బండెక్కితే వంద దాటాల్సిందే అనేవాళ్లు చాలా మందే ఉంటారు. రోడ్డు బాగుంటే, జనాలెవరూ లేకపోతే ఈ స్పీడు రెండింతలు కూడా అవుతుంటుంది. ఇలాంటి సమయంలోనే కాస్త అటూఇటైతే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశమే లేదా?.. అంటే ‘మై హూనా’అంటోంది కార్ల కంపెనీ ఫోర్డ్. అత్యవసర సమయాల్లో వాహనం వేగాన్ని తగ్గించే ‘జియోఫెన్సింగ్’టెక్నాలజీని రూపొందించింది. సిటీల్లో ఏయే ప్రాంతాల్లో మెల్లగా వెళ్లాలో అక్కడి నిబంధనల ప్రకారం ఓ వర్చువల్ ప్రాంతాన్ని ఈ టెక్నాలజీ డిజైన్ చేస్తుంది.
ఈ ప్రదేశాల్లోకి వాహనం వెళ్లినప్పుడు ఎక్కడైనా వేగం హద్దు మీరినట్టు అనిపిస్తే ‘హలో.. వేగం ఎక్కువైంది’అని డ్రైవర్‌కు ఓ సాఫ్ట్‌వేర్ రెస్పాన్స్‌ను ఈ టెక్నాలజీ చూపిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తగ్గట్టు వేగాన్ని తగ్గించేస్తుంది. వేగం ఎంత తగ్గుతోందో డ్రైవర్ ముందున్న డిస్‌ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. మరి కొన్నికొన్నిసార్లు రోడ్లు ఖాళీగా ఉన్నా, జనాలెవరూ లేకున్నా ఇలా వేగం తగ్గిస్తే పరిస్థితేంటి?.. అంటే ఈ టెక్నాలజీని ఆఫ్ చేసే వెసులుబాటు కూడా డ్రైవర్‌కు ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌తో అనుసంధానమైన వాహనాల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఫోర్డ్ పరిశీలిస్తోంది. మంచి ఫలితాలొస్తున్నాయని కంపెనీ చెబుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment