కార్బిస్ బేలో మాట్లాడుతున్న బైడెన్, బోరిస్
లండన్/ వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో సంపన్న దేశాల కూటమి జీ–7 సదస్సు యూకేలోని కార్నవాల్‌లోని కార్బిస్ బే హోటల్‌లో ఈనెల 11 నుంచి 13 తేదీ వరకు జరగనుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో, ప్రశాంతంగా ఉండే రిసార్ట్‌లో ఆతిథ్య దేశం యూకే ఈ సదస్సుని ఏర్పాటు చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సదస్సు ఈసారి కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులపైనే ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సులో పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇదే మొదటి విదేశీ పర్యటన. ఇక జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చారు. ఈ ఏడాది జీ–7 సదస్సుకి అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరు
కరోనా విజృంభణ కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సదస్సుకి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోతున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరుకానున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ తన యూకే ప్రయాణాన్ని గత నెలలోనే రద్దు చేసుకున్నారు.
92 దేశాలకు 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్లు
నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి అమెరికాలో బైడెన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 50 కోట్ల ఫైజర్ కంపెనీ టీకా డోసుల్ని కొనుగోలు చేసి 92 దేశాలకు పంపిణీ చేయనున్నట్టు వైట్‌హౌస్ వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ జీ–7 సదస్సులో ఒక ప్రకటన చేయనున్నారు. ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై అమెరికాకున్న చిత్తశుద్ధి ఎలాంటిదో ఈ ప్రకటనతో తేటతెల్లమవుతుందని, మరే ఇతర దేశమూ ఇంత భారీ స్థాయిలో సాయాన్ని అందించలేదని వైట్‌హౌస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్ల షిప్పింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేస్తారు, మిగిలిన 30 కోట్ల డోసుల్ని వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో పంపిణీ చేసేలా అమెరికా చర్యలు తీసుకుంది.
అందరికీ టీకా సంపన్న దేశాల బాధ్యత
కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే వచ్చే ఏడాది చివరి నాటికల్లా ప్రపంచ జనాభాకు టీకా ఇవ్వడం పూర్తి కావాలని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ దిశగా జీ–7 దేశాలు చర్యలు తీసుకోవాలని, ప్రపంచ జనాభా వ్యాక్సినేషన్ బాధ్యత సంపన్న దేశాలే తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సదస్సుకి ఒక్క రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే ఎజెండా
► కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో బిల్ట్ బ్యాక్ బెటర్ అన్న నినాదంతో సదస్సు జరగనుంది.
► కోవిడ్‌పై పోరాటంతో పాటు భవిష్యత్‌లో వచ్చే మహమ్మారుల్ని ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం.
► స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రోత్సాహం.
► వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటూ జీవవైవిధ్యాన్ని కాపాడే చర్యలు.
Comments
Please login to add a commentAdd a comment