెరవకుంటే.. అతడి శవం ఆనవాలు కూడా దొరకదు.. పారాచూట్ తెరుచుకుంది. అతడు క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టంట్‌గా పేరొందిన ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆ వ్యక్తి.. టామ్ క్రూజ్.. హాలీవుడ్ డాషింగ్ హీరో.. వయసు జస్ట్ 61 ఏళ్లు!!!
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లోని తాజా చిత్రం డెడ్ రెకనింగ్ పార్ట్ 1 కోసం ఈ సాహసాన్ని చేశారు. సినిమాలో కేవలం 60 సెకన్లు ఉండే ఈ సన్నివేశం కోసం రిహార్సల్స్ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయని ఈ చిత్ర స్టంట్ కోఆర్డినేటర్ ఈస్ట్‌వుడ్ చెప్పారు. శిక్షణలో భాగంగా మన హీరో 13 వేల మోటార్ క్రాస్ జంప్స్, 500 స్కైడైవ్స్ చేశారట. ‘200 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్లి.. పర్‌ఫెక్ట్‌గా జంప్ చేయాలి.
అదే సమయంలో గాలిలో కరెక్టు టైంకి బైక్‌ను వదిలేయాలి.. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్‌ను తెరవాలి. సరిగా బాలెన్స్ చేసుకుంటూ నేలపై దిగాలి. ఇందులో ఏ ఒక్క విషయంలో చిన్నపాటి తేడా జరిగినా ఇక అంతే.. టామ్‌కు చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’ అని ఈస్ట్‌వుడ్ తెలిపారు.
మీకో విషయంలో తెలుసా..?
ఒక బైక్ మీద వేగంగా వెళ్లి.. పర్వతంపై నుంచి దూకి.. వెంటనే పారాచూట్ తెరిచి.. ల్యాండ్ అవ్వాలన్నది టామ్ క్రూజ్ చిన్నప్పటి కల అట. చిన్నప్పుడు ఇంట్లో ర్యాంప్‌లాంటిది ఏర్పాటు చేసుకుని.. సైకిల్ మీద ఇలా జంప్ చేసిన ఘటనలు ఎన్నోనట. అలాగే దెబ్బలు తిన్న ఘటనలు కూడా.. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ స్టంట్‌తో ఇన్నాళ్లకు ఆయన కల తీరిందన్నమాట. ఈ వీడియోను నెట్లో చూసినోళ్లంతా సూపర్ అనేస్తున్నారు. ఏంటీ సింపుల్‌గా సూపరా..
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment