Microsoft: బగ్‌ దెబ్బకు ‘విండోస్‌’ క్లోజ్‌! | Huge Microsoft Outage Linked to CrowdStrike Takes Down Computers Around the World | Sakshi
Sakshi News home page

Microsoft: బగ్‌ దెబ్బకు ‘విండోస్‌’ క్లోజ్‌!

Published Sat, Jul 20 2024 2:29 AM | Last Updated on Sat, Jul 20 2024 10:56 AM

Huge Microsoft Outage Linked to CrowdStrike Takes Down Computers Around the World

విశ్వవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు 

విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థల సేవల్లో తీవ్ర అంతరాయం 

ఇబ్బందులు పడ్డ కోట్లాది మంది యూజర్లు, ప్రయాణికులు 

‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ అప్‌డేట్‌ వల్లే ఇదంతా: మైక్రోసాఫ్ట్‌ వివరణ

వాషింగ్టన్‌/వెల్లింగ్టన్‌/న్యూఢిల్లీ/ఫ్రాంక్‌ఫర్ట్‌: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఒక చిన్న అప్‌డేట్‌ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్‌ సెన్సార్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

 దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్, సరీ్వసెస్‌ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్‌ దాడి కాదు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తప్పుడు అప్‌డేట్‌ను రన్‌ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్‌’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్‌ సీఈఓ జార్జ్‌ కుర్జ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. 
 
ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు 
విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్‌లను యాక్సెస్‌ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్‌/చెక్‌ ఇన్‌ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్‌ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్‌ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్, డెల్టా, అలీజియంట్‌ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్‌ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్‌గా బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. 
 
రైల్వే, టెలివిజన్‌ సేవలకూ అంతరాయం 
బ్రిటన్‌లో రైల్వే, టెలివిజన్‌ స్టేషన్లూ కంప్యూటర్‌ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లోని రెగ్యులేటరీ న్యూస్‌ సర్వీస్‌ అనౌన్స్‌మెంట్స్, నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయని బ్రిటన్‌ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్‌ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి.  
 
బ్యాంకింగ్‌ సేవలకూ దెబ్బ 
తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్‌ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్‌ల వద్దే కాదు, గ్యాస్‌స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద  క్రెడిట్, డెబిట్‌ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్‌బీ, కివిబ్యాంక్‌ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్‌ తెలిపింది. పేమెంట్‌ వ్యవస్థలు, వెబ్‌సైట్లు, యాప్స్‌ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. 
 
భారత్‌లో పరిస్థితి ఏంటి? 
భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్‌ విమానయాన సంస్థలు ఆన్‌లైన్‌ చెక్‌ ఇన్‌ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పలు విమానాల సరీ్వస్‌లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్‌లు రద్దయ్యాయి. ఆఫ్‌లైన్‌లో మ్యాన్యువల్‌గా లగేజ్‌ ‘చెక్‌ ఇన్‌’, బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్‌ చేసి బోర్డింగ్‌ పాస్‌ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.

ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్‌కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వంటి స్టాక్‌ఎక్సే్ఛంజ్‌లు, బ్రోకరేజ్‌ సంస్థలు, బ్యాంక్‌ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. 

పేలిన జోకులు 
కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మాస్క్‌ మైక్రోసాఫ్ట్‌ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్‌’ కాదు. మాక్రో‘హార్డ్‌. మైక్రోసాఫ్ట్‌ వాళ్ల అన్ని సర్వీస్‌లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్‌’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వ్యంగ్యంగా పోస్ట్‌చేశారు.

ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్‌ డెత్‌?:
కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్‌ కనిపించాక కంప్యూటర్‌ రీస్టార్ట్‌ అవడంగానీ షట్‌డౌన్‌ అవడంగానీ జరుగుతోంది. విండోస్‌ అప్‌డేట్‌ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తొలగించి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్‌ ఉల్లంఘనలు, హ్యాకింగ్‌ను రియల్‌టైమ్‌లో అడ్డుకునేందుకు క్రౌడ్‌స్ట్రయిక్‌ సంస్థ తమ సైబర్‌సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్‌కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్‌గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్‌స్ట్రయిక్‌ ఒక చిట్కా చెప్పింది. విండోస్‌10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్‌ షూట్‌ చేయాలో వివరింది. సిస్టమ్‌ను సేఫ్‌ మోడ్‌లో లేదా విండోస్‌ రికవరీ ఎన్విరోన్‌మెంట్‌లో ఓపెన్‌ చేయాలి. తర్వాత  C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్‌ను డిలీట్‌ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్‌ను బూట్‌ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement