Elon Musk Birthday: Interesting Facts About Tesla CEO On His 50th Birthday- Sakshi
Sakshi News home page

యాభై ఏళ్ల క్రితం అమ్మ ఒడిలో అలా, ఇప్పుడేమో ఆకాశమే హద్దుగా..

Published Mon, Jun 28 2021 1:30 PM | Last Updated on Mon, Jun 28 2021 2:21 PM

Happy Birthday Elon Musk Special Story And Interesting Facts About Musk - Sakshi

కొత్తగా ఆలోచించడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, కొత్త ఆలోచనలతో అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒక్కడే ఎలన్‌ మస్క్‌. వింత ఆలోచనల పుట్ట, మొండి మేధావి, ముక్కుసూటి మనిషిగా పేరున్న ఎలన్‌ మస్క్‌ 50వ పుట్టినరోజు ఇవాళ. పైన అమ్మ ఒడిలో ఒదిగిన ఆ చిన్నారి కూడా ఎలన్‌ మస్కే.    

వెబ్‌డెస్క్‌: ఎలన్‌ మస్క్‌ కన్నతల్లి మయే మస్క్‌ ఆ ఫొటోను షేర్‌ చేసింది. కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యాభై ఏళ్ల క్రితం అదొక అద్భుతమైన రోజని, తనలో సంతోషాన్ని నింపాడని చెబుతూ.. ప్రేమగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసిందామె. పైగా ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న #HappyBirthdayElonMusk ట్యాగ్‌ను సైతం జత చేసింది. తల్లి పంచిన గుర్తుకు.. సింపుల్‌గా హార్ట్‌ సింబల్‌తో బదులిచ్చాడు మస్క్‌. పోయినవారం ఆమె మస్క్‌, అతని సోదరుడితో ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మస్క్‌ చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేయగా.. ఆయన అభిమానులు మురిసిపోయారు.

పన్నెండేళ్లకే.. 
టెస్లా, స్పేస్‌ ఎక్స్‌, ది బోరింగ్‌ కంపెనీలకు హెడ్‌గా న్యూరాలింక్‌ లాంటి అరుదైన ప్రయోగాలతో ప్రపంచానికి పరిచయమైన మేధావి ఎలన్‌ మస్క్‌. ఒక్క ట్వీట్‌తో కోట్లకు కోట్లకు ముంచెత్తడం,  అదే టైంలో ఒకే ట్వీట్‌తో సంపాదించడం అతనికి తేలికైన పని. అంతేకాదు బిట్‌కాయిన్‌ తలరాతను డిసైడ్‌ చేస్తూ.. డిజిటల్‌ కరెన్సీ మార్కెట్‌ను శాసిస్తుంటాడు కూడా.  1971, జూన్‌ 28న ప్రిటోరియా (దక్షిణాఫ్రికా)లో పుట్టాడు ఎలన్‌ మస్క్‌. తండ్రి ఎర్రోల్‌ ఇంజినీర్‌. తల్లి మయే మస్క్‌ మోడల్‌. వ్యక్తిగత విభేధాలతో మస్క్‌కి తొమ్మిదేళ్లున్నప్పుడు విడిపోయారు. ఆ తర్వాత తండ్రి దగ్గరే పెరిగాడు మస్క్‌(తాను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తండ్రి దగ్గర ఉండడమే అని ఎందుకనో తరచూ చెప్తుంటాడు మస్క్‌). పన్నెండేళ్లకే వీడియో గేమ్‌ను తయారు చేసిన మస్క్‌.. దక్షిణాఫ్రికాలో ఉంటే సైన్యంలో చేరాల్సి వస్తుందన్న భయంతో కెనడాలోని తల్లి దగ్గరకు వెళ్లాడు.

ఆ తర్వాత ఒంటారియో క్వీన్స్‌ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీల నుంచి నుంచి బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌, ఆర్ట్స్‌ కోర్సులు పూర్తి చేసుకుని.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ కోసం ప్రయత్నించాడు. కానీ, రెండో రోజుకే దానిని వదిలేశాడు. నెట్‌స్కేప్‌లో ఉద్యోగాన్ని వదులుకుని సోదరుడితో కలిసి జిప్‌2 అనే వెబ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించాడు. అది అతన్ని మిలియనీర్‌ను చేసింది. ఆపై బ్యాంకింగ్‌ సర్వీస్‌ సంస్థను పేపాల్‌కు అమ్మేసి.. ఏకంగా దానికి సీఈవో అయ్యాడు.

ఆకాశంలో ఆలోచనలు
మస్క్‌ ఆలోచనలన్నీ కొత్తగానే ఉంటాయి. అందుకే తిక్క మేధావి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు అతని అభిమానులు.  బ్యాంకింగ్‌ సర్వీస్‌, స్పేస్‌ ట్రావెల్‌ కంపెనీ, ఎలక్రి‍్టకల్‌ వెహికిల్స్‌, అండర్‌గ్రౌండ్‌ టన్నెల్స్‌, జంతువుల తలలో చిప్‌లతో కంట్రోల్‌ చేయడం.. ఇలాంటి పనులు అతని క్రేజ్‌ను మరింత పెంచాయి. మార్స్‌పై మొక్కలు పెంచాలన్న ఆలోచన నుంచి.. మస్క్‌ బుర్రలో స్పేస్‌ ఎక్స్‌ ఆలోచనకు బీజం పడింది. స్పేస్‌ టెక్నాలజీ కోసం అమెరికా సాయం కాకుండా.. రష్యా సాయం తీసుకోవాలని ప్రయత్నించి ఘోరంగా అవమాన పడ్డాడు.


కలల సామ్రాజ్యం స్పేస్‌ ఎక్స్‌ సంస్థ

అందుకు ప్రతీకారంగానే స్పేస్‌ ఎక్స్‌ను స్థాపించి.. 2008లో ఫాల్కన్‌ లాంఛ్‌ ద్వారా స్పేస్‌ఎక్స్‌ తొలి సక్సెస్‌ చవిచూశాడు. రాబోయే రోజుల్లో ఎలక్రి‍్టక్‌ వెహికిల్స్‌కే భవిష్యత్తు ఉంటుందని నమ్మి.. 2004లో టెస్లాను లీడ్‌ చేయడం ప్రారంభించాడు. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్స్‌ ద్వారా రవాణా, అత్యంత వేగంగా ప్రయాణం, డ్రైవర్‌లెస్‌ కార్లు, గాల్లో ఎగిరే కార్లు, ఇక జంతువుల బ్రెయిన్‌లలో చిప్‌లు జొప్పించి.. ప్రయోగాలు. ఇలా మస్క్‌ మైండ్‌లో ఉండే ఆలోచనలు ఒక్కొక్కటి కార్యరూపం దాలుస్తూ వస్తున్నాయి.


టెస్లా సీఈవో హోదాలో..

విమర్శలు.. వివాదాలు   
బహిరంగంగానే గంజాయి పీల్చే ఎలన్‌ మస్క్‌కు విమర్శలు, వివాదాలు కొత్తేంకాదు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. పరువు నష్టం దావాల కింద మూల్యం చెల్లించుకున్నాడు. ఒకానొక టైంలో సొంత కంపెనీలపై సెటైరిక్‌ ట్వీట్లు వేసి.. ఊహించలేని నష్టాన్ని తెస్తుంటాడు. అయినప్పటికీ కంపెనీని సమర్థవంతంగా నడిపిస్తుండడం, జనాల్లో అతనికి ఉన్న క్రేజ్‌, మేజర్‌ వాటా తదితర కారణాల వల్ల అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.

 

పెళ్లిళ్లు.. డేటింగ్‌లు
మస్క్‌ వ్యక్తిగత జీవితం కూడా ఆగం ఆగమే. గతంలో పలువురితో డేటింగ్‌ చేసిన మస్క్‌.. కెనడియన్‌ రచయిత జస్టిన్‌ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్‌ నటి టలులాహ్‌ రిలేను వివాహం చేసుకున్నాడు. 2012లో రిలేకు విడాకులిచ్చి. ఆ మరుసటి ఏడాది మళ్లీ పెళ్లి చేసుకోవడం విశేషం. చివరికి 2016 రిలేకు విడాకులిచ్చేసి సెలబ్రిటీలతో డేటింగ్‌ చేశాడు. 2018 నుంచి కెనెడియన్‌ సింగర్‌ గ్రిమ్స్‌తో డేటింగ్‌లో ఉన్నాడు మస్క్‌. పుట్టిన కొడుక్కి కూడా అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు.


సింగర్‌ గ్రిమ్స్‌తో ఓ ఈవెంట్‌లో..

ఇక మస్క్‌ డేటింగ్‌ లిస్ట్‌చాలా పెద్దదే. అందులో హాలీవుడ్‌ నటి అంబర్‌ హెర్డ్‌ కూడా ఉంది. మస్క్‌ వెండి, బుల్లితెరలపైనా సందడి చేశాడు. ఐరన్‌ మ్యాన్‌ 2, వై హిమ్‌, మెన్‌ ఇన్‌ బ్లాక్‌:ఇంటర్నేషనల్‌తో పాటు ది సింప్సన్‌, ది బిగ్‌బ్యాంగ్‌ థియరీ, సౌత్‌పార్క్‌, రిక్‌ అండ్‌ మోర్టీ, శాటర్‌డే నైట్‌ లైవ్‌ లాంటి టీవీ కార్యక్రమాలతోనూ రేసింగ్‌ ఎక్స్‌టింగ్షన్‌, వెన్నెర్‌ హెర్‌గోజ్‌ లాంటి డాక్యుమెంటరీలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌ ఆస్తుల విలువ సుమారు 165 బిలియన్ల డాలర్లుగా అంచనా.

ఐరన్‌మ్యాన్‌ 2 సినిమాలో ఓ సీన్‌లో.. 


కన్నతల్లితో మయేతో ఎలన్‌

ఎలన్‌ మస్క్‌.. ఇంజినీర్‌ మేధావా? లేక సైంటిస్టా లేదంటే కాల జ్ఞానినా? ఇలాంటి డౌట్లు చాలామందికే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకైతే కృత్రిమ మేధస్సునే నమ్ముకున్న మొండి మేధావి అని మాత్రం చెప్పొచ్చు. 

చదవండి: మస్క్‌ చిలిపితనం.. పోర్న్‌ కాయిన్లకు మహర్దశ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement