టెహ్రాన్: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం అదుపు తప్పుతోందని ఇరాన్ హెచ్చరించింది. తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్-నియంత్రిత గాజా భూభాగంలో ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే ప్రతిస్పందించవలసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది.
'గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలి. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ రకమైన యుద్ధం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీని అంతాన్ని ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత తీసుకునే స్థాయికి వెళుతోంది.' అని ఇరాన్ స్పష్టం చేసింది.
గాజా భూభాగంలో ఇరాన్ మద్దతుగల హమాస్‌పై భూదాడి చేయడానికి ఇజ్రాయెల్ శనివారం సిద్ధమైంది. అధిక జనసాంద్రత కలిగిన ఈ భూభాగంలో పాలస్తీనియన్లను గాజా దక్షిణం వైపు పారిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు అడుగులు వేస్తున్నాయి.
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు.
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు.
ఇదీ చదవండి: ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment